Share News

రచయిత్రి శారదా అశోకవర్ధన్‌ కన్నుమూత

ABN , Publish Date - May 15 , 2026 | 04:26 AM

తొలితరం తెలుగు సినీ గీత రచయిత్రి, జవహార్‌ బాలభవన్‌ మాజీ డైరెక్టర్‌ శారదా అశోక వర్ధన్‌ (88) కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె...

రచయిత్రి శారదా అశోకవర్ధన్‌ కన్నుమూత

  • తొలితరం తెలుగు సినీ గీత రచయిత్రిగా గుర్తింపు

  • అనేక సాహిత్య ప్రక్రియల్లో వందలాది రచనలు

హైదరాబాద్‌ సిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): తొలితరం తెలుగు సినీ గీత రచయిత్రి, జవహార్‌ బాలభవన్‌ మాజీ డైరెక్టర్‌ శారదా అశోక వర్ధన్‌ (88) కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని తన కుమార్తె అరుణ నివాసంలో తుదిశ్వాస విడిచారు. శారద పుట్టి.. పెరిగిందంతా సికింద్రాబాద్‌లోనే. కుటుంబ పరిస్థితుల రీత్యా తన 17వ ఏట హైదరాబాద్‌ రాష్ట్ర సమాచార శాఖలో అసిస్టెంట్‌ అనువాదకురాలిగా చేరా రు. తర్వాత అదే శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉద్యోగ విరమణ పొందారు. ఉమ్మడి ఏపీలో జవహార్‌ బాలభవన్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఉద్యోగంలో చేరే సమయంలో తండ్రి నూకల అప్పారావుతో జరిగిన సంభాషణ ఆధారంగా ‘ఆత్మార్పణ’ నాటకం రాయగా, ఆల్‌ఇండియా రేడియోలో ప్రసారమైంది. ఆకాశవాణిలో డిప్యూటేషన్‌ మీద పని చేసినప్పుడు.. కుటుంబ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. వందకుపైగా లలిత గీతాలు రచించగా, ‘మనసాయెరా..మాధవా’ ‘ఎంత రాతి మనసు నీది’ తదితర పాటలు ఆకాశవాణి శ్రోతల అభిమానాన్ని పొందాయి. శారద రాసిన గణపతి సుప్రభాతాన్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించారు. టీడీ పీ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్‌పై ఆమె రచించిన బుర్ర కథ విశేషంగా ఆకట్టుకుంది. వచన, పద్య కవిత్వం, కథలు, నవలు, నాటకాలు... ఇలా అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసిన ఘనత శారద సొంతం. 6 నృత్యరూపకాలు, 4 కవితా సంపుటాలు, 15 నవలలు, 300 పైగా కథలు, బాలసాహిత్యం, రెండు బుర్రకథలు కలిపి 88 పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. సినీ నటి భానుమతి ప్రోత్సాహంతో ‘భక్తధృవ మార్కండేయ’ సినిమాకు జోల పాట రాసి... తెలుగు సినీ రంగంలో మొదటి గీత రచయిత్రిగా పేరు పొందారు. శారద రచించిన ‘స్త్రీ నాడు - నేడు’ తదితర ధారావాహికలకు ఉత్తమ రచయిత్రిగా మూడు సార్లు బంగారు నంది పురస్కారాలు అందుకున్నారు. సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా, రీజనల్‌ బోర్డు చైర్‌పర్సన్‌గానూ సేవలందించారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో శారద అంత్యక్రియలు జరగనున్నాయి.

Updated Date - May 15 , 2026 | 04:26 AM