తెలంగాణలో ముదురుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:13 AM
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. సోమవారం పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి...
44.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
కొన్ని చోట్ల ఉపశమనాన్నిచ్చిన వర్షాలు
నేడు, రేపు పలు జిల్లాలకు వర్ష సూచన
వడదెబ్బకు ముగ్గురి మృతి
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. సోమవారం పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదారబాద్‌తో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కు దాటేశాయి. నిజామాబాద్ జిల్లా సాలూర, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.3 డిగ్రీలు, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదై జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. తీవ్రమైన ఈ ఎండలు ప్రాణాపాయంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల వడదెబ్బకు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఎరుకలి నర్సయ్య (52) ఉపాధి పనులు చేస్తూ మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం పాతూరుకు చెందిన షేక్ మైబూబ్ (58) పెరటి తోటలో పనిచేస్తూ ఎండ త్రీవతకు తట్టుకోలేక కుప్పకూలి కన్నుమూశారు. అలాగే, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని బోర్నపల్లికి చెందిన ప్రైవేటు ఎలక్రీషియన్ మంచికట్ల తిరుపతి (54) రెండు రోజులుగా ఎండలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతి చెందారు. ఒకవైపు ఎండలు మండిపోతున్న తరుణంలో రాష్ట్రంలోని కొన్ని చోట్ల కురిసిన వర్షాలు స్వల్ప ఉపశమనాన్ని ఇచ్చాయి. కామారెడ్డి జిల్లా బిక్నూర్‌లో 4.2, సంగారెడ్డిలో 3.1, మేడ్చల్‌లో 2.7, హైదరాబాద్ కొండాపూర్‌లో 2.7, మెదక్ జిల్లా నార్సింగిలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల పాటు ఎండ తీవ్రతలో పెద్దగా మార్పు ఉండదని తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం, కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.