ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం!
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:36 AM
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు కొత్తమలుపు తిరిగింది. తనతోపాటు శిక్షణ పొందుతున్న..
బంధువుల ఇంట్లో గుర్తుతెలియని ద్రావణం తాగిన ఉదయ్?
ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. నిలకడగా ఆరోగ్యం
కడుపులో విష పదార్థాల ఆనవాళ్లు లభించలేదన్న వైద్యులు
రక్త పరీక్ష రిపోర్టులు వచ్చాకే స్పష్టత వస్తుందని వెల్లడి
తోటి మహిళా ట్రైనీపై వేధింపుల కేసులో నిందితుడు
అన్నీ నిరాధార ఆరోపణలే.. ఇన్‌స్టాలో ఉదయ్ స్టేట్‌స్
ఏడాది కాలంగా ఆమె, నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాం
తానే నా గదికి వచ్చేది.. బలవంతంగా తీసుకెళ్లలేదు
ఆధారాలున్నాయి.. ఉదయ్ నోట్ వైరల్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్/అమీర్‌పేట్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు కొత్తమలుపు తిరిగింది. తనతోపాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ మహిళా ఐపీఎస్‌ను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి స్వగ్రామానికి వెళ్లిన ఉదయకృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం బోరబండ మోతీనగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చి.. సోమవారం అక్కడ గుర్తు తెలియని ద్రావణం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఎస్సార్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ద్రావణం సేవించక ముందు.. తాను నిరపరాధినని, తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఉదయకృష్ణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టేట్‌సలో పెట్టారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని, మీడియా కూడా నిజాలు తెలుసుకోవాలని కోరారు. కాగా, ఉదయకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు స్టమక్ వాష్ చేశామని, ఎలాంటి విష పదార్థాల ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. అయితే రక్త, మూత్ర పరీక్షలు కూడా చేశామని, వాటి రిపోర్టులు వచ్చాక ఆయన ఏమి తీసుకున్నారన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో తన అన్న మనస్తాపం చెందారని ఉదయకృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిన్నటి నుంచి మద్యం సేవించడంతోపాటు ఎలాంటి ఆహారం తీసుకోలేదని, మద్యం బాటిల్ పక్కనే శానిటైజర్ బాటిల్ ఉండటంతో అనుమానించి ఆస్పత్రికి తరలించామని చెప్పారు. తన అన్న నిరపరాధి అని, న్యాయం గెలుస్తుందని అన్నారు.
ఉదయకృష్ణారెడ్డిపై కొనసాగుతున్న విచారణ..
ఉదయకృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్, అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎ.సీతయ్య ఆదివారం సాయంత్రం ఎస్‌వీపీ ఎన్‌పీఏ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ ఘటనపై శిక్షణలో ఉన్న మిగతా వారికి ఏమైన తెలుసా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మరోవైపు ఎస్‌వీపీ ఎన్‌పీఏ అధికారులు కూడా ఘటనపై ఓ కమిటీ వేసి విచారిస్తున్నట్లు తెలిసింది.
కలకలం రేపుతున్న సూసైడ్ నోట్
ఆత్మహత్యయత్నానికి ముందు ఉదయకృష్ణారెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ లభించిందన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. లేఖలో సంచలన విషయాలు ఉన్నాయి. తనపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎ్‌సపై ఇందులో ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అసలు వాస్తవాలకు సంబంధించిన ఆధారాలు తన ఐ ఫోన్‌లో ఉన్నాయని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 2025 జూన్ నుంచి తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఆమెకు పెళ్లయిన తర్వాత కూడా ఆ బంధం కొనసాగిందని, అయితే ఇటీవల ఆమెను దూరం పెట్టానని తెలిపారు. ఆమెను తాను బలవంతంగా గతికి తీసుకెళ్లలేదని, పలుమార్లు తనంతట తానుగా గదికి వచ్చిందని పేర్కొన్నారు. గది తలుపు తెరవాల్సిందిగా వాట్సాప్ చాటింగ్‌లో కోరేదని తెలిపారు. ఈ నెల 9న కూడా ఎప్పటిలాగే ఆమె తన గదికి వచ్చిందని, తమ మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు తానే స్వయంగా తెలిపానని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొని ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారన్నారు. తన చావుకు ఆమె, ఆమె భర్తతోపాటు మరో ఇద్దరు కారణమని లేఖలో ఉదయకృష్ణారెడ్డి తెలిపారు.