రెండు బ్యారేజీలతో తుమ్మిడిహెట్టి!
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:32 AM
బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద రెండు బ్యారేజీలు నిర్మించాలని సర్వే సంస్థ ఆర్వీ అసోసియేట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి..
వార్ధా, వెయిన్‌గంగ సంగమస్థలి వద్ద ప్రవాహానికి అడ్డంగా నిర్మించాలని ప్రతిపాదన
150 మీటర్ల ఎత్తుతో రెండు బ్యారేజీల నిర్మాణం.. ఒకటి వార్ధాపై, మరొకటి వెయిన్‌గంగపై
రెండు బ్యారేజీలకు కలిపి 137 గేట్లు.. 165 టీఎంసీల నీటి లభ్యత అంచనా
తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీటి తరలింపు.. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి
ప్రభుత్వానికి ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక.. మరికొన్ని మార్పులు సూచించిన సర్కార్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద రెండు బ్యారేజీలు నిర్మించాలని సర్వే సంస్థ ఆర్వీ అసోసియేట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. వార్ధా, వెయిన్‌గంగా నదుల సంగమ స్థానంలో ఒక బ్యారేజీ వార్ధాపై, మరొకటి వెయిన్‌గంగాపై నిర్మించాలని సూచించింది. వార్ధా బ్యారేజీని 60 గేట్లతో 867 మీటర్ల పొడవు, వెయిన్‌గంగాను 77 గేట్లతో 1,113.50 మీటర్ల పొడవున నిర్మించాలని ప్రతిపాదించింది. రెండు బ్యారేజీలు 150 మీటర్ల ఎత్తుతో నదీ ప్రవాహానికి అడ్డంగా (perpendicular) లంబకోణంలో నిర్మించాలని సూచించింది. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)తో సంప్రదింపులు జరిపి ఈ డిజైన్‌ను సర్వేలో ప్రతిపాదించారు. ఈ మేరకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్‌ఆర్)ను ప్రభుత్వానికి ఆర్వీ అసోసియేట్స్ అందించింది.
గ్రామాల ముంపు లేకుండా నిర్మాణం..
ఎలాంటి గ్రామాల ముంపు లేకుండా 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీలు కట్టవచ్చని సర్వే సంస్థ తెలిపింది. 148 మీటర్ల ఎత్తుతో కడితే 3,715 ఎకరాల ముంపు ఉంటుందని, అందులో నదీ గర్భం 2,772 ఎకరాలు, చాప్రాల అభయారణ్యంలో 728 ఎకరాలు ముంపు ఉంటుందని పేర్కొంది. 215 ఎకరాలు ప్రైవేట్ భూములను సేకరించాల్సి ఉంటుందని తెలిపింది. 149 మీటర్ల ఎత్తు నిర్మిస్తే 3,064 ఎకరాలు నదీ గర్భం, 807 ఎకరాలు చాప్రాల అభయారణ్యం ముంపునకు గురికానుండగా.. 524 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా 4,215 ఎకరాలు ముంపు ఉంటుందని తెలిపింది. 150 మీటర్ల ఎత్తుతో అయితే 4,215 ఎకరాలు నదీ గర్భం, చాప్రాల అభయారణ్యంలో 943 ఎకరాలు ముంపునకు గురికానుండగా... 1,018 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని పేర్కొంది. 151 మీటర్ల ఎత్తుతో కడితే 4,785 ఎకరాల నదీ గర్భం, 1,130 చాప్రాల అభయారణ్యం ముంపు ఉండగా.. 1,765 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని తెలిపింది. 152 మీటర్ల ఎత్తుతో అయితే 5,325 ఎకరాల నదీ గర్భం, 1,345 ఎకరాల అభయారణ్యం ముంపునకు గురికానుండగా.. 2,898 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని వివరించింది.
150 మీటర్ల ఎత్తుతో 3.482 టీఎంసీల నిల్వ..
