కాలనీల్లో కన్నీళ్లు

ABN , First Publish Date - 2020-10-19T08:20:33+05:30 IST

పగబట్టినట్లుగా వరద పోటు విరుచుకుపడుతుండటంతో పట్నం కన్నీరు పెడుతోంది. మాయదారి వర్షం మిగిల్చిన వరదకు శివార్లలోని చెరువులకు పెద్ద గండ్లు పడుతున్నాయి. ఆ నీరంతా రోడ్లు, లోతట్టు

కాలనీల్లో కన్నీళ్లు

  • వందలాది బస్తీలు ఇంకా నీళ్లలోనే.. 15 వేల ఇళ్లు అంధకారంలోనే
  • బాలాపూర్‌ గుర్రం చెరువుకు గండి 
  • వరద పోటుకు పాతబస్తీ అతలాకుతలం
  • గ్రౌండ్‌ ఫ్లోర్‌ వరకు వచ్చిన వరద నీరు
  • కట్టుబట్టలతో బంధువుల ఇళ్లకు
  • నగరానికి కృష్ణా ఫేజ్‌-3 బంద్‌
  • హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్ల ఎత్తివేత
  • హయత్‌నగర్‌ కార్పొరేటర్‌పై మహిళ దాడి
  • నాలా కబ్జా తొలగించలేదని ఆగ్రహం


కాళ్ల కిందకు నీళ్లు.. కళ్లల్లో కన్నీళ్లు! పగబట్టినట్టుగా విరుచుకుపడుతున్న వరుణుడి దెబ్బకు.. వరద పోటుకు.. పట్నం కన్నీరు పెడుతోంది!! రాజధానిలోని పలు కాలనీలు.. శివార్లలోని లోతట్టు ప్రాంతాలు.. ఇప్పటికీ నడుంలోతు నీళ్లల్లోనే ఉన్నాయి! ఇది చాలదన్నట్టు.. మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు పడతాయనే హెచ్చరికలు ఆయా ప్రాంతాల ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.


 హైదరాబాద్‌ సిటీ/ అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పగబట్టినట్లుగా వరద పోటు విరుచుకుపడుతుండటంతో పట్నం కన్నీరు పెడుతోంది. మాయదారి వర్షం మిగిల్చిన వరదకు శివార్లలోని చెరువులకు పెద్ద గండ్లు పడుతున్నాయి. ఆ నీరంతా రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల్లోకి పొంగిపొర్లుతోంది. నడుం లోతు వరద నిలిచిన ఇళ్లు.. బియ్యం సహా తడిసిన నిత్యావసరాలు.. ఇంటిల్లిపాది పస్తులు.. ఎవ్వరినీ కదిలించినా ఉబికివస్తున్న కన్నీళ్లతో గోస వెళ్లబోసుకుంటున్నవారే. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే వరదలకు నాని, ఉబ్బిపోయిన గోడలతో ఎప్పుడేం జరుగుతోందోనని భయంతో వణికిపోతున్నారు. 


వరదలకు పాతబస్తీనైతే అల్లకల్లోలమైంది. చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా కాలనీల్లోకి నీళ్లు పొంగుకొచ్చి నడుంలోతు దాకా నిలిచాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బాలాపూర్‌లోని గుర్రం చెరువు కట్ట 50 ఫీట్ల మేర తెగిపోయింది. ఆ నీరంతా పాతబస్తీలోని సాయిబాబానగర్‌, శివాజీనగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌, అరుంధతీకాలనీ, పార్వతీనగర్‌, క్రాంతినగర్‌లోకి పొంగిపొర్లింది. గ్రౌండ్‌ ఫోర్లలోని ఇళ్లలోకి నీరు రావడంతో నిద్రలో ఉన్నవారు ఏం జరిగిందోనని తెలుసుకునేలోపే ఇళ్లను నీళ్లు ముంచెత్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి అంతా ఇళ్లపైకి ఎక్కారు. చాలాచోట్ల చూస్తుండగానే వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయాయి. బాగానగర్‌, చాంద్రాయణగుట్ట రహదారిపై భారీ నీళ్లు నిలిచాయి. ఆటోలు, బైక్‌లు, కార్లు కొట్టుకుపోయాయి. పాతబస్తీలోని అలీనగర్‌, అల్‌జుబైల్‌ కాలనీ, గాజిమిల్లత్‌ కాలనీ, ఆషామాబాద్‌ ప్రాంతాలన్నీ ఇంకా నీళ్లలోనే ఉన్నాయి.


వరదకు కొట్టుకొచ్చిన వ్యర్థాలతో దుర్గంధం అలుముకుందని.. అధికారులకు ఫోన్‌ చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. ఉప్పల్‌, నల్లచెరువు, రామంతాపూర్‌ అప్పా చెరువులకు గండ్లు పడటంతో సమీపంలో పీర్జాదిగూడ, మేడిపల్లి, రామాంతాపూర్‌, టోలీచౌకీలోని నదీంకాలనీ, ఫలక్‌నుమా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాగోల్‌ డివిజన్‌లోని అయ్యప్ప కాలనీ, మల్లికార్జున్‌నగర్‌, మల్లికార్జున్‌నగర్‌ ఫేజ్‌-2 ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు రావడంతో చాలా మంది కట్టుబట్టలతో బంధువుల ఇళ్లకు వెళ్లారు. శనివారం సాయంత్రం ఇళ్లకు చేరి శుభ్రం చేసుకునే సమయంలోనే మళ్లీ వర్షానికి వరద పోటెత్తడంతో తలపట్టుకున్నారు. మల్లికార్జున్‌నగర్‌లోని ఓ ఇంటి నిండా నీరు చేరడంతో కుటుంబసభ్యులంతా ఇంటిపైకి చేరి టార్పాలిన్‌ కవర్‌ కప్పుకొని రాత్రంతా అక్కడే గడిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 


