Share News

చిన్న తప్పయినా కఠిన చర్యలు తప్పవు.. జాగ్రత్త

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:16 AM

రహదారిపై పాత ఓఎంఆర్‌ షీట్లు కనిపించిన ఘటనకు సంబంధించి టీజీపీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వసతిగృహ సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి 2018లో నిర్వహించిన రాత పరీక్షల ఓఎంఆర్‌ పత్రాలు ఇటీవల రహదారిపై కనిపించాయి. దీనిపై ఇప్పటికే విచారణ జరిపించిన కమిషన్‌..

చిన్న తప్పయినా కఠిన చర్యలు తప్పవు.. జాగ్రత్త

  • టీజీపీఎస్సీకి ప్రభుత్వం హెచ్చరిక !

  • పాత ఓఎంఆర్‌ షీట్ల ధ్వంసంపై ప్రత్యేక పర్యవేక్షణ

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రహదారిపై పాత ఓఎంఆర్‌ షీట్లు కనిపించిన ఘటనకు సంబంధించి టీజీపీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వసతిగృహ సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి 2018లో నిర్వహించిన రాత పరీక్షల ఓఎంఆర్‌ పత్రాలు ఇటీవల రహదారిపై కనిపించాయి. దీనిపై ఇప్పటికే విచారణ జరిపించిన కమిషన్‌.. సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులైన ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్లను సోమవారం సస్పెండ్‌ చేసింది. వారిని పర్యవేక్షించే అడిషనల్‌ సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. నోటిఫికేషన్‌ విడుదల నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఓఎంఆర్‌ పత్రాల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లు కూడా జరగకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం. కాగా, ఏదైనా ఉద్యోగ భర్తీ ప్రక్రియలో రాత పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్‌ పత్రాలు, సమాధాన పత్రాలను.. నియామక ప్రక్రియ ముగిసిన మూడేళ్ల తర్వాత ధ్వంసం చేస్తారు. అయితే, తాజా ఘటన నేపథ్యంలో ఈ ఓఎంఆర్‌, సమాధాన పత్రాల ధ్వంసంపై కూడా పర్యవేక్షణ ఉండాలని కమిషన్‌ చైర్మన్‌ బుర్రా వెంకటేశం ఆదేశించారు.

Updated Date - Jul 29 , 2026 | 08:16 AM