150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీలు నిర్మిస్తే 3.482 టీఎంసీల నీటి నిల్వ సాధ్యమవుతుందని సర్వే సంస్థ తెలిపింది. 148 మీటర్ల ఎత్తుతో అయితే 2.182 టీఎంసీలు, 152 మీటర్ల ఎత్తుతో 5.697 టీఎంసీల నీటి నిల్వ సాధ్యమని పేర్కొంది. సీడబ్ల్యూసీ గత అధ్యయనాల ప్రకారం 75 శాతం డిపెండబిలిటీ (నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లు వచ్చే వరద ఆధారంగా) ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 205.8 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపింది. బ్యారేజీల ప్రతిపాదన ప్రదేశంలో 165.38 టీఎంసీల నీటి లభ్యత ఉందని వెల్లడించింది. బ్యారేజీల నిర్మాణం కోసం నాలుగు ప్రతిపాదనలు చేసి, అందులో మూడో ప్రత్యామ్నాయం అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదించింది. ఇందులో ప్రధాన బ్యారేజీలతో కలిపి మొత్తం నిర్మాణం 6.517 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, దీని వల్ల అడ్డంగా అమరికతో గేట్ల నిర్వహణ సులువుగా ఉంటుందని పేర్కొంది. అండర్ స్లూయిస్ బేలు వార్ధాలో 6, వెయిన్‌గంగాలో 8 ప్రతిపాదించింది. బ్యారేజీలో ఒక్కో పిల్లర్ 2 మీటర్ల మందంతో నిర్మించాల్సి ఉంటుందని పేర్కొంది. వార్ధాలో 27,382 క్యూమెక్కులు, వెయిన్‌గంగాలో 34,850 క్యూమెక్కుల వరద పోయేలా డిజైన్ చేశారు.
తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు..
బ్యారేజీతో పాటు టన్నెల్ నిర్మాణం, ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను కూడా నివేదికలో సూచించారు. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించడానికి వీలుగా ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ ఉంది. దీనిని 76.650 కిలోమీటర్లకు పొడిగించి, అక్కడి నుంచి 97,550 కిలోమీటర్ వరకు 20.90 కిలోమీటర్ల సొరంగం తవ్వాలని ప్రతిపాదించింది. గ్రావిటీ కెనాల్‌లో 588 క్యూమెక్కుల వరద వెళ్లేలా డిజైన్ చేశారు. 90 రోజుల్లో 80 టీఎంసీల నీటిని తరలించేలా గతంలో కెనాల్‌ను ప్రతిపాదించారు. గ్రావిటీ కెనాల్, సొరంగం ద్వారా నీటిని సుందిళ్లకు చేర్చి.. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తరలిస్తారు. సింగరేణి థర్మల్ ప్లాంట్, బొగ్గు గనులు, రైల్వే లైన్లు, హైవేలను ముట్టుకోకుండా ఈ టన్నెల్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కాగా, పీఎఫ్ఆర్‌లో ప్రభుత్వం కొన్ని మార్పులు సూచించింది. ఆ మార్పుల అనంతరం తుది నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ఆ తర్వాత ఈ పీఎఫ్ఆర్‌పై మంత్రివర్గ సమావేశంలో చర్చించి, అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి పంపనున్నారు.
ఇప్పటికే ఏడు రకాల అనుమతులు..
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం 165 టీఎంసీలతో చేపట్టగా... 2015 ఫిబ్రవరి 13వ తేదీన హైడ్రాలజీ అనుమతి లభించింది. ఇరిగేషన్ ప్లానింగ్ (ఏమేరకు ఆయకట్టుకు, ఏయే పంటలకు నీరందిస్తున్నారనేది దానిపై), అంతర్ రాష్ట్ర క్లియరెన్స్ (ఏ రాష్ట్రంతోనూ ఇబ్బందులు లేవని), సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్ (భూమి ఏ విధంగా ఉందనేదానిపై), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (భూగర్భ జలాలపై), కన్‌స్ట్రక్షన్ మిషనరీ కన్సల్టెన్సీ (నిర్మాణం కోసం వినియోగించే యంత్ర పరికరాలు), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ (పంటలపై) అనుమతులు కూడా వచ్చాయి. పర్యావరణ అనుమతి కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్‌లో బహిరంగ విచారణ జరగ్గా... మహారాష్ట్రలో పూర్తికాలేదు. మళ్లీ కొత్తగా ప్రక్రియ మొదలు కానుంది.