హిమాయత్‌సాగర్‌ మళ్లీ 

 నాలుగు రోజుల క్రితం హిమాయత్‌సాగర్‌లో 13 గేట్లను ఎత్తివేశారు. వరద తీవ్రత తగ్గడంతో మూసేసిన అధికారులు, శనివారం కురిసిన వర్షంతో మళ్లీ నాలుగు గేట్లను ఎత్తివేశారు.


జాతీయ రహదారిపై వరద 

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని బాటసింగారం-మజీద్‌పూర్‌ మధ్య వాగు ఉప్పొంగడంతో అటుగా వెళ్తున్న కారులో అందులో చిక్కుకుపోయింది. స్థానికులు దాదాపు 4 గంటలు శ్రమించి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని బయటకు తీశారు. లష్కర్‌గూడ చెరువు ఉధృతికి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరింది. అబ్బుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ ప్రాంతంలో నేషనల్‌ హైవేపై వరద ఉధృతి పెరుగుతోంది. ఇటు అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు, అటు కొత్తగూడెం వరకు ఎన్‌హెచ్‌-65పై వాహనాలు నిలిచిపోయాయి. చైతన్యపురి వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. వాహనాలు మనిగేంత వరద రావడంతో రాకపోకలను నిలిపివేశారు. ఆవైపు వచ్చిన పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరూర్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీలో మనుషులు మునిగేంతా పెద్ద వరద ప్రవహిస్తోంది. 


హైదరాబాద్‌కు కృష్ణా ఫేజ్‌-3 బంద్‌

హైదరాబాద్‌కు నీటి సరఫరా జరిగే కృష్ణా ఫేజ్‌-3ని వాటర్‌బోర్డు అధికారులు నిలిపివేశారు. గుర్రం చెరువు కట్టకు సమాంతరంగా ఉన్న కృష్ణా ఫేస్‌-3 రింగ్‌మెయిన్‌ 1500ఎంఎం డయా పైపులైన్‌ ఉంది. చెరువు కట్ట తెగడంతో పైపులైన్‌ దెబ్బతినకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా మంచినీళ్ల సరఫరాను వాటర్‌బోర్డు నిలిపివేసింది. పైపులైన్‌కు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలకు దిగిన వాటర్‌బోర్డు అధికారులు నీటి సరఫరా నిలిచిపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి, బుద్వేల్‌, హైదర్‌గూడ, అత్తాపూర్‌, సులేమానగర్‌, భోజగుట్ట, మెహదీపట్నం, కార్వాన్‌, అల్లాబండ, షేక్‌పేట, టోలిచౌకి, లాంగర్‌హౌస్‌, కిస్మత్‌పూర్‌, మణికొండ, ఎంఎం పహాడి, మాదాపూర్‌, ప్రశాసన్‌నగర్‌, శాస్త్రీనగర్‌, మల్లేపల్లి, రాజేంద్ర నగర్‌ ప్రాంతాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాటర్‌బోర్డు అధికారులు పేర్కొన్నారు. 24గంటల్లో నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


అంధకారంలో 15 వేల కుటుంబాలు!

హైదరాబాద్‌లో 200పైగా ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో చీకట్లు

ఐదు రోజులుగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): బయటకు వెళ్దామంటే అడుగు తీసి అడుగు వేయలేనంతగా బురద.. పోనీ ఇంట్లోనే ఉందామంటే చిమ్మ చీకటి. రాత్రయితే చాలు దోమల బెడద. ఇదీ హైదరాబాద్‌లో ముంపునకు గురైన కాలనీవాసుల పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లోని చాలా కాలనీలు, అపార్టుమెంట్ల సెల్లార్‌లలో వరద నిలవడంతో విద్యుత్‌ నిలిపివేశారు. ఐదు రోజులైనా సరఫరా కొలిక్కి రాకపోవడం, మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడివారంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ముంపునకు గురైన 20పైగా కాలనీల్లో ఇంకా వరద తగ్గలేదు. సబ్‌ స్టేషన్ల నుంచి సరఫరా ఉన్నా ఈ కాలనీల పరిధిలోని దాదాపు 250 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు అందించలేని పరిస్థితి. దీంతో ఉప్పల్‌, నాగోల్‌, సరూర్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌లలో 15 వేల కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వరద నీటిని తోడితేనే సరఫరా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏఈలు, లైన్‌మెన్‌లు తీవ్రంగా కృషి చేస్తున్నా.. వర్షాలతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వర్షాలకు సబ్‌ స్టేషన్‌లలోకి భారీగా వరద చేరింది. డీజిల్‌ మోటార్లతో వాటిని తోడి పోస్తున్నారు. దీంతో ఆదివారం అత్తాపూర్‌, రంగారెడ్డి జిల్లా కోర్టుల సబ్‌ స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందులు తొలగాయి

Updated Date - 2020-10-19T08:20:33+05:30 IST