టీవీవీపీ ఆస్పత్రుల్లో వైద్యుల ఇష్టారాజ్యం.. పర్యవేక్షణ లేక డ్యూటీలకు డుమ్మా
ABN , Publish Date - Aug 03 , 2026 | 08:00 AM
రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు అవసరమైన గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిషియన్ వంటి ప్రత్యేక వైద్యసేవలు అందించే తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల పనితీరు సక్రమంగా లేదు.
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు అవసరమైన గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిషియన్ వంటి ప్రత్యేక (స్పెషలిస్ట్) వైద్యసేవలు అందించే తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని ఆస్పత్రుల పనితీరు సక్రమంగా లేదు. ఈ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేదు. దీంతో చాలాచోట్ల వైద్యులు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్నారు. ఫలితంగా ప్రజలకు వైద్యసేవలు పూర్తి స్థాయిలో అందడంలేదు.
టీవీవీపీ పరిధిలో 184 ఆస్పత్రులున్నాయి. ఇందులో సుమారు 13 జిల్లా ఆస్పత్రులు, వంద పడకలున్న ఏరియా ఆస్పత్రులు 64, ఇవికాక 30, 50 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) 107 వరకు ఉన్నాయి. వైద్యశాఖ వర్గాల ప్రకారం ఈ ఆస్పత్రుల పనితీరు, వైద్యుల హాజరు, ల్యాబ్ టెస్టులు వంటి అంశాలపై రెండు నెలలుగా ఒక్క సమీక్ష కూడా జరగలేదు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది నియామకాల్లో టీవీవీపీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపణలున్నాయి.
మరీ ఇంత నిర్లక్ష్యమా..?
టీవీవీపీ అంశంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే విభాగాధిపతి కార్యాలయంలో హెచోవోడీ లేరు. ఆస్పత్రులను జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు డీసీహెచ్‌ఎస్ (డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్)లు, రాష్ట్రస్థాయిలో కమిషనర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉండాలి. కానీ 33 జిల్లాల్లో రెగ్యులర్ డీసీహెచ్‌ఎస్‌లు లేరు. అసలు డీసీహెచ్‌ఎస్ పోస్టు లనే సర్కారు ఏర్పాటు చేయలేదు. కొన్నేళ్లుగా ఒక్క ప్రొగ్రామ్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయలేదు. ఇక, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా రెగ్యులర్ కమిషనర్‌ను నియమించకుండా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో సమీక్షలు సరిగా జరగడంలేదు.
డీసీహెచ్‌గా మారి 4 నెలలు..
వైద్య విధాన పరిషత్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీసీహెచ్)గా రూపాంతరం చెంది దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ఈ మార్పు వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అంతా భావించారు. కానీ విభాగాధిపతి లేకపోవడంవల్ల సర్వీసు నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించక డీసీహెచ్ కార్యరూపం దాల్చలేదు. ఇటీ వల రిక్రూట్‌మెంట్ అయిన సుమారు 600మంది స్పెషలిస్టు వైద్యులకు ఇంతవరకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. టీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో సుమారు 4300 మంది స్పెషలిస్టు వైద్యులు అవసరం కాగా ప్రస్తుతం 1600 మంది మాత్రమే ఉన్నారు. మరో 2700 మందిని భర్తీ చేయాల్సి ఉండగా.. కొత్తగా రిక్రూటైన వారు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా వైద్యులు, అధికారులు లేక టీవీవీపీ ఆస్పత్రుల్లో అందించే వైద్య సేవలపై ప్రభావం పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్ నియామకం
కోర్టుల్లో విచారణకు నోచని ‘పరీక్షల్లో అక్రమాల’ కేసులు..158