ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న ట్రాలీ
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:40 AM
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని టాటా ఏస్ ఢీకొట్టడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు
ముగ్గురు కార్మికుల దుర్మరణం..14 మందికి గాయాలు
రాజేంద్రనగర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని టాటా ఏస్ ఢీకొట్టడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీలో ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న 17 మంది శనివారం ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో పెయింటింగ్, గార్డెనింగ్ పనుల కోసం వెళ్లారు. పనులు ముగించుకుని రాత్రి టాటా ఏస్‌లో తిరిగి మొయినాబాద్‌కు బయలుదేరారు. పోలీస్ అకాడమీ సమీపంలోని ఎగ్జిట్-18 వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను టాటా ఏస్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొయినాబాద్ మండలం సూరంగల్‌కు చెందిన పెంటయ్య (64), బిహార్‌కు చెందిన సూరజ్ (41), ఒడిశాకు చెందిన లింగరాజు శెట్టి (38) తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. టాటా ఏస్ డ్రైవర్ నర్సింహతో పాటు మరో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నానక్‌రాంగూడలోని అపోలో, లంగర్‌హౌజ్‌లోని రెనోవో ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు పెంటయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.