దళిత బంధు ఎంతమందికైనా

ABN , First Publish Date - 2021-08-17T08:55:36+05:30 IST

‘‘దళిత బంధును ఎంత మందికి ఇస్తరని అంటున్నరు. ఎంత మందికైనా ఇస్తం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? తెలంగాణలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకూ రూ.10 లక్షల చొప్పున ఇస్తే లక్షా 70 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఏడాదికి ముప్పయి, నలభై వేల కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్‌

దళిత బంధు ఎంతమందికైనా

రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి

పది లక్షల చొప్పున లక్షా 70 వేల కోట్ల ఖర్చవుతుంది

ఏడాదికి 30, 40 వేల కోట్ల చొప్పున బడ్జెట్లో పెడతాం

మూడు నాలుగేళ్లలో దళితవాడలను బంగారు మేడలు చేస్తాం

రైతు బంధు తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకూ దళిత బంధు

ఏడాదిలో పది లక్షలను 20 లక్షల రూపాయలు చేయాలి

దేశంలో జరిగే దళిత ఉద్యమానికి హుజూరాబాదే పునాది

ఇక్కడి అనుభవంతో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో అమలు

ఎవరు సీఎం అయినా నేను పెట్టిన పథకాలను తీసేయలేరు

దళిత బంధు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


కరీంనగర్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘దళిత బంధును ఎంత మందికి ఇస్తరని అంటున్నరు. ఎంత మందికైనా ఇస్తం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? తెలంగాణలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకూ రూ.10 లక్షల చొప్పున ఇస్తే లక్షా 70 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఏడాదికి ముప్పయి, నలభై వేల కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్‌ పెట్టి మూడు, నాలుగేళ్లలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రైతుబంధు తరహాలోనే దళిత బంధు పథకాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్‌ అన్నారు.


ఎలాంటి భూములు, జాగలు లేని వాళ్లకు ముందు వరసలో, ఆ తర్వాత కొందరికి, ఉద్యోగులకు చివరగా ఇస్తామన్నారు. భవిష్యత్తులో భారత దేశంలో జరిగే దళిత ఉద్యమానికి హుజూరాబాద్‌ పునాది రాయి కావాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌ నియోజక వర్గంలోని శాలపల్లిలో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలుత అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌ రావు చిత్ర పటాలకు పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం, ‘జై భీం’ అంటూ సీఎం కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘గతంలో ఇదే వేదిక నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టాను. ఇప్పుడు రైతులంతా గర్వపడుతున్నారు. సంతోషపడుతున్నారు. ఆ పథకం బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తోంది. రైతాంగానికి ధీమా పెరిగింది. దళితులు తరతరాలుగా దోపిడీకి, వివక్షకు గురవుతున్నారు. వారికి సామాజిక విముక్తి కలిగించేందుకు మహత్తర ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కరీంనగర్‌ జిల్లా నుంచే సింహగర్జన చేపట్టాం. సెంటిమెంట్‌గా అచ్చి వచ్చిన ఈ జిల్లానే వేదికగా చేసుకున్నాం. మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌ రావులకు పుష్పాంజలి ఘటించి దళిత బంధును ఆరంభిస్తున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. మహా ఉద్యమం. కచ్చితంగా విజయ తీరాలకు చేరుతుంది. ఇందులో అనుమానాలు, అపోహలకు తావుండదు’’ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వస్తుందన్నారు. ‘‘ఈ కిరికిరిగాళ్లున్నరు. ఒకేసారి చెబితే హార్ట్‌ ఫెయిలై చస్తరని ఒకటి తర్వాత ఒకటి చెబుతున్నా. దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయి. ఇవాళ్టి నుంచి పట్టుబడితే వెన్నెల విరజిమ్మాలి’’ అని ఆకాంక్షించారు.


ఉద్యమం చేపట్టినప్పుడు అయ్యేదా, పోయేదా అని మాట్లాడారని, కానీ, రాష్ట్రాన్ని సాధించి చూపెట్టామని, అనేక పథకాలను తీసుకొచ్చి అద్భుత విజయాలు సాధించామని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్‌ ఇచ్చామని, ఇంటింటికీ మిషన్‌ భగీరథ ద్వారా కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారుతున్నాయని, వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, పట్టుదల ఉంటే దళిత బంధు కూడా అద్భుత విజయం సాధిస్తుందని ఉద్ఘాటించారు. హుజూరాబాద్‌ అనుభవంతో రాష్ట్రంలోని మిగిలిన 118 నియోజక వర్గాల్లోనూ అమలు చేస్తామన్నారు.


ఏ సీఎం అయినా ఆలోచన చేసిండా!?

