111 బదులు కొత్త జీవో!

ABN , First Publish Date - 2022-03-16T08:34:34+05:30 IST

హైదరాబాద్‌కు పశ్చిమాన జంట జలాశయాల చుట్టూ భూముల అభివృద్ధిని నియంత్రిస్తున్న 111 జీవోను ఎత్తేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.

111 బదులు కొత్త జీవో!

  • సుప్రీం అనుమతితోఈ జీవో ఎత్తేసే అవకాశం
  • న్యాయ నిపుణులతో సర్కారుసంప్రదింపులు
  • జంట జలాశయాల ఎగువన 2 జోన్లు
  • 6 కిలోమీటర్ల పరిధిలో 25ు నిర్మాణాలు
  • 10 కిలోమీటర్ల పరిధిలో 50ు నిర్మాణాలు
  • 10 కిలోమీటర్లు దాటితే నియంత్రణ లేదు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) :  హైదరాబాద్‌కు పశ్చిమాన జంట జలాశయాల చుట్టూ భూముల అభివృద్ధిని నియంత్రిస్తున్న 111 జీవోను ఎత్తేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ప్రాంతంలో 111 రక్షణ కవచంతో ఇప్పటి వరకు కాపాడిన పర్యవరణానికి భవిష్యత్తులో కూడా  నష్టం జరగకుండా ఈ గ్రామాలన్నింటినీ గ్రీన్‌జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశానికే తలమానికంగా ఉండే విధంగా పచ్చదనంతో కూడిన సుందర టౌన్‌షి్‌పలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే 111 జీవోను ఎత్తివేసి, దాని స్థానంలో కొత్త జీవోను తీసుకువస్తారు. సర్వోన్నత న్యాయస్థాన అనుమతితోనే ఈ పక్రియ అంతా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయనిపుణులతో సంప్రదించి దాదాపు కసరత్తు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. 111 జీవో ఎత్తివేతకు అనేక సానుకూల అంశాలు ఉండడంతో  సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. వాస్తవానికి హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ పరీవాహక ప్రాంతాల్లోని 84 గ్రామాల పరిధిలో అమల్లో ఉన్న 111 జీవో కారణంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలువురు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. 


శాస్త్రీయత లేకుండా జీవో ఇచ్చారని, దీన్ని సడలించాలని హైకోర్టు, గ్రీన్‌ ట్రైబ్యునల్‌, సుప్రీంకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఈ జీవోను ఎత్తివేస్తామని గత ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి. ఉమ్మడి రాష్ట్ర సీఎంలు చంద్రబాబు, వైఎస్‌ హయాంలో, తెలంగాణ  వచ్చాక కేసీఆర్‌ 111జీవో ఎత్తివేస్తామని లేదా సడలిస్తామని తెలిపారు. ఇంతవరకు కదలిక లేదు. ఇప్పుడు అసెంబ్లీలో   సీఎం ప్రకటన చేశారు. త్వరలోనే ఇదంతా జరుగుతుందని ఘంటాపథంగా చెప్పారు. దీంతో 111 జీవో పరిధిలోని గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 111 జీవో పరిధిలో గ్రామకంఠాలు మినహా మిగతా ప్రాంతాల్లో 10 శాతం స్థలంలో నిర్మాణాలు చేపట్టే విధంగా నిబంధనలున్నాయి. దీనికి అనేక తిరకాసులు కూడా పెట్టారు. అయితే, ఈ నిబంధన కూడా ఎక్కడా అధికారికంగా అమలు చేయడం లేదు. ప్రభుత్వం 111 జీవో ఎత్తివేసినా ఈ ప్రాంతాల్లో నియంత్రణ ఎత్తేయడం కాకుండా కొద్ది వెసులుబాటులు కల్పిస్తూ కొత్త జీవో తేవాలని నిర్ణయించింది. జంట జలాశయాల పరిధిలో కొత్తగా రెండు రకాల గ్రీన్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 


దీని ప్రకారం జంట జలాశయాలకు ఆరు కిలోమీటర్ల లోపు దూరంలో ఒక జోన్‌, ఆ తరువాత 6 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు మరో జోన్‌ ఏర్పాటు చేస్తారు. జంట జలాశయాలకు సమీపంగా ఉండే(6 కి.మీ పరిధి) జోన్‌లో 25 శాతం నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. 6 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రాంతాల్లో 50 శాతం నిర్మాణాలకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చించింది. వారి సూచనలు తీసుకుని నిపుణుల కమిటీకి పంపించినట్లు సమాచారం. నిపుణుల కమిటీ నివేదికను హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు త్వరలోనే అందించనున్నట్లు తెలిసింది. 111 జీవో సడలింపునకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టుతో పాటు జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కూడా పలు కేసులు నడుస్తున్నాయి. ఈ జీవో ఎత్తివేయాలని 84 గ్రామాల సర్పంచ్‌లు రెండు సార్లు తీర్మానాలు కూడా చేశారు. ఇది కూడా న్యాయపరంగా సానుకూల అంశమేనని చెప్పాలి.


