Share News

‘ఎల్‌నినో’తో కృష్ణా, గోదావరి బేసిన్‌లో వర్షాభావం

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:04 AM

ఈసారి ఎల్‌నినో తీవ్రత ఎక్కువగా ఉండడంతో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని.. ‘భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం..

‘ఎల్‌నినో’తో కృష్ణా, గోదావరి బేసిన్‌లో వర్షాభావం

  • అల్పపీడనాలు ఏర్పడ్డా వర్షాలు పడేది ఈశాన్య రాష్ట్రాల్లోనే

  • వర్షాల్లేక సాగర్‌, శ్రీశైలం జలాశయాలకు నీరు సరిగా రాదు

  • జలవిద్యుత్తుపైనా ప్రభావం.. థర్మల్‌ విద్యుత్తుకూ సమస్యే

  • తాగునీటి సమస్యలూ.. కోస్తాంధ్రలో తీరానికి కోత?

  • రైతులతోపాటు ఆక్వా సాగుదారులకూ కష్టమే

  • ఐవోడీ బలపడడానికి సమయం పడుతుంది.. 1997కు

  • మించి విపత్కర స్థితి.. ఎల్‌నినోను భూతంలా చూడక్కర్లే

  • 4-7 ఏళ్లకు ఒకసారి ఏర్పడడం సహజమే

  • భూతాపానికి, ఎల్‌నినోకు సంబంధం లేదు

  • ఇన్‌కాయిస్ సీనియర్‌ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఈసారి ఎల్‌నినో తీవ్రత ఎక్కువగా ఉండడంతో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని.. ‘భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్‌కాయిస్)లోని ఓషన్‌ మోడలింగ్‌ అండ్‌ డేటా ఎస్సిమిలేషన్‌ (ఓఎండీఏ) విభాగానికి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్‌ హెచ్చరించారు. వర్షాలు సరిగా పడకపోవడంతో నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలకు నీరు సరిగా రాక.. జల, ధర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. 1997లో వచ్చిన ఎల్‌నినో కంటే తీవ్రమైన పరిస్థితులు ఈసారి ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. అయినప్పటికీ.. ఎల్‌నినోను పెద్ద భూతంలా చూడాల్సిన పని లేదని.. అది సహజసిద్ధంగా జరిగే పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఎల్‌నినోలపై విస్తృత స్థాయిలో పరిశోధన చేసిపలు పత్రాలను ప్రచురించిన ఆయన.. తాజాగా ఏర్పడ్డ ఎల్‌నినో ప్రభావం మన దేశంపైన, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందనే అంశంపై ‘ఆఽంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..


సమస్యలు తప్పకపోవచ్చు..

ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అరేబియాలో కాస్త తక్కువగా ఉండవచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే, వాటి దిశ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి. కోస్తా తీరప్రాంత జాలరులు నష్టపోయే అవకాశాలెక్కువ. ముఖ్యంగా కోస్తాంధ్రపై ఎల్‌నినో ప్రభావం కాస్త ఎక్కువగా ఉండనుంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లో వర్షాభావం కారణంగా తాగునీటి సమస్య కూడా ఉత్పన్నం కావొచ్చు. ఎల్‌నినో ప్రభావం జలవిద్యుత్‌ పై బాగానే ఉంటుంది. నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలకు నీరు సరిగా రాదు. క్యాచ్‌మెంట్‌ ఏరియాలలో వర్షాలు సరిగా పడకపోయినప్పుడు అవెలా నిండుతాయి? జలవిద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది? కృష్ణా బేసిన్‌ మాత్రమే కాదు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు తక్కువగా ఉండటం వల్ల జలవిద్యుత్తు ఉత్పత్తి పడిపోతుంది. అప్పుడు థర్మల్‌ విద్యుత్తు దిశగా ప్రభుత్వాలు చూడక తప్పదు. సోలార్‌ కొంత సహాయపడుతుంది. అయితే ఽథర్మల్‌ పవర్‌ ఉత్పత్తికీ నీరు అవసరమవుతుంది. జలాశయాల్లో నీళ్లు లేకపోతే అక్కడ కూడా సమస్యలు తప్పకపోవచ్చు.

ఆక్వాకల్చర్‌పై..

