సదర్ వేడుకల్లో విషాదం
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:52 AM
ఎల్‌బీనగర్ పోలీస్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో ఉల్లాసంగా సాగుతున్న యాదవ్ సదర్ సమ్మేళనం ఓ కుటుంబానికి విషాదం మిగిల్చింది.
గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి దుర్మరణం
కొత్తపేట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌బీనగర్ పోలీస్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో ఉల్లాసంగా సాగుతున్న యాదవ్ సదర్ సమ్మేళనం ఓ కుటుంబానికి విషాదం మిగిల్చింది. మన్సురాబాద్‌లోని రాగాల ఎన్‌క్లేవ్ వాసులు పోచబోయిన లక్ష్మణ యాదవ్- చిత్ర దంపతుల పెద్ద కుమారుడు భవానీ శంకర్ (16).. కోహెడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. దీపావళి సందర్భంగా సెలవు ఇవ్వడంతో ఇంటికొచ్చిన భవానీ శంకర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి మన్సూరాబాద్ చౌరస్తాలో జరిగిన యాదవ సదర్ సమ్మేళనంలో పాల్గొన్నాడు. ఉత్సాహంగా దున్నపోతును ఆడిస్తున్న భవానీ శంకర్.. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తాత సత్యనారాయణ ఒడిలో ఒరిగి పోయాడు. చికిత్స కోసం బంధువులు అతడ్ని సమీప కామినేని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్ధారించారు. గుండెపోటు వల్లే భవానీ శంకర్ మృతి చెందాడని చెప్పారు. చిన్నతనంలో గుండెకు చిన్న రంధ్రం ఉంటే శస్త్ర చికిత్సతో సరి చేసినట్లు సమాచారం. నాటి నుంచి భవానీ శంకర్‌కు ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తలేదని ఆయన బంధువులు పేర్కొంటున్నారు.