Share News

పెరోల్‌పై వెళ్లి 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ ఖైదీ

ABN , Publish Date - Aug 27 , 2026 | 05:41 AM

జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ పెరోల్‌పై జైలు నుంచి విడుదలై తిరిగి రాకుండా ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అంతేకాదు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా అందుకుని.. 13 ఏళ్ల క్రితమే రిటైరయ్యాడు

పెరోల్‌పై వెళ్లి 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ ఖైదీ

  • పెరోల్ పై వెళ్లి.. ప్రభుత్వ టీచర్‌గా రిటైరై.. 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ ఖైదీ

  • మహబూబాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు

  • ఎట్టకేలకు పట్టుకుని మళ్లీ జైలుకు పంపిన పోలీసులు

  • మూడేళ్లుగా పెరోల్ ఇవ్వకపోవడంపై అతని భార్య పిటిషన్

  • కొట్టేసిన హైకోర్టు.. జైళ్ల శాఖ నిర్లక్ష్యానికి ఉదాహరణని వ్యాఖ్య

  • పెరోల్ ఖైదీలపై పటిష్ఠ నిఘా ఉంచాలని ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ పెరోల్‌పై జైలు నుంచి విడుదలై తిరిగి రాకుండా ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అంతేకాదు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా అందుకుని.. 13 ఏళ్ల క్రితమే రిటైరయ్యాడు. ఆ తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. నివ్వెరపరిచే ఈ అరుదైన ఘటన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు ఓ కేసులో 1983 జూన్‌ 9న వరంగల్‌ జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అతడిని వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అదే సంవత్సరం డిసెంబరు 17న పెరోల్‌పై విడుదల చేశారు. 1984 మార్చి 18న అతడు జైల్లో లొంగిపోవాల్సి ఉన్నా తిరిగి జైలుకు రాలేదు. అతడు పారిపోయిన 40 ఏళ్ల 58 రోజుల తర్వాత అంటే 2024 మే 16న వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. పెరోల్‌పై జైలు నుంచి బయటకెళ్లిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయడంతోపాటు 2013లో రిటైర్‌ అయ్యాడు. 2004లో ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు సైతం అందుకున్నాడు. 1983 నుంచి మహబూబాబాద్‌ జిల్లాలోనే ఉంటున్నప్పటికీ 2024 వరకు పోలీసులు అతడి జోలికి వెళ్లలేదు. ఆ ఏడాది మే 16న మహబూబాబాద్‌ రూరల్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.


మూడేళ్ల పాటు ఎలాంటి పెరోల్‌, జైలు శిక్ష మినహాయింపు లేకుండా మెమో జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నిందితుడి భార్య సందెల చారమ్మ బంధువుల సహాయంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ టీ మాధవీ దేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది మహమ్మద్‌ బషీర్‌ రియాజ్‌ వాదిస్తూ వీరన్న 40 ఏళ్లుగా మహబూబాబాద్‌ జిల్లాలోనే అందుబాటులో ఉన్నా ఇప్పుడు చర్యలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం నిందితుడు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకు తిరుగుతున్నాడని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ కేసుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. జైళ్ల శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని పేర్కొంది. పెరోల్‌పై వెళ్లిన వారిపై పటిష్ఠమైన నిఘాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని, టాస్క్‌ఫోర్స్‌తో పాటు ట్రాకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖను ఆదేశించింది.

Updated Date - Aug 27 , 2026 | 05:41 AM