Share News

మజ్లిస్‌ అంటే ఆ పార్టీలకు భయం

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:28 AM

మజ్లిస్‌ పార్టీకి భయపడి, ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గే గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సెప్టెంబర్‌ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి వెనుకాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు

మజ్లిస్‌ అంటే ఆ పార్టీలకు భయం
bjp

  • అందుకే విమోచన దినోత్సవాన్ని జరపరు

  • అవినీతికి మారుపేరు కాంగ్రెస్‌: రాంచందర్‌రావు

చార్మినార్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ పార్టీకి భయపడి, ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గే గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సెప్టెంబర్‌ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి వెనుకాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు మహిళా శక్తి స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఆడబిడ్డలు రోకలిబండలు, కారపు ముద్దలతో ధైర్యంగా పోరాడి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర మనదని అన్నారు. నిజాం సైన్యం, రజాకార్లు గ్రామాలపై పడి ప్రజల, హిందువుల ఆస్తులను లూటీ చేస్తూ, జాతీయ జెండా ఎగరేసిన వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపుతూ, మహిళలను చిత్రహింసలకు గురిచేశారన్నారు. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ జోక్యంతో సెప్టెంబరు 17న తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబరు 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న హైదరాబాద్‌ విముక్తి వేడుకలకు ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రి శ్రీగజేంద్ర సింగ్‌ షెకావత్‌ తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.


22ఏపై శ్వేతపత్రం విడుదల చేయాలి

న్యూఢిల్లీ: తెలంగాణలో 22ఏ నిషేదిత జాబితాలో ఉన్న భూములు, అసైన్డ్‌ భూములపై వాస్తవాలను వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ధరణి పోర్టల్‌, భూభారతిలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని కోరారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ భూరికార్డుల నమోదులో తప్పులు చేసిన అధికారులు, అందుకు బాధ్యులైన మంత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

యూనిఫాం సివిల్‌ కోడ్‌ ఏ మతానికీ వ్యతిరేకం కాదు: లక్ష్మణ్‌

యూనిఫాం సివిల్‌ కోడ్‌ ఏ మతానికీ వ్యతిరేకం కాదని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. పౌరులందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు కల్పించే చట్టమని చెప్పారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఉద్యమకారులకు దిశానిర్దేశనం చేసిన ప్రొఫెసర్‌ జి. లక్ష్మణ్‌ సేవలు మరువలేనివన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జి. లక్ష్మణ్‌ రచించిన ‘సెప్టెంబర్‌ 17 - తెలంగాణ విమోచన దినం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో లక్ష్మణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావులు, విద్యావంతులను గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని మండిపడ్డారు.

Updated Date - Sep 16 , 2026 | 06:28 AM