దళిత బంధు పథకం అమలుపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం అయినా... దేశంలో ఏ ప్రధాని అయినా, ఏ పార్టీ అయినా, ఇంకెవడన్నా ఇంటికి 10 లక్షలు ఇవ్వాలన్న ఆలోచన చేశారా? అని సీఎం కేసీఆర్‌ నిలదీశారు. వాళ్లే ఇప్పుడు అయ్యేదా, పోయేదా అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఏడాది కిందట ఈ పథకం ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల ఆలస్యమైంది. పక్కలో బాంబులు పడినట్లు కిరికిరిగాళ్లు, కొండిగాళ్లు.. కీ.. కా.. అని అంటున్నరు. ఏకాన కొత్త ఇవ్వనోడు మాట్లాడుడు మొదలు పెట్టిండ్రు. దళితులు బాగు పడవద్దా? కుండ బద్దలు కొట్టి చెబుతున్నా. ఇచ్చేవాడు ఇస్తడు.. తీసుకునే వాడు తీసుకుంటడు. నడుమ వీళ్లకెందుకు కడుపు నొప్పి!?’’ అని మండిపడ్డారు. పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత తీసుకోవాలని దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, విద్యార్థులను కోరారు. పరిపాలనా యంత్రాంగమంతా కలిసికట్టుగా పని చేస్తుందని, దళితబంధు పథకాన్ని వందకు వంద శాతం అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. ఒకట్రెండు నెలల్లో హుజూరాబాద్‌లో అందరికీ దళితబంధు ఇస్తామన్నారు. రాష్ట్రమంతటా దీన్ని అమలు చేస్తామన్నారు.


పాతికేళ్ల కిందటే శ్రీకారం

దళితబంధు ఇప్పుడు పుట్టింది కాదని, 25 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రసమయి బాలకిషన్‌ తాను కలిసి ‘దళిత చైతన్య జ్యోతి’ని అమలు చేశామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అప్పుడే పాటలు, క్యాసెట్లు చేశామన్నారు. సిద్దిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా దళితుడైన దానయ్యను నియమించేందుకు సంతకం పెట్టానని అన్నారు. అప్పటి నుంచే ఈ పథకం తన మస్తిష్కంలో ఉందన్నారు. అంబేడ్కర్‌ పుణ్యమా అని రిజర్వేషన్ల వల్ల కొన్ని పదవులు వచ్చాయని, కొందరు విద్యావంతులూ ఉద్యోగాలు చేస్తున్నారని, అయినా ఇంకా 95 శాతం మంది పేదరికంలో, గుండెలనిండా బాధను అణుచుకుంటూ బతుకుతున్నారని అన్నారు. వీరికి విముక్తి కల్పించాలని భావించామని, అందుకే దళితబంధును తీసుకు వచ్చామన్నారు. దీనికి హుజూరాబాద్‌ ఒక ప్రయోగశాల అని, ఇక్కడ అందరికీ ఇస్తామని, ఇక్కడితో మీ కథ అయిపోతుందని, తన కథ మొదలవుతుందని అని సీఎం అన్నారు.


‘‘రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 75 లక్షలు దళితులే. ఇది ప్రజాస్వామ్యమే అయితే, ప్రజలు ప్రభువులే అయితే.. మరి దళిత ప్రజలు ఎందుకు ప్రభువులుగా లేరు? ఎందుకిట్ల ఉన్నారు? దళిత సమాజంపై భారతదేశ సమాజం అవలంబిస్తున్నది వివక్ష కాదా!? ఈ వివక్ష ఎన్ని యుగాలు, ఎన్ని శతాబ్దాలు కొనసాగాలి? ఎన్నేళ్లు బాధలతో ఉండాలి!?’’ అని ప్రశ్నించారు. దళితులు అలా ఉండకూడదని, అదే దళిత బందు ఉద్యమ లక్ష్యమని చెప్పారు. హుజూరాబాద్‌కు 500 కోట్లే ఇచ్చారని పేపర్లలో రాస్తున్నారని, అందరికీ ఇస్తామని, మరో రెండు వేల కోట్లు బాజాప్తా ఇస్తామని అన్నారు. ఈ పథకానికి వంద శాతం బ్యాంకు లింకేజీ ఉండదని, కిస్తీలు కట్టే కిరికిరి ఉండదని, బాకీలు వసూలు చేసే బాధలు ఉండవని తేల్చి చెప్పారు. ఎలాంటి నిబంధనలు ఉండవని, ఎవరికి నచ్చిన పని వారు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. ఇద్దరు, ముగ్గురు కలిసి ఆయిల్‌ మిల్‌ గానీ, వైన్‌, బారు షాపులు, రైస్‌మిల్లులు పెట్టుకోవచ్చని సూచించారు. ఇప్పుడిచ్చే 10 లక్షలను ఏడాది తర్వాత 20 లక్షలు చేయాలన్నారు. తానయితే ఈ పథకంతో 15 బర్రెలు కొనుక్కుని డెయిరీ పెట్టుకుంటానని, రోజుకు 50 లీటర్ల పాలు అమ్మితే రోజుకు రెండు వేలు, నెలకు 60 వేలు, ఏడాదికి 7.20 లక్షలు సంపాదిస్తానని వివరించారు.


