యూరియా కష్టాలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:25 AM
టెక్నాలజీ రైతులకు పనులు సులువు చేయకపోగా ఇబ్బందులను మరింత పెంచుతోంది. దీనికి తాజా ఉదాహరణ.. ‘ఫర్టిలైజర్ బుకింగ్’ యాప్. ఈ యాప్ ద్వారానే....
యాప్‌తో రైతులకు తీవ్ర ఇబ్బందులు
సొసైటీలకు యూరియా ఎప్పుడొస్తుందో, ఎప్పుడు బుక్ చేయాలో తెలియని పరిస్థితి
‘ఒక బుకింగ్‌కు 2 బస్తాలు’ నిబంధనతో ఇక్కట్లు
అధిక ధరల ఫిర్యాదులతో యూరియా విక్రయాలు నిలిపివేసిన రిటైల్ డీలర్లు
సొసైటీలు, డీలర్ల వద్ద తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని రైతుల విజ్ఞప్తులు
నల్లగొండ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టెక్నాలజీ రైతులకు పనులు సులువు చేయకపోగా ఇబ్బందులను మరింత పెంచుతోంది. దీనికి తాజా ఉదాహరణ.. ‘ఫర్టిలైజర్ బుకింగ్’ యాప్. ఈ యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలనే నిబంధన రైతులకు సంకటంగా మారింది. రిటైల్ డీలర్లు యూరియాను విక్రయించకపోవడం, సహకార సంఘాల్లో తగినన్ని నిల్వలు లేకపోవడంతో.. యాప్ బుకింగ్‌పై రైతుల్లో వ్యతిరేకత వస్తోంది. యాప్ అమలులో క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో మండలం యూనిట్‌గా యూరియా కేటాయింపులు ఉంటున్నాయి. బుకింగ్ సమయంలో ఆ మండలంలో ఏ డీలర్ వద్ద యూరియా ఉంటే అక్కడే రైతుకు 2 బస్తాల యూరియాను కేటాయిస్తున్నారు. ఒక ఎకరం ఉన్న రైతులకు ఒకేసారి, ఎకరం నుంచి ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు విడతల వారీగా ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియాను అందిస్తున్నారు. యాప్‌లో బుకింగ్ ద్వారా ఒక పర్యాయం గరిష్ఠంగా రెండు బస్తాలు మాత్రమే కేటాయిస్తున్నారు. దీంతో ఐదు నుంచి పది ఎకరాల వరకు సాగు చేసే రైతులు అయిదు నుంచి పదిసార్లు బుక్ చేయాల్సి వస్తోంది. ఇన్నిసార్లు బుకింగ్ చేయటం, యూరియా కోసం పలుమార్లు వెళ్లాల్సి రావటంతో వ్యవసాయ పనులు మానుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు బస్తాల సీలింగ్ ప్రకారమే రైతులకు వచ్చే కోటా యూరియాను సీజన్ మొత్తానికి ఒకేసారి బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల వద్ద 40 శాతం యూరియా!
యాప్ బుకింగ్ అమలులోకి వచ్చాక గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండే రిటైల్ డీలర్ల వద్ద యూరియా నిల్వలు ఉండడం లేదు. ఎమ్మార్పీ ధర బస్తాకు రూ.266.50 ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల వద్దనే రూ.20 వరకు అదనంగా తీసుకుంటున్నారని, రవాణా, హమాలీ ఖర్చులు మరో రూ.20 వరకు పడుతున్నాయని, దీంతో తాము బస్తా యూరియాను రూ.310కి తగ్గకుండా విక్రయించాల్సి వస్తుందని రిటైల్ డీలర్లు చెబుతున్నారు. అయితే, ధర పెంచారంటూ రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని.. ఈ నష్టాలు, ఇబ్బందులు భరించలేక తాము యూరియా విక్రయాలు నిలిపివేశామని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, జిల్లాలకు ప్రభుత్వం కేటాయించే యూరియాలో మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్లకు వచ్చే యూరియా మాత్రమే రైతులకు అందుబాటులో ఉంటోంది. డిస్ట్రిబ్యూటర్లకు కేటాయించే 40 శాతం యూరియా ఆయా జిల్లాల రైతులకే విక్రయించాలన్న నిబంధన లేదు. ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం ఉంది. దీంతో యూరియా ఇతర ప్రాంతాలకు వెళ్తోంది. ఫలితంగా యూరియా కొరత నెలకొంటోంది. దీనిని నివారించేందుకు మండలంలో ఉండే సొసైటీలతో పాటు, అన్ని రిటైల్ దుకాణాల వద్ద సీజన్ ముగిసేంతవరకు ప్రతి రోజూ యూరియా నిల్వలు ఉండేలా చూడాలని రైతులు, రైతుసంఘాల నేతలు కోరుతున్నారు.