స్మగ్లర్లకు విక్రయించేందుకే!
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:24 AM
ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో అరెస్టయిన నిందితుడు, మాజీ హవల్దార్ మల్లేశ్‌కు.. ఆయుధాల అక్రమ రవాణా ముఠాలతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది
కంటోన్మెంట్ ఆయుధాల చోరీ.. మల్లేశ్‌కు స్మగ్లర్లతో లింకు
కోల్‌కతా స్మగ్లర్లతో నాలుగేళ్లుగా టచ్‌లో ఉన్న నిందితుడు
ఏకే-47, ఏకే- 203 రైఫిళ్లు ఇస్తానని రూ.లక్షల్లో బేరం
ఏడాది క్రితమే కోల్‌కతా నుంచి బొల్లారానికి బదిలీ
ఎనిమిది మందిని అరెస్టు చేసిన మల్కాజిగిరి పోలీసులు
నేడు మీడియాకు వివరాలు వెల్లడించనున్న డీజీపీ
ఏకే-47, ఏకే- 203 రైఫిళ్లు
ఇస్తానని రూ.లక్షల్లో బేరం
8 మందిని అరెస్టు చేసిన పోలీసులు
వారిలో ముగ్గురు ఆయుధాల స్మగ్లర్లుముగ్గురు ఆర్మీ రెజిమెంట్ అధికారులు
కేసు తీవ్రత తెలియక ఇరుక్కున్న ఇద్దరు మల్లేశ్ స్నేహితులు
పోలీస్ కస్టడీలో విస్తుపోయే విషయాలు
నేడు మీడియాకు వెల్లడించనున్న డీజీపీ
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో అరెస్టయిన నిందితుడు, మాజీ హవల్దార్ మల్లేశ్‌కు.. ఆయుధాల అక్రమ రవాణా ముఠాలతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. వారికి విక్రయించేందుకే బొల్లారం ఆర్మీ 20 మద్రాస్ రెజిమెంట్‌లో అతడు ఆయుధాల చోరీకి పాల్పడ్డట్లు సమాచారం. ఏకే-47, ఏకే- 203 రైఫిళ్లు ఇస్తానని ఆయుధాల స్మగ్లర్లతో రూ.లక్షల్లో బేరం తెలిసింది. ఈ మేరకు పోలీసుల విచారణలో ఈ విషయాలను వెల్లడించినట్లు సమాచారం. మల్లేశ్‌కు పది రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో ఈ నెల 1న తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే.. పోలీసులు అతణ్ని విచారించిన క్రమంలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మల్లేశ్ 2022లో కోల్‌కతాలోని బ్యారక్‌పూర్ కంటోన్మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో.. యూనిట్ సమీపంలో చెరుకు రసం విక్రయిస్తున్న బీర్బల్ షాతో పరిచయం ఏర్పడింది.బీర్బల్ షాకు.. దేశంలో అక్రమంగా తుపాకులు విక్రయించే అవల్‌దేయ్ అలియాస్ ఓబీ అనే స్మగ్లర్‌తో పరిచయం ఉండటంతో మల్లేశ్‌కు అతణ్ని పరిచయం చేశాడు.
ఆయుధాలను కొనుగోలు చేయడం, దేశ విదేశాలకు చెందిన ఆయుధాల స్మగ్లర్లకు విక్రయించడంలో అవల్‌దేయ్ నిష్ణాతుడు. ఇది నిజమో, కాదో తెలుసుకునేందుకు మల్లేశ్ రూ.10 వేలు చెల్లించి అవల్‌దేయ్ నుంచి ఓ తుపాకీని కొనుగోలు చేశాడు. ఆ తుపాకీతో అమాయకులను బెదిరించి దారిదోపిడీ చేయాలని ప్రయత్నించాడు. అయితే కోల్‌కతాలో అది సాధ్యం కాకపోవడంతో ఆ తుపాకీని స్వగ్రామంలో దాచినట్లు విచారణలో వెల్లడైంది. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా కోల్‌కతాలో మల్లేశ్‌ను కొంతకాలం అధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 2023లో తిరిగి మళ్లీ బ్యారక్‌పూర్‌లోనే విధుల్లో చేరాడు. ఆ తర్వాత కోల్‌కతాలో తన పప్పులు ఉడకవని భావించి.. 2025 జూన్‌లో హైదరాబాద్ బొల్లారం 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌కు బదిలీపై వచ్చాడు.
వెబ్ సిరీసులు చూసి చోరీలకు ప్లాన్..
