పెద్దలకూ టీకా
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:22 AM
టీకాలు అనగానే చాలామందికి ఆరేళ్ల పాపాయి, మూడేళ్ల బాబే కళ్లముందు మెదులుతారు. ఇంజెక్షన్లు, చుక్కల మందులు చిన్న పిల్లల కోసమే కదా! అనే ఆలోచనలో ఉంటారు. పెద్దయ్యాక టీకాలతో పనేంటని భావిస్తుంటారు
వార్షిక ఫ్లూ వ్యాక్సిన్
వాతావారణం మార్పుల వల్ల ఇన్‌ప్లూయెంజా వైరస్ రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఫ్లూ బారిన పడకుండా ఉండటానికి ఏటా ఈ టీకా వేసుకోవడం మంచిది. 50 ఏళ్లు దాటిన వారు, షుగర్, బీపీ, ఆస్తమా ఉన్నవారు..
వర్షాకాలం, శీతాకాలం ప్రారంభమయ్యే ముందే తీసుకోవడం ద్వారా సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.పెద్దలకూ టీకా18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ
వ్యాక్సిన్లు అవసరమే
వయసు పెరిగే కొద్దీ
తగ్గుతున్న రోగనిరోధక శక్తి
50ఏళ్లు దాటిన వారికి..
దీర్ఘకాలిక రోగులకు అత్యవసరం
వచ్చే శీతాకాలంలో చలిగాలులతో
పెరగనున్న వైరస్ ల ముప్పు
వైద్యుల సలహాతో డోసులు
ఎంచుకోవాలంటున్న నిపుణులు
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): టీకాలు అనగానే చాలామందికి ఆరేళ్ల పాపాయి, మూడేళ్ల బాబే కళ్లముందు మెదులుతారు. ఇంజెక్షన్లు, చుక్కల మందులు చిన్న పిల్లల కోసమే కదా! అనే ఆలోచనలో ఉంటారు. పెద్దయ్యాక టీకాలతో పనేంటని భావిస్తుంటారు. కానీ, అది అపోహ మాత్రమేనని 18ఏళ్లు దాటిన పెద్దలకు కూడా వ్యాక్సిన్లు రక్షణ కవచంలా పని చేస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తూ ఉండటం.. దానికి తోడు మారుతున్న జీవనశైలి, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలూ ఉంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయి. అలాగే వర్షాకాలం ముగిసి.. చలిగాలులతో కూడిన శీతాకాలం దగ్గరకు వచ్చేసింది. వాతావరణంలో వేగంగా వచ్చే ఈ మార్పుల వేళ రకరకాల వైరస్ ల ఇన్ఫెక్షన్లువిజృంభించే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి సమయంలో చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్లు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నతనంలో వేసుకున్న టీకాల ప్రభావం వయసు పెరిగే కొద్దీ తగ్గే అవకాశం ఉండటం వల్ల పెద్దయ్యాక వచ్చే వ్యాధులను తట్టుకోవడానికి వ్యాక్సినేషన్ ఏకైక మార్గంగా నిలుస్తోంది. అయితే, వ్యాక్సిన్ల పట్ల అవగాహన లోపించడం వల్ల వీటిని తీసుకోని పెద్దలు వ్యాధులకు గురవుతూ.. ఆస్పత్రులపాలవుతూ ఆర్థికంగా నష్టపోతుంటారు. తక్కువ ఖర్చుతో కూడిన టీకాల ద్వారా వ్యాధులను నియంత్రించుకునే వీలున్నప్పటికీ, అవగాహన లోపంతోనే ఖర్చుతో కూడుకున్న చికిత్సలను ఆశ్రయించాల్సి వస్తోంది. కాగా, టీకాలు తీసుకోబోయే ముందు వయస్సు, పాత వ్యాక్సినేషన్ రికార్డులు, ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందరూ అన్ని రకాల టీకాలు తీసుకోవడం తప్పనిసరి కాకపోయినా.. వయసు, నివసించే వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని 18 దాటిన వారు పరిశీలించాల్సిన ప్రధాన వ్యాక్సిన్లు ఇవే..
హెపటైటిస్- బి టీకా
కాలేయానికి తీవ్ర హాని తలపెట్టే హెపటైటిస్- బి ఇన్ఫెక్ష న్ నుంచి ఈ వ్యాక్సిన్ పూర్తి రక్షణనిస్తుంది. చిన్నతనంలో ఈ టీకా తీసుకోని వారు, హెల్త్‌కేర్ రంగంలో పని చేసేవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు 0, 1, 6 నెలల వ్యవధిలో మొత్తం 3 డోసులుగా దీనిని తీసుకోవాలి.
చికెన్‌పాక్స్ టీకా
చిన్నతనంలో అమ్మవారు (చికెన్ పాక్స్) రానివారు లేదా టీకా తీసుకోని వారు.. పెద్దయ్యాక వ్యాధి బారిన పడితే దురద, గుల్లలతో పాటు న్యుమోనియా, మెదడు వాపు వంటి తీవ్రమైన అనారోగ్యానికి గురైయ్యే ప్రమాదం ఉంటుంది. 4 వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఈ టీకా తీసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి బయట పడవచ్చు.
టిడాప్ టీకా
ధనుర్వాతం (టెటానస్), గొంతు వాపు, డిఫ్తీరియా, కోరింత దగ్గుల నుంచి కాపాడేందుకు టిడాప్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను పదేళ్లకు ఒకసారి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గర్భిణులు ప్రసవ సమయంలో తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకూ రక్షణ లభిస్తుంది.
యాంటీ రేబీస్ వ్యాక్సిన్
కుక్కలు, పిల్లులు వంటి జంతువుల కాటుకు గురైనప్పుడు ప్రాణాంతక రేబిస్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఈ వ్యాక్సిన్ తక్షణమే తీసుకోవాలి. గాయం తీవ్రతను బట్టి 0, 3, 7, 14, 28 రోజుల్లో వైద్యుల సలహా మేరకు ఈ టీకా తీసుకోవాల్సి ఉంటుందివారికి తప్పనిసరి
‘‘ 60 ఏళ్లు పైబడిన వారు.. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడేవారు.. గుండె, ఉపిరితిత్తులు, క్యాన్సర్ వంటి మేజర్ సర్జరీలు చేయించుకున్న వారు.. ప్రతీఏటా క్రమం తప్పకుండా టీకాలు తీసుకోవాలి. వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే, పెద్దలందరికీ ఓకేరకమైన టీకాలు అవసరం ఉండవు. కాబట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి, వైద్యుల సలహా మేరకు వ్యాక్సిన్స్ తీసుకోవడం మంచిది.’’
- డాక్టర్ జీ వెంకటేశ్వర్లు, ఎండీ,
(ఎమర్జెన్సీ మెడిసిన్) శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం