అమెరికా అధ్యక్షుడా మజాకా.. భద్రతను చూస్తే.. దిమ్మతిరగాల్సిందే!

ABN , First Publish Date - 2020-02-24T03:35:27+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనకు భారత్ రానున్నారు.

అమెరికా అధ్యక్షుడా మజాకా.. భద్రతను చూస్తే.. దిమ్మతిరగాల్సిందే!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనకు భారత్ రానున్నారు. కొద్ది నిమిషాల క్రితం వైట్‌హౌస్ నుంచి బయలుదేరిన ఆయన మరి కొద్ది గంటల్లో భారత్ చేరుకోనున్నారు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్ పొల్గొననున్నారు. ఇదిలా ఉండగా.. కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రంప్ పర్యటన సాగనుంది. ట్రంప్‌కు సెక్యూరిటీ కింద 108 మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు, 33 మంది డిప్యూటీ కమిషనర్లు, 75 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 300 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 12 వేల మంది జవాన్లు, 2 వేల మంది మహిళా పోలీసులు పహారా కాస్తున్నారు. మూడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్)లు, ఏడు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. అదే విధంగా 15 బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌లు కూడా పనిచేస్తున్నాయి. వీటితో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్‌పీజీ), ఎయిర్ ఫోర్స్, యూఎస్ సీక్రెట్ సర్వీస్ ట్రంప్‌కు అదనపు భద్రతను కల్పిస్తోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడి భద్రతను అమెరికా సెక్యూరిటీ అధికారులే స్వయంగా చూసుకుంటారు. ట్రంప్ పర్యటనకు మూడు నెలల క్రితమే అమెరికా సెక్యూరిటీ అధికారులు భారత్‌కు వచ్చి భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను మొదలుపెట్టారు. 


ట్రంప్ బస చేయనున్న ఢిల్లీలోని మౌర్య హోటల్‌ ప్రస్తుతం సీక్రెట్ సర్వీస్ అధికారుల పర్యవేక్షణలోకి వెళ్లిపోయింది. ట్రంప్ కుటుంబసమేతంగా వస్తుండటంతో హోటల్‌లోని 438 గదులు కూడా బుక్ అయిపోయాయి. ట్రంప్ కుటుంబసభ్యులు, ఆయన సిబ్బంది ఈ హోటల్‌లోనే బస చేయనున్నారు. ట్రంప్ అహ్మదాబాద్‌లో దాదాపు 22 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రయాణం చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడికి ఏ దిక్కునుంచైనా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. దీంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ టీం ట్రంప్ కోసం ప్రత్యేకంగా సొంత సెక్యూరిటీ ఏర్పాట్లను చేసుకుంది. ట్రంప్ ప్రయాణించనున్న 22 కిలోమీటర్ల మార్గాన్ని తమ అదుపులోకి తీసుకుంది. తమకు తెలియకుండా చీమ కూడా కదల్లేని విధంగా అమెరికా సెక్యూరిటీ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రంప్‌కు మొదటి అంచెలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఉంటారు. ఆ తరువాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు చెందిన భద్రతా దళాలు పనిచేయనున్నాయి. వారితో పాటు వేలాది మంది స్థానిక పోలీసులు భద్రత కల్పించనున్నాయి. 

Updated Date - 2020-02-24T03:35:27+05:30 IST