రేవంత్‌రెడ్డిపై ఆ కేసు చెల్లదు
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:19 AM
ఓటుకు నోటు’ వ్యవహారంలో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసు చట్ట ప్రకారం చెల్లదని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2015లో అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. లంచం ఇవ్వజూపడం అనేది నేరుగా నేరం కిందకు రాదని, అది కేవలం ప్రేరేపించడం కిందకే వస్తుందని ఆయన వాదించారు.
‘ఓటుకు నోటు’ కేసులో ఆయనపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లవు
కేసు దర్యాప్తు అధికారం ఏసీబీకి లేదు
అది ఎన్నికల నిబంధనలకు సంబంధించిన కేసు
సుప్రీంకోర్టులో సిద్ధార్థ్ లూథ్రా వాదనలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసు చట్ట ప్రకారం చెల్లదని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2015లో అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. లంచం ఇవ్వజూపడం అనేది నేరుగా నేరం కిందకు రాదని, అది కేవలం ప్రేరేపించడం కిందకే వస్తుందని ఆయన వాదించారు. 2018లో వచ్చిన సవరణల తర్వాతే లంచం ఇవ్వడాన్ని ప్రత్యేక నేరంగా చేర్చారని, పాత చట్టం కింద ఈ కేసు నిలబడదని, రేవంత్‌రెడ్డిపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని చెప్పారు. ఘటన జరిగినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందని, జనరల్ డైరీలో వివరాలను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కుల్దీప్ నయ్యర్, సీతా సోరెన్, పీవీ నరసింహారావుల కేసులను ప్రస్తావిస్తూ.. ప్రజాప్రతినిధుల ఓటు హక్కు, సభాహక్కులు, అవినీతి చట్టాల పరిమితుల గురించి సుప్రీంకోర్టుకు వివరించారు. ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021లో రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరికొన్ని అప్లికేషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లన్నింటిపై బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లధర్మాసనం విచారణ జరిపింది. రేవంత్‌రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్, సండ్ర వెంకట వీరయ్య తరఫున నాగముత్తు, ప్రభుత్వం తరఫున గౌరవ అగర్వాల్, రాష్ట్ర స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్‌కుమార్, ప్రతివాదుల తరఫున ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు హాజరయ్యారు.
రేవంత్‌రెడ్డి తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఓటుకు నోటు కేసు పూర్తిగా రాజకీయ కోణంతో ముడిపడి ఉందన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, రేవంత్‌రెడ్డిని ట్రాప్ చేసిన తర్వాతే నమోదు చేశారని తెలిపారు. ఈ ఉదంతం పూర్తిగా ఎన్నికల నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించిందని.. దీనిపై దర్యాప్తు చేసే అధికారం ఏసీబీకి లేదని స్పష్టం చేశారు. ఈ కేసును ఎన్నికల కేసుగా పరిగణించాలని కోరారు. ప్రతివాదుల తరఫున ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. నిజానికి బాధితులం తామేనని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని, ఈ కేసులో వీడియో, ఆడియో రికార్డింగ్‌లు, ఫోరెన్సిక్ రిపోర్టులు సిద్ధమై చార్జిషీట్ కూడా దాఖలైందని అన్నారు. అన్నీ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయని, విచారణ కొనసాగాలని విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తర్వాత కొద్దిసేపు లూథ్రా వాదనలు వినిపించారు. ఆర్యమ సుందరం అనారోగ్యంతో విచారణకు హాజరు కాలేకపోయారని, వాదనలు వినిపించేందుకు మరో రోజు అవకాశం కల్పించాలని న్యాయవాది మోహిత్‌రావు కోరారు. స్పందించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ ఈ నెల 30న జరిగే అవకాశం ఉంది.