వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు!
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:45 AM
ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల మామునూరు విమానాశ్రయం సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. విమానాశ్రయం కోసం సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి అప్పగించింది.
మామునూరులో సేకరించిన భూ పత్రాలు కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు అప్పగింత
రూ.850 కోట్లతో నిర్మాణం.. రెండేళ్లలో పూర్తి చేస్తాం
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ: రామ్మోహన్
హైదరాబాద్‌లో ముగిసిన‘వింగ్స్ ఇండియా 2026’ ప్రదర్శన
వరంగల్ కలెక్టరేట్, మామునూర్,
హైదరాబాద్ సిటీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల మామునూరు విమానాశ్రయం సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. విమానాశ్రయం కోసం సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి అప్పగించింది. రాజధాని హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ‘వింగ్స్ ఇండియా’ కార్యక్రమంలో గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడుకు ఈ భూముల పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు. రూ.850 కోట్లతో మామునూరు విమానాశ్రయం రన్‌వే, ఆధునిక టెర్మినల్ భవనాల నిర్మాణం చేపట్టామని.. రెండేళ్లలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని రామ్మోహన్‌నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే.. ఇప్పుడు 164కి చేరాయని, త్వరలో వీటిని 300కు పెంచడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధ్దికి ఎంత కట్టుబడి ఉంటానో, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు అంతే శ్రద్ధ చూపిస్తానని చెప్పారు.
అభివృద్ధ్దికి రెండో రాజధాని వరంగల్: మంత్రులు
మామునూరు విమానాశ్రయం ఏర్పాటుతో వరంగల్ రాష్ట్రంలో రెండో రాజధానిగా అవతరించనుందని ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రైతుల సహకారంతో పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని.. భవిష్యత్తులో ఆదిలాబాద్, కొత్తగూడెం విమానాశ్రయాలనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ సంకల్పంతో విమానాశ్రయ భూసేకరణ సాధ్యమైందని.. విమానాశ్రయం పూర్తయ్యాక ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. చారిత్రక ఓరుగల్లు ప్రజల కలను కాంగ్రెస్ ప్రభు త్వం సాకారం చేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు.
విమానయాన రంగానికి ఆకాశమే హద్దు
దేశంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఆకాశమే హద్దుగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంలోని వ్యాపారవేత్తలు, స్టార్టప్ నిపుణులు, కంపెనీలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘వింగ్ ఇండియా-2026’ ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సమక్షంలో దేశ, విదేశాలకు చెందిన విమానయాన కంపెనీలు పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అనంతరం దేశంలో ఉత్తమ విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు, ఉత్తమ విమానయాన సంస్థగా ఎయిరిండియా, సర్వీస్ ప్రొవైడర్స్ కేటగిరీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్, విమానయాన ఉత్పత్తుల కేటగిరీలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌కు, ఏవియేషన్ రంగంలో అద్భుత ప్రోత్సాహకాలు ఇస్తున్న తెలంగాణకు, ఏవియేషన్ రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్న ఏపీకి అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. విమాన విడిభాగాలు, ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ దేశీయ కంపెనీ లు సత్తా చాటాలన్నారు. భారత విమానయాన రంగానికి భవిష్యత్తులో 30వేల మందికిపైగా పైలట్ల అవసరం ఉందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. విమానయాన రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2047నాటికి తెలంగాణను ప్రముఖ ఏరో స్పేస్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.