ఎన్జీటీ ఆదేశాలతో కదలిక 

 మూడేళ్ల కిందట.. 111 జీవోను సమీక్షించేందుకు   జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ అంగీకరించింది. జంట జలాశయాల పరీవాహక ప్రాంతాల్లోని 84 గ్రామాల పరిధిలో నిర్మాణాలకు సంబంధించి ఆంక్షలు విధిస్తూ 1996లో తెచ్చిన 111 జీవోను సడలించాలని ‘111 జీవో పోరాట సంస్థ’ చెన్నైలోని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. 84 గ్రామాల ప్రజలు, పరీవాహక ప్రాంతంలో లేని ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలు కష్టాలు పడుతున్నారంటూ ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి, మంత్రి సబితారెడ్డి తనయుడు కౌశిక్‌రెడ్డి నాలుగేళ్ల కిందట గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో ఈ కేసు దాఖలు చేశారు.  క్షేత్రస్థాయిలో సరైన సర్వే నిర్వహించకుండానే జంట జలాశయాల ఎగువన 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములపై ఆంక్షలు విధించారని, కొన్నిచోట్ల 10 కిలోమీటర్ల అవతల ఉన్న గ్రామాలను కూడా 111 జీవో పరిధిలోకి తెచ్చారని కోర్టుకు విన్నవించారు. కేసును పరిశీలించిన గ్రీన్‌ ట్రైబ్యునల్‌ 111 జీవోను సమీక్షించేందుకు అంగీకరించింది. ఈ మేరకు నిపుణులతో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందు ప్రభుత్వం వేసిన కమిటీలో ఉన్న అధికారులను కూడా ఈ కమిటీలో చేర్చనున్నట్లు ప్రకటించింది. కమిటీలో నిపుణులతో పాటు కోర్టును ఆశ్రయించిన 111 జీవో పోరాట సంస్థలోని ఇద్దరు సభ్యులుగా చేర్చింది. కమిటీలో ప్రభుత్వం తరఫున చీఫ్‌ సెక్రెటరీ సోమేశ్‌ కుమార్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌, వాటర్‌ బోర్డు ఎండీ దానకిషోర్‌ సభ్యులుగా ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా నిపుణుల కమిటీ నివేదిక మాత్రం ఇవ్వలేదు. దీనిపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌ పలు మార్లు హెచ్చరికలు జారీ చేసింది. హైకోర్టు కూడా మరో కేసులో 111 జీవోపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోరింది. ఈ జీవోను ఎత్తివేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. నిపుణుల కమిటీ నివేదిక ఏమైందని కూడా ఆరా తీసింది. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.



న్యాయస్థానాలచేతిలోనే

111 జీవోను ఎత్తేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీనికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఇప్పటికే 111 జీవో పరిధిలోని గ్రామ పంచాయతీలన్నీ మూకుమ్మడిగా రెండుసార్లు తీర్మానాలు కూడా చేశాయి. ప్రభుత్వాలు అనేక మార్లు ప్రకటనలు చేశాయి. కానీ, సాధ్యపడలేదు. జీవో ఎత్తివేత వ్యవహారం ప్రభుత్వం చేతిలోనే ఉందా? అసలు ఇదెంత వరకు సాధ్యమనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పలుమార్లు కోర్టులో వివాదాలు నడిచాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే 111 జీవో అమల్లోకి వచ్చింది. దీన్ని ఎత్తేయాలన్నా సవరించాలన్నా సుప్రీం అనుమతితోనే జరగాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఖానాపూర్‌,. వట్టినాగులపల్లి గ్రామాలను ఈ జీవో నుంచి మినహాయిస్తూ  వైఎస్‌ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వెంటనే పర్యావరణవేత్తలు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వ్యాజ్యాలు వేశారు. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పర్యవరణ పరిరక్షణ కోసం రూపొందించిన జీవోకు తూట్లు పొడుస్తారా? అంటూ అక్షింతలు వేసింది. దీంతో వైఎస్‌ సర్కార్‌ 111 జీవో జోలికి వెళ్లలేదు. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు వేసిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి తీసుకునే ఈ పక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 


సహజ ప్రవాహాలను కాపాడేందుకే

హైదరాబాద్‌కు తాగు నీరందించే జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ల పరీవాహక ప్రాంత పరిరక్షణకు 1994 మార్చి 31న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. దాన్ని సవరిస్తూ 1996 మే 8న చంద్రబాబు హయాంలో 111 జీవోను విడుదల చేశారు. జంట జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో వాణిజ్య, పారిశ్రామిక నిర్మాణాలు, లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాన్ని నిషేధించారు. ఎగువ నుంచి వర్షపు నీరు వచ్చి జలాశయాల్లో చేరేందుకు, దిగువకు వెళ్లేందుకు వీలుగా ప్రవాహ వ్యవస్థకు అడ్డుగా నిర్మాణాలు రావొద్దన్న ఉద్దేశంతో ఈ జీవోను తెచ్చారు. కాలగమనంలో పరిస్థితులు మారాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నుంచి నగరానికి తాగునీరు అందుతోంది. కొన్నేళ్లుగా జంట జలాశయాల నీటిని వినియోగించడం లేదు. శామీర్‌పేటలో రిజర్వాయర్‌ నిర్మించనున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఉన్న కృష్ణా, గోదావరి ప్రాజెక్టులతో వచ్చే 100 ఏళ్ల వరకు గ్రేటర్‌కు నీటి సమస్యలు ఉండవని చెబుతున్నారు. 

Updated Date - 2022-03-16T08:34:34+05:30 IST