మాజీ పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి హూజుర్ నగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి షానంపూడి సైదిరెడ్డి, బీజేపీ నుంచి చల్లా శ్రీలత రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యలోనే త్రిముఖ పోరు ఉండనుంది. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి 1999 నుంచి 2009 వరకు కోదాడా ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు హూజుర్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2019లో జరిగిన ఉప ఎన్నికలో హూజుర్ నగర్ నుంచి తాను కాకుండా తన భార్య పద్మావతి రెడ్డిని బరిలోకి దింపారు. ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి షానంపూడి సైది రెడ్డి చేతిలో 43,358 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దాంతో ఈసారి హూజుర్ నగర్ నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగురువేయాలని స్వయంగా తానే బరిలో నిలుస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఆయన పోలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. 1999లో తొలిసారి కోదాడా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. కానీ, 2009, 2014, 2018లలో మాత్రం హూజుర్ నగర్ నుంచి బరిలోకి దిగారు. ఈ మూడుసార్లు కూడా ఆయన గెలుపొందారు. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా గెలిచారు. దాంతో ఆయన అంతకుముందు ఏడాది గెలిచిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. అలాగే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో హౌసింగ్, వీకర్ సెక్షన్ మంత్రిగా పని చేశారు. అలాగే 2015 మార్చి నుంచి 2021 జూన్ వరకు తెలంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షునిగా ఉన్నారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 59 | 11 | 59,937,720 | Graduate | 8,568,468 |