నాగర్ కర్నూల్‌లో తనకు ఉన్న ఖాళీ స్థలంలో మల్లేశ్ ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయన్న అంచనాతో అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. అందుకు సుమారు రూ.8 లక్షలు అప్పులు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆర్థిక ఒత్తిడి పెరగడంతో.. దాన్నుంచి బయటపడేందుకు ఆర్మీ ఆయుధాల చోరీకి పథకం వేసినట్లు తెలుస్తోంది. అందుకు తన చిన్ననాటి ేస్నహితులైన నిరంజన్, మల్లికార్జున్‌తో కలిసి తొలుత చోరీలకు ప్లాన్ చేశాడు. బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దొంగతనాలకు సంబంధించిన వెబ్ సిరీ్‌సలు, వీడియోలు చూసి.. వాటిని ేస్నహితులకు పంపినట్లు విచారణలో వెల్లడైంది. 2025లోనే ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీకి మల్లేశ్ ప్లాన్ చేశాడు. అందుకు నిరంజన్ మల్లికార్జున్‌లు భయపడి అంగీకరించకపోవడంతో వ్యూహం మార్చుకున్నాడు. అనంతరం ఈ ఏడాది జూన్‌లో విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మల్లేశ్‌ను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో అధికారులపై కక్ష పెంచుకోవడం, ఎలాగైనా భారీగా ఆయుధాలు చోరీ చేసి ఆర్మీ బెటాలియన్‌కు నష్టం వాటిల్లేలా చేయడంతోపాటు.. ఉన్నతాధికారులను ఇరికించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
కోటె ఇన్‌చార్జుల సహకారంతో..
కోటెలో భద్రపరిచిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేేసందుకు మల్లేశ్.. అక్కడ పనిచేస్తున్న శేషు, తన బ్యాచ్‌మేట్ ప్రవీణ్, కోటె ఇన్‌చార్జి వినోద్‌ల సహకారం తీసుకున్నాడు. ఇందుకుగాను.. శేషు, వినోద్‌కు రూ.లక్ష ఇచ్చినట్లుగా విచారణలో వెల్లడించినట్లు సమాచారం పక్కా ప్రణాళిక ప్రకారం ఆగస్టు 30వ తేదీ రాత్రికి రెండు రోజుల ముందు నుంచే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారు. చోరీ జరిగిన రోజు కెమెరాలపై మల్లేశ్ ఫోమ్ చల్లినట్లు తెలిసింది. మల్లేశ్‌కు సహకరించిన ప్రవీణ్, శేషు విద్యుత్ దీపాలను ఆర్పివేశారు. సుమారు గంటన్నరపాటు మల్లేశ్ ఆయుధాలు తరలిస్తున్న సమయంలో అక్కడున్న ఇతర జవాన్లను శేషు, ప్రవీణ్ డైవర్ట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొదట ద్విచక్రవాహనంపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలించి గుడివద్ద దాచిన మల్లేశ్.. అనంతరం కారులో వాటిని నాగకర్నూల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి గడ్డివాములో దాచిన విషయం తెలిసిందే. ఈ కేసులో మద్రాస్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌కు చెందిన ప్రవీణ్, 20వ బెటాలియన్ చెందిన శేషు, కోటె ఇన్‌చార్జి వినోద్‌లు తాము చేసిన తప్పును విచారణలో అంగికరించినట్టు సమాచారం.
కోల్‌కతా ఆయుధాల స్మగ్లర్ల అరెస్టు..
చోరీ చేసిన ఆయుధాలను కోల్‌కతాకు చెందిన ఆయుధాల స్మగ్లర్స్ బీర్బల్ షా, అవల్‌దేయ్‌కి విక్రయించేందుకు మల్లేశ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వాటిలో నాలుగు ఏకే-47లకు రూ.5 లక్షలు, పిస్టళ్లకు రూ.3 లక్షలు, ఏకే-203 రైఫిళ్లకు మరికొన్ని లక్షలు ఇవ్వాలని బీర్బల్ షా ద్వారా కోరినట్లు తెలుస్తోంది. కాగా, మల్లేశ్ గతంలోనూ వారికేమైనా ఆయుధాలు విక్రయించాడా? అన్నది తేలాల్సి ఉంది. మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు.. కోల్‌కతాకు వెళ్లి ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు తీవ్రత తెలియకనే ఇతర నిందితులు మల్లేశ్‌కు సహకరించి ఇప్పుడు అరెస్టయి జైలుపాలైనట్లు తెలిసింది. డీజీపీ సీవీ ఆనంద్ శనినవారం మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.