Share News

ధాన్యం, మక్కల రవాణాకు లారీల్లేవ్‌..

ABN , Publish Date - May 14 , 2026 | 04:24 AM

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం, మక్కల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా... వాటిని మిల్లులు, గోదాములకు తరలించటానికి వాహనాలు అందుబాటులో ఉండటం లేదు.

ధాన్యం, మక్కల రవాణాకు లారీల్లేవ్‌..

  • ఒప్పందం ప్రకారం సెంటర్లకు వాహనాలు పంపించని కాంట్రాక్టర్లు

  • టెండరు ఏజెన్సీలు వేరు..సరఫరాదారులు, సబ్‌కాంట్రాక్టర్లు వేరు

  • కాగితాలపైనే కనిపిస్తున్న లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ట్రక్కులు

  • తూకం వేశాక రోజుల తరబడి నిరీక్షణే

  • అకాల వర్షాలతో తడుస్తున్న పంట ఉత్పత్తులు.. నష్టపోతున్న రైతులు

హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం, మక్కల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా... వాటిని మిల్లులు, గోదాములకు తరలించటానికి వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ట్రక్కులు కలిపి ధాన్యం తరలించడానికి రాష్ట్రంలో 11,500 వాహనాలు అందుబాటులో ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లెక్కలు చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో కనిపించటంలేదు. ఒక లారీ కోసం మూడు, నాలుగు రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. కాంట్రాక్టర్లు, అధికారులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఫోన్లు చేస్తే... ఇదిగో, అదిగో అని చెప్పటమే తప్ప సకాలంలో వాహనాలను పంపించటంలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటున్నాయి. స్థలం కూడా తక్కువగా ఉండటంతో రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని వెంటనే తూకం వేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ యాసంగిలో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 30 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఇంకా రెండొంతుల ధాన్యం సేకరించాల్సి ఉండగా వాహనాల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. మక్కల రవాణాకు మార్క్‌ఫెడ్‌ జిల్లాల వారీగా రవాణా టెండర్లు పిలిచింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు... సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పజెప్పి పత్తాలేకుండా పోయారు. నర్సంపేట సూర్యాపేట జిల్లాకు 700 లారీలు కేటాయించినట్లు చెబుతున్నా సెంటర్లలో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. హనుమకొండ జిల్లాలో లారీలు లేక 9 వేల టన్నుల మక్కల తరలింపు నిలిచిపోయింది. కరీంనగర్‌, ములుగు, జోగులాంబ గద్వాల, జనగామ, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, వరంగల్‌, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాస్థాయిలో అధికారులు, కాంట్రాక్టర్లకు మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉండటంతో ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఒక్క రవాణా కాంట్రాక్టర్‌పైగానీ, సబ్‌ కాంట్రాక్టర్‌పైగా చర్యలు తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు.


గోదాముల కొరత మరో ప్రధాన సమస్య

రాష్ట్రంలోని గోదాములు ఇప్పటికే దాదాపు బియ్యం, మక్కలు, ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులతో నిండిపోయాయి. దాంతో రైతు బజార్లు, ఫంక్షన్‌ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలు... స్థలం ఎక్కడుంటే అక్కడ ప్రస్తుతం కొంటున్న ధాన్యం, మక్కలు నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే సమీపంలో ఉన్న గోదాములు కాకుండా సుదూరంలో ఉన్నవి కేటాయిస్తే... రవాణా కాంట్రాక్టర్లు స్పందించటం లేదు. రవాణా ఖర్చులు పెరుగుతాయనే ఉద్దేశంతో వాహనాలు సమకూర్చడం లేదు. రైస్‌ మిల్లుల్లో కూడా పాత ధాన్యం నిల్వలు ఉండటంతో... కొత్తవి దించుకోవటానికి మిల్లర్లు మొగ్గు చూపటంలేదు. కల్లాల్లోనే కాదు... కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యం, మక్కలు అకాల వర్షాలకు తడిసిపోయి రైతుల నష్టపోతున్నారు. కాగా, రైతుల నుంచి ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 04:24 AM