17వేల కోట్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డు

ABN , First Publish Date - 2021-02-23T07:59:36+05:30 IST

హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను కేంద్రం నిర్మించనుందని, ఇందుకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

17వేల కోట్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డు

  • రెండు భాగాలుగా కేంద్రమే నిర్మించనుంది
  • భూసేకరణ వ్యయంలో సగం రాష్ట్ర వాటా
  • భూసేకరణ చేస్తే మూడేళ్లలోనే నిర్మాణం: కిషన్‌ రెడ్డి
  • పార్టీ నేతలతో కలిసి గడ్కరీకి వినతి పత్రం
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను కేంద్రం నిర్మించనుందని, ఇందుకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తద్వారా, హైదరాబాద్‌ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో భాగంగా చేపట్టాల్సిన సంగారెడ్డి - చౌటుప్పల్‌ సెక్షన్‌ను జాతీయ రహదారిగా నోటిఫై చేయాలని సోమవారం కిషన్‌ రెడ్డితోపాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితరులు ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ను రెండు భాగాలుగా కేంద్రం చేపట్టనుంది. హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలో సంగారెడ్డి - నర్సాపూర్‌ - తూప్రాన్‌ - గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌ - యాదాద్రి - భువనగిరి - చౌటుప్పల్‌ వరకు 158 కిలోమీటర్లు నిర్మిస్తుంది. దీనికి ఎన్‌హెచ్‌ 161ఏఏ అనే నంబరు కూడా ఇచ్చింది. ఈ భాగం నిర్మాణానికి కేంద్రం రూ.7,561 కోట్లు ఖర్చు చేస్తుంది. భూసేకరణకు మరో రూ.1,961 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం రూ.9,522 కోట్ల వ్యయం తో ఉత్తర భాగం రోడ్డును నిర్మిస్తుంది’’ అని వివరించారు. ఇక, హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలో చౌటుప్పల్‌ - ఇబ్రహీంపట్నం - కందుకూరు - షాద్‌నగర్‌ - చేవెళ్ల - శంకర్‌పల్లి - సంగారెడ్డి వర కు 182 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపారు. దీని నిర్మాణ పనుల కోసం రూ.4,633 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తుందని, భూ సేకరణకు మరో రూ.1,748 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ రెండు భాగాలు కలిపి దాదాపు రూ.17 వేల కోట్లతో రీజనల్‌ రింగ్‌ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. భూసేకరణకయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50ు నిధులు అంటే, రూ.1,905 కోట్లు భరించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ పూర్తి చేస్తే మూడేళ్లలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని గడ్కరీ తమకు చెప్పారని ఆయన వెల్లడించారు.


పోటాపోటీ వినతులు
రీజనల్‌ రింగ్‌ రోడ్డు మంజూరు చేయాలంటూ కేంద్రానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీగా వినతులు సమర్పిస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని, ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారంటూ ఇటీవల టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. గడ్కరీతో నామా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. రూ.16 వేల కోట్ల అంచనా వ్యయంతో 340 కి.మీ.ల మేర రీజనల్‌ రింగ్‌ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భూసేకరణ వ్యయంలో 50ు భరించేందుకు కూడా ముందుకు వచ్చింది. ఇదే విషయాన్ని గడ్కరీకి నామా తదితరులు తెలిపారు కూడా. ఇక, రెండు రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన సందర్భంగా ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా రింగ్‌ రోడ్డును మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. తాజాగా, సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం కూడా గడ్కరీని కలిసింది. 

Updated Date - 2021-02-23T07:59:36+05:30 IST