100 కోట్ల గ్రావెల్‌ తవ్వితే ఏంటి?

ABN , First Publish Date - 2020-09-13T07:17:36+05:30 IST

సాధారణంగా ఏదైనా కేసులో వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేస్తే ఆ కేసు ముగిసే వరకు వాహనాన్ని విడుదల చేయరు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన

100 కోట్ల గ్రావెల్‌ తవ్వితే ఏంటి?

  • అక్రమార్కుల వాహనాలు రిలీజ్‌ చేసేయండి
  • కొండపల్లి అక్రమ మైనింగ్‌ కేసులో అవినీతి దందా
  • సీజ్‌ చేసిన వాహనాల విలువ రూ.3 కోట్ల పైచిలుకు
  • రూ.10 వేలు ష్యూరిటీ పెట్టి తీసుకెళ్లాలని ఉత్తర్వులు
  • సెప్టెంబరు 3నే రిలీజింగ్‌ ఆర్డర్‌ ఇచ్చిన డీఎఫ్‌వో
  • వాహనాలు విడుదల చేసేందుకు కిందిస్థాయి సిబ్బంది ససేమిరా
  • నామమాత్రం ష్యూరిటీతో ఎలా విడుదల చేస్తామని నిలదీత

ట్రాఫిక్‌లో చిన్న తప్పులకే వాహనం సీజ్‌ చేస్తారు. కోర్టుకు పంపి, పెనాల్టీవేసి గానీ వదలరు. కానీ, అక్రమంగా రూ.100 కోట్ల గ్రావెల్‌ తరలింపు కేసు కోర్టులో ఉండగానే, బళ్లను వదిలేయాలని అధికారులు  ఆదేశించారు. 


విజయవాడ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఏదైనా కేసులో వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేస్తే ఆ కేసు ముగిసే వరకు వాహనాన్ని విడుదల చేయరు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. వాటిని విడుదల చేసేందుకు వాహన విలువను లెక్కించి అంత మొత్తాన్ని డిపాజిట్‌గా కట్టించుకున్న తర్వాతే వాహనాన్ని విడుదల చేస్తున్నారు. కానీ సుమారు రూ.100 కోట్ల అటవీ సంపదను దోచేసిన అక్రమార్కులకు సంబంధించిన వాహనాలను మాత్రం అటవీశాఖ అధికారులు నామమాత్రం పూచీకత్తుతో విడుదల చేస్తున్నారు. ఈ విషయమై కృష్ణాజిల్లా అటవీశాఖలో ఉన్నతాధికారులకు, కిందిస్థాయి సిబ్బందికి నడుమ కోల్డ్‌వార్‌ నడుస్తోంది. జిల్లా అటవీశాఖ అధికారి ఈ నెల 3నే వాహనాలను రిలీజ్‌ చేయాలని ఆర్డర్‌ ఇచ్చినా కిందిస్థాయి సిబ్బంది ససేమిరా అంటున్నారు.

 

కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు..!

కృష్ణాజిల్లాలో జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టు విస్తరించి ఉంది. 1891లో దీన్ని నోటిఫై చేశారు. 1933లో రీసెటిల్‌మెంట్‌ జరిగినప్పుడు అప్పటివరకు సర్వే చేయని అడవులనూ రిజర్వ్‌ ఫారె్‌స్టలో కలిపేశారు. అయితే కడెంపోతులూరు, లోయ గ్రామల పరిధిలో సుమారు 250 ఎకరాలు సర్వే జరగని భూమి మిగిలిపోయింది. దీనిలో కొన్నేళ్లుగా అక్రమంగా ఖనిజం, గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి. 2009లో అటవీశాఖ ఈ భూమి తమదేనని స్పష్టంచేసింది. అయినా రెవెన్యూ, గనులశాఖ ఎన్‌వోసీలు జారీ చేయడంతో అక్రమ తవ్వకాలు జరుగుతూ వచ్చాయి. 2017లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఈ ప్రాంతాన్ని అటవీభూమిగా నిర్ధారించి తవ్వకాలకు చెక్‌ పెట్టారు. గత ఏడాది వైసీపీ అధికారంలోకి రావడం, గతంలో డీఎ్‌ఫవోగా చేసిన బెనర్జీ బదిలీ కావడం, కొత్త డీఎ్‌ఫవోగా మంగమ్మ బాధ్యతలు తీసుకోవడంతో మళ్లీ అక్రమ తవ్వకాలు మొదలయ్యాయి.


సుమారు 250ఎకరాల విస్తీర్ణంలో 2మీటర్ల లోతున తవ్వకాలు జరిగాయి. ఆగస్టు 4న అటవీశాఖ అధికారులు దాడులు చేసి 7జేసీబీలు, ఎక్స్‌కవేటర్లు, 8టిప్పర్లు సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.3కోట్లకు పైచిలుకు ఉంటుంది. కొండపల్లి అటవీప్రాంతంలో సుమారు రూ.100కోట్ల మేర అక్రమ మైనింగ్‌ జరిగి ఉంటుందని సమాచారం. కానీ అటవీశాఖ అధికారులు కేవలం రూ.10కోట్ల లోపే అక్రమ తవ్వకాలు జరిగాయంటూ రూ.10లక్షల జరిమానాతో సరిపెట్టేశారు. కేసు విచారణలో ఉండగానే సీజ్‌ చేసిన వాహనాలనూ వదిలేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా అటవీశాఖలో కీలక అధికారి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీజ్‌ చేసిన వాహనాలను విడుదల చేయించడంలోనూ ఆమె చొరవ ఉందన్న ప్రచారం ఉంది. వాహన యజమానులపై కాకుండా డ్రైవర్లు, క్లీనర్లపై కేసులు నమోదు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సీజ్‌ చేసిన వాహనాలను రూ.10వేలు ష్యూరిటీ కట్టించుకుని విడుదల చేయాలని అటవీశాఖ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. నామమాత్రం ష్యూరిటీతో వదిలేస్తే తర్వాత తాము బాధ్యత వహించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వాటిని రిలీజ్‌ చేసేందుకు కిందిస్థాయి సిబ్బంది ముందుకు రావడం లేదు. అక్రమ మైనింగ్‌కు అండగా నిలిచిన కీలక అధికారిపై చర్యలు తీసుకోకుండా ఆరుగురు కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్‌ చేయడంపైనా గుర్రుగా ఉన్నారు. 

Updated Date - 2020-09-13T07:17:36+05:30 IST