‘ఈడు-జోడు’ లెక్క మారింది!
ABN , Publish Date - Aug 11 , 2026 | 06:15 AM
అబ్బాయికి హైదరాబాద్‌లో రూ.20 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. సొంత ఇల్లు. చేతినిండా సంపాదన. సమాజంలో హోదా. మ్యాట్రిమోనీ ప్రొఫైల్‌లో ఇచ్చిన ఈ వివరాలన్నీ బాగుండడంతో...
వధూవరుల్లో తగ్గుతున్న వయసు అంతరం
వయసు తేడా ఎక్కువ ఉంటే పెళ్లికి నో
1 నుంచి 3 ఏళ్ల వరకూ అయితే ఓకే
తెలుగు రాష్ట్రాల యువతలో
దాదాపు 78 శాతం మందిది ఇదే మాట
ఐదేళ్లు, అంతకు మించి తేడా ఉంటే..
నిర్మొహమాటంగా వద్దంటున్న అమ్మాయిలు
ప్రేమ పెళ్లి చేసుకుంటున్నవారిలో 80ు
జంటల మధ్య వయసు తేడా ఏడాదిలోపే
తెలుగు రాష్ట్రాల్లో మారిన వివాహ
సమీకరణాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి)
అబ్బాయికి హైదరాబాద్‌లో రూ.20 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. సొంత ఇల్లు. చేతినిండా సంపాదన. సమాజంలో హోదా. మ్యాట్రిమోనీ ప్రొఫైల్‌లో ఇచ్చిన ఈ వివరాలన్నీ బాగుండడంతో ఓ అమ్మాయి అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొంది. తీరా పెళ్లయ్యాక.. వరుడు తన వయసు తప్పుగా చెప్పాడని ఆమెకు తెలిసింది. ఇద్దరి మధ్య ఏడేళ్ల తేడా ఉందని తేలింది. మోసపోయానని భావించిన వధువు కోర్టు తలుపు తట్టింది. తీవ్ర వివాదం నడుమ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఇటీవల విజయవాడ ఫ్యామిలీ కోర్టులోనూ ఇలాగే.. ఐదేళ్ల వయసు వ్యత్యాసాన్ని దాచిన కేసులో వధువు విడాకులు పొందింది. పెళ్లి విషయంలో మారిన ‘ఈడు-జోడు’ లెక్కకు నిదర్శనాలీ కేసులు. ఒకప్పుడు.. అమ్మాయి, అబ్బాయి మధ్య 5-7 ఏళ్ల తేడా ