మీనాక్షీ నటరాజన్‌కు షాక్
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:01 AM
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌కు రాజ్యసభ ఎన్నికల్లో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి బరిలోకి దిగగా.. రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ
తెలంగాణ కోర్టులో క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నా అఫిడవిట్‌లో పేర్కొనలేదని బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు
నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి నిర్ణయం
కాంగ్రెస్ ఆగ్రహం.. ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం
కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో నిరసన
మీనాక్షిపై ఎటువంటి క్రిమినల్ కేసు లేదు: తెలంగాణ కాంగ్రెస్
బీజేపీ సీటు చోరీకి పాల్పడిందన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
న్యాయస్థానంలో పోరాడతామని ప్రకటన
నేడు కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసేందుకు ఈసీ అనుమతి!
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ: మీనాక్షీ నటరాజన్
భోపాల్, జూన్ 9: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌కు రాజ్యసభ ఎన్నికల్లో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి బరిలోకి దిగగా.. రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. తెలంగాణలో మీనాక్షీ నటరాజన్‌పై ఓ క్రిమినల్ కేసు నమోదైందని, కానీ.. ఆ వివరాలను ఆమె అఫిడవిట్‌లో పేర్కొనకుండా దాచారంటూ బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ ఫిర్యాదు చేయడంతో రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో గెలవలేక కుట్రకు తెరతీసిందని మండిపడింది. గాంధేయవాది అయిన మీనాక్షిని ఎదుర్కోలేక.. లేని క్రిమినల్ కేసుల పేరుతో ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఏఐసీసీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సచిన్ పైలట్, భూపేశ్ బఘేల్ తదితరులు ఈసీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే ముందస్తు అనుమతి తీసుకోనందున.. వారిని కార్యాలయంలోకి అనుమతించబోమంటూ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు ఈసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల కమిషన్.. బీజేపీకి అనుబంధ సంస్థగా మారిపోయిందని ఆరోపించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నా.. ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం దారుణమన్నారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయుస్తామన్నారు. అంతేకాకుండా.. బుధవారం ఈసీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. దీంతోపాటు మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్‌ను బుధవారం కలిసేందుకు అనుమతి లభించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
బలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థి..
230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరుగుతున్నాయి. 164 మంది ఎమ్మెల్యేలున్న అధికార బీజేపీకి రెండు స్థానాలు, 63 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రె్‌సకు ఒక స్థానం దక్కే అవకాశం ఉండగా.. కమలం పార్టీ మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించింది. కాంగ్రెస్ తరఫున మీనాక్షీ నటరాజన్ పోటీలో ఉండగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరిని క్రాస్ ఓటింగ్‌కు పాల్పడేలా చేయడం ద్వారా మూడో స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహం పన్నింది. అయితే దీనిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ..తమ ఎమ్మెల్యేలను కర్ణాటకలో క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి చేరుకోకముందే మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దీంతో మూడు స్థానాలనూ బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ..
మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం ద్వారా బీజేపీ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఓటు చోరీ తరువాత ఇప్పుడు సీటు చోరీకి బీజేపీ పాల్పడుతోందని కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’లో ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరింపజేశారని తెలిపారు. కాగా, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్న తీరుకు ఇదే నిదర్శనమని మీనాక్షీ నటరాజన్ అన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా గెలిచినట్లుగానే రాజ్యసభ ఎన్నికల్లో కూడా అడ్డదారుల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న తీరు స్పష్టమైందన్నారు.
‘తెలంగాణ కాంగ్రెస్ నేతలే సమాచారమిచ్చారు’
మీనాక్షీ నటరాజన్‌పై క్రిమినల్ కేసులున్నట్లు తమకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలే సమాచారం ఇచ్చారని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఇలా ఉందంటూ ఎద్దేవా చేశారు. అయితే మీనాక్షిపై క్రిమినల్ కేసులు లేవని, ఓ ఫిర్యాదు విషయంలో కోర్టులో హాజరు కావాలంటూ న్యాయస్థానం నోటీసులు మాత్రమే జారీ చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. ఆ నోటీసుల ప్రకారం.. ఎ.శ్రీలత అనే మహిళ 2025 సెప్టెంబరు 17న మీనాక్షీ నటరాజన్‌పై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేయగా.. కోర్టు నోటీసులు జారీ చేసింది.
మీనాక్షిపై నమోదైన కేసు నేపథ్యం
మీనాక్షి నటరాజన్‌పై నమోదైన ప్రైవేటు కేసు నేపథ్యం బీజేపీ వర్గాలు చెబుతున్న ప్రకారం ఇలా ఉంది. 2025 ఆగస్టు 20న హైదరాబాద్ నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎ.శ్రీలత అనే మహిళ ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఆమె ఫిర్యాదులో మీనాక్షి నటరాజన్‌ను నాలుగో నిందితురాలిగా చేర్చారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం 17 సెప్టెంబరు 2025న మీనాక్షి నటరాజన్‌కు వివరణ ఇవ్వాలని నోటీస్‌లు జారీ చేసింది. ఆమె కోర్టుకు హాజరై సమాధానం ఇవ్వాలని ఆదేశించించింది. మీనాక్షి తరపు న్యాయవాది కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలని, కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణకు ఆదేశించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉంది. ఎలాంటి ఎఫ్‌ఐఆర్ ఇంతవరకు నమోదు చేయలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, శ్రీలత ఫిర్యాదులో ఒక వ్యక్తి మీద పరువు నష్టం, నేరపూరిత కుట్ర, నేరం చేసే ఉమ్మడి ఉద్దేశంతో వ్యవహరించడం, నేరపూరిత బెదిరింపు, నేరాన్ని ప్రోత్సహించేలా వ్యవహరించడం, మహిళను అవమానపరచడం సెక్షన్లను ప్రస్తావించారు.