బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమారుడిగా కల్వకుంట్ల తారక రామారావు గురించి అందరికీ తెలిసిందే. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి 2004లో పరోక్ష రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ 2008లో అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉప ఎన్నికల సమయంలో సిరిసిల్ల నియోజకవర్గంలో తన పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2009లో తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కేటీఆర్ ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ అందుకున్నారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 89,009 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబరు 17న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా వరుసగా రెండోసారి కేసీఆర్ కేబినెట్‌లో ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్‌కే టిక్కెట్ కేటాయించారు. ఆయనకు పోటీగా బీజేపీ నుంచి రాణి రుద్రమ పోటీ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకానొక సమయంలో కేటీఆర్ సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ గులాబీ దళంలో వర్గపోరు ఆయనకు తలపోటుగా మారింది. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏదో ఒక మంచి ముహూర్తంలో కేసీఆర్ స్థానంలో సీఎం సీటులో కూర్చునే అవకాశం కేటీఆర్‌కు వస్తుందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 47 | 7 | 533,173,952 | Post Graduate | 119,980,328 |