Share News

22 నుంచి సమ్మె

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:06 AM

టీజీఎస్ఆర్టీసీలో మరో సారి సమ్మె సైరన్‌ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇచ్చిన హామీల అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని....

22 నుంచి సమ్మె

  • ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ నేతలు

  • తాము ఇచ్చిన సమ్మె నోటీసుపై సర్కారు స్పందించలేదని వెల్లడి

  • సమ్మెపై పునరాలోచన చేయండి

  • ప్రేరేపిత సమ్మె సరి కాదు: కమిటీ

  • పరిశీలనలో ఆర్టీసీ విలీనం: పొన్నం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): టీజీఎస్ఆర్టీసీలో మరో సారి సమ్మె సైరన్‌ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇచ్చిన హామీల అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని గత నెల 13న ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. అయితే, ఆ నోటీసుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, కార్మిక శాఖ వద్ద జరిగిన రెండు సమావేశాలకు ఆర్టీసీ అధికారులు గైర్హాజరు కావడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. గతంలోనూ సమ్మెకు ఒక్క రోజు ముందు ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గామని, ఈ సారి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.


కాగా, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రేరేపిత సమ్మెలకు వెళ్లవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం కమిటీ పరిశీలనలో ఉందన్నారు. ఆర్టీసీ పరిధిలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 2018 నుంచి విద్యుత్‌ బస్సులు దశల వారీగా వస్తున్నాయని, ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. విద్యుత్‌ బస్సుల వల్ల ఉద్యోగాలు పోతాయనే అపోహ సరికాదని అన్నారు. ఆర్టీసీలో పని చేసి రిరైర్డ్‌ అయిన వారు యూనియన్‌ నాయకులుగా చలామణి కావడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. సమ్మె విషయంలో కార్మికులు, నాయకులు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రకటనపై జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న స్పందిస్తూ.. ఆర్టీసీ విలీనం విషయంలో కమిటీ పేరు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ వేసినట్లు ఇప్పటి వరకు చెప్పలేదని, తాము సమ్మెకు వెళ్తున్నామనగానే కమిటీని తెరపైకి తేవడమేంటని నిలదీశారు.

Updated Date - Apr 14 , 2026 | 09:13 AM