దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న మేడారం
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:20 AM
మేడారం మహాజాతర దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం ఆయన మేడారం మహాజాతరకు కుటుంబ సమేతంగా వచ్చి వన దేవతలను దర్శించుకున్నారు.
గద్దెల పునరుద్ధరణతో మేడారానికి కొత్తకళ
రాష్ట్రం అభివృద్ధి చెందాలని వన దేవతలను కోరుకున్నా: భట్టి
వరంగల్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మేడారం మహాజాతర దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం ఆయన మేడారం మహాజాతరకు కుటుంబ సమేతంగా వచ్చి వన దేవతలను దర్శించుకున్నారు. తల్లులకు భట్టి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, గద్దెల పునరుద్ధరణతో మేడారానికి కొత్తకళ వచ్చిందన్నారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించామన్నారు. తల్లుల దర్శనం అనంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని భక్తులకు సూచించారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని వన దేవతలను కోరుకున్నానని తెలిపారు. కాగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సమ్మక్క-సారలమ్మను వేడుకున్నానని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా ఆయన వన దేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. ప్రజాపాలనలో ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మహేశ్ గౌడ్ అన్నారు.. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందన్నారు.