ఎవరైనా ప్రమాదం బారినపడో, అనారోగ్యం బారినపడో మరణిస్తే వారిని ఆదుకునేందుకు రక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం లబ్ధిదారులు 10 వేలు, ప్రభుత్వం 10 వేలు జమ చేసి బ్యాంకుల్లో పెడుతుందని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఆదుకునేందుకు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా దళితుల్లో స్ఫూర్తిని నింపడానికి గోరటి వెంకన్న, మరొక కవి రాసిన ‘మట్టిలోంచి సిరులు తీసే మహిమ మీకున్నది..’; ‘చుక్కల ముగ్గులేసినట్లు చెల్లెలా.. సక్కంగా కూడబెట్టు చెల్లెలా’ అనే పాటలను ఉదహరించారు. ఆ పాటల్లో చెప్పినట్లు ‘మేము దళితులం.. దరిద్రులం కాదు.. మేం కూడా ధనవంతులమే’నని నిరూపించాలని పిలుపునిచ్చారు. 20 రోజుల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చి మండలాలన్నీ తిరుగుతానని అన్నారు. ఈ పథకం అమలును సీఎంవో నుంచి రాహుల్‌బొజ్జా పర్యవేక్షిస్తారని చెప్పారు.


దేశమే మన వద్ద నేర్చుకునేలా...

మిగతా వర్గాలు కూడా వాళ్ల బాగు కోరుకోవాలని, వాళ్లలోని రత్నాలను, శక్తిని బయటకి తీసుకు వద్దామని, వాళ్లు పెట్టుబడిదారులైతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి కూడా పెరుగుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘ఈ ఉద్యమంతో దేశంలో దళిత జాతి మేల్కొంటుంది. వాళ్లకు ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుకుంటుంది. పిడికిలి ఎత్తి తెలంగాణలో జరిగినది ఇక్కడ ఎందుకు జరగదని నిలదీస్తారు. దేశమే మన వద్ద నేర్చుకుని పోవాలి. అందరం ముందుకు పోయి విజయం సాధించాలి’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. జై దళిత బంఽధు, జై భీం, జైహింద్‌, జై తెలంగాణ అంటూ ముగించారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.


దళిత బంధు సభ సైడ్‌లైట్స్‌

సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 2.45 గంటలకు సభా వేదికపైకి చేరుకున్నారు.

వేదికపై అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సభలో కేసీఆర్‌, సీఎస్‌ సోమేష్‌కుమార్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాత్రమే మాట్లాడారు.

రాజకీయ పార్టీల నాయకులను విమర్శించకుండా సుమారు 56 నిమిషాలు దళిత బంఽధు పథకంపైనే సీఎం మాట్లాడారు.

హుజూరాబాద్‌ మండలం కనుకులగిద్దెకు చెందిన కొత్తూరి రాధ సీఎం చేతుల మీదుగా దళిత బంధు మొదటి చెక్కును అందుకున్నారు.

సీఎం సభ బందోబస్తు కోసం సుమారు నాలుగు వేల మంది పోలీసులు విధులు నిర్వహించారు

ముఖ్యమంత్రి 4.20 గంటలకు సభాస్థలి నుంచి హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు.


నేను పెట్టిన పథకాలను ఎవరూ తీసేయలేరు

ఎన్నికలు వస్తుంటాయని, పోతుంటాయని, ఎవరో ఒకరు గెలుస్తారని, తాను పెట్టిన పథకాలను ఎవరూ తీసేయలేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎవరూ మధ్యలో ఆపేయలేరని, ఈ మేరకు బలమైన పునాది వేశానని చెప్పారు. దళిత బంధు వచ్చినా మిగిలిన అన్ని కార్యక్రమాలూ కొనసాగుతాయన్నారు. గ్రామంలో ఆరుగురు, మండలాల్లో 15 మంది, నియోజకవర్గాల్లో 24 మందితో, జిల్లాల్లో 42 మందితో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. మొత్తంగా లక్షా 25 వేల సైన్యం దళిత బంధు పథకాన్ని పర్యవేక్షిస్తుందని చెప్పారు. దళితులు పెట్టుబడిదారులు అయితే అది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ పథకం గురించి తన భార్యకు చెబితే దళితులకు చేయి అని చెప్పి ఆశీర్వచనాలు ఇచ్చారని, భారతదేశం నేర్చుకునేలా మనం పని చేయాలని అన్నారు.


హుజూరాబాద్‌

Updated Date - 2021-08-17T08:55:36+05:30 IST