ఎల్‌నినో ప్రభావం ఆక్వాకల్చర్‌పై తప్పనిసరిగా ఉంటుంది. చెరువుల్లో చేపలు, రొయ్యల సాగుపరంగా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. సముద్ర జలాలు వేడెక్కినప్పుడు కొన్నిరకాల సముద్ర జీవరాశులు తమకు తగిన వాతావరణం వెదుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతాయి. కానీ చెరువులలో ఆ పరిస్థితి ఉండదు. జలాలు వేడెక్కడం, ఉప్పుశాతం పెరగడం వంటి సమస్యల వల్ల అవి మరణించడం, ఎదుగుదల లోపించడం వంటి సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. ఎల్‌నినో వల్ల వర్షాలు తక్కువగా ఉండటంతో సముద్రపు నీటిలో ఉప్పు శాతం కూడా కాస్త పెరగవచ్చు. త్వరలో విడుదల చేయబోయే బులెటిన్‌లో ఈ అంశాలను క్షుణ్ణంగా చర్చిస్తాం.


1997 కంటే కూడా..

1997లో తీవ్రమైన ఎల్‌నినో వచ్చింది. అయితే అప్పట్లో హిందూ మహాసముద్రంలో ఇండియ్‌ ఓషన్‌ డైపోల్‌(ఐవోడీ) బలంగా ఉండటం వల్ల ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించింది. ఈసారి ఆ ప్రభావం ఉంటుందా లేదా అన్న దానిమీద పరిశోధనలు సాగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఈసారి ఐవోడీ చాలా బలహీనంగా ఉంది. అది ఎంత త్వరగా బలపడితే మనం అంత త్వరగా ఎల్‌నినో ప్రభావం నుంచి బయటపడగలం. ఈ వర్షాకాలంలో అది ప్రభావం చూపుతుందని మేం అనుకోవట్లేదు. ఎందుకంటే.. ఎల్‌నినోకు, ఐవోడీకి సంబంధం ఉంది. ఎల్‌నినో కాస్త ముందు ఏర్పడితే హిందూ మహాసముద్రంలో ఐవోడీ ముందుగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. గత అనుభవాలు ఇదే చెబుతున్నాయి. కానీ, ఈసారి ఎల్‌నినో లక్షణాలు మనకు మేలో కనిపించాయి కాబట్టి.. ఐవోడీ బలంగా మారడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటికి వర్షాకాలం వెళ్లిపోతుంది. అక్టోబరు, నవంబరు నెలలు వచ్చేస్తాయి. కాబట్టి, ప్రస్తుతానికైతే 1997 కంటే విపత్కర పరిస్థితులు ఈసారి ఉండగలవని మాత్రం చెప్పగలం.

ఎల్‌నినోను నిరోధించడం సాధ్యమా?

అంటార్కిటికాలో మంచు ఫలకాలు కరగకుండా పసిఫిక్‌ జలాలను వెనక్కి మళ్లించినట్లుగా.. ఎల్‌నినో ప్రభావ తీవ్రత తగ్గించడానికి ఏమైనా మార్గాలున్నాయా అని అంటే లేవనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కూడా కాదు. అయినా ఎల్‌నినో అనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. దాన్నో పెద్ద భూతంగా చూసే ధోరణి నుంచి బయటకు రావాలి. ఎల్‌నినో కారణంగా వర్షాలు తగ్గడం వల్ల మనకు కొంత నష్టం జరగవచ్చు కానీ, ఇదే ఎల్‌నినో వల్ల దక్షిణ అమెరికాలో వర్షాలు పడతాయి. ఇదో సహజసిద్ధమైన పరిణామం. అలాగే.. దీనికీ, గ్లోబల్‌వార్మింగ్‌కూ ఎలాంటి సంబంధమూ లేదు. ఎల్‌నినో మనిషి సృష్టించేది కాదు. లక్షలాది సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈసారి న్యూస్‌ వాల్యూ ఎక్కువ అంతే! ఎల్‌నినోలు తరుచుగా వస్తూనే ఉంటాయి. సాధారణంగా 4-7 సంవత్సరాలకోమారు జరగవచ్చు. 2023లో వచ్చిన ఎల్‌నినో తరువాత మరలా ఇప్పుడు వచ్చింది, అంటే, ఈసారి కాస్త ముందు వచ్చినట్లే.

Updated Date - Jun 27 , 2026 | 06:06 AM