టి.జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌పై ఓడిపోయారు. అనంతరం 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు మంత్రిగా పని చేశారు. తొలుత 1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ కేబినెట్‌లో ఎక్సైజ్, నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రి వర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో ప్రభుత్వం రద్దు చేయబడడంతో కాంగ్రెస్‌లో చేరి 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. 1989లో రెండో సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 1994లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలై 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో విక్టరీ సాధించారు. 1999, 2004లో కూడా వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2004-2009 వరకు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. ఇక 2006, 2009లో కరీంనగర్ లోక్‌సభ నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య ఫైట్ నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా? అన్నట్టుగా యుద్ధం సాగుతోంది. ఇక బీజేపీ నుంచి భోగ శ్రావణి పోరులో ఉన్నారు. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు ఉన్నట్లుగా సర్వేలు చెప్పాయి. మరీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 72 | 11 | 33,935,788 | Graduate Professional | 8,352,644 |