Share News

రాజీనామా చేయిస్తారు!

ABN , Publish Date - Aug 31 , 2026 | 04:11 AM

మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే దీనికి ఒక ముగింపు పలకాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠినంగానే చర్యలు తీసుకుని.. క్రమశిక్షణ విషయంలో మిగిలిన నాయకులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలన్న యోచనలో అధిష్ఠానం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

రాజీనామా  చేయిస్తారు!
Konda Surekha

  • కొండా సురేఖను సామరస్యంగా..

  • ఇంటికి పంపించే యోచనలో అధిష్ఠానం!

  • చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం

  • ఉపాధ్యక్ష పదవికి రాజీనామా కోరే చాన్స్‌

  • వారంలోనే నిర్ణయం.. తద్వారా పార్టీలోని

  • ఇతర నేతలకు గట్టి సంకేతాన్నిచ్చే యోచన

  • నేడు అమెరికా నుంచి వేణుగోపాల్‌ రాక

  • రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • తుమ్మిడిహెట్టిపై సీడబ్ల్యూసీ భేటీలో

  • పాల్గొననున్న సీఎం, ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే దీనికి ఒక ముగింపు పలకాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠినంగానే చర్యలు తీసుకుని.. క్రమశిక్షణ విషయంలో మిగిలిన నాయకులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలన్న యోచనలో అధిష్ఠానం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం కాకుండా.. మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆమెను కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారెడ్డిని సైతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కోరే అవకాశం ఉందంటున్నారు.


మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చే పేరుతో కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారం కూడా ఉంది. కానీ, క్రమశిక్షణ విషయంలో అధిష్ఠానం కఠినంగా ఉందని సంకేతాలు ఇవ్వదలచుకుంటే మాత్రం రాజీనామా కోరే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కఠిన చర్యలు తీసుకోని పక్షంలో సీఎం రేవంత్‌రెడ్డిని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచినట్లే అవుతుందన్న భావనకు అధిష్ఠానం వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఉపేక్షిస్తే భవిష్యత్తులో ప్రతి చిన్న అంశానికీ పార్టీ, ప్రభుత్వ నాయకత్వాలపై విమర్శలు చేసేవారు పెరుగుతారని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఉభయకుశలోపరిగా వెళ్లాలనుకుంటే మాత్రం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరుతో పక్కన పెట్టే అవకాశం ఉందంటున్నారు.


ఢిల్లీకి వెళ్లనున్న కీలక నేతలు..

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి సెప్టెంబరు 1న ఢిల్లీలో కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యుసీ) చైర్మన్‌ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని పేర్కొంటున్నారు. సీఎంతోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీకి వెళుతున్నారు. అలాగే మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు ఆద్వర్యంలో సెప్టెంబరు 2న జరగనున్న వైఎస్సార్‌ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ కూడా ఢిల్లీకి వెళుతున్నారు. మరోవైపు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నాయకత్వం ఢిల్లీలోనే అందుబాటులో ఉండనున్న నేపథ్యంలో కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి.. కేసీ వేణుగోపాల్‌ వారి అభిప్రాయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అధిష్ఠానం పెద్దలతోనూ చర్చించి.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోగానే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే.. అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు తెరలేపితే.. అది కొత్త వివాదాలకు దారి తీస్తుందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా వారంలోపే ఈ అంశానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్న ఆలోచనతో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 31 , 2026 | 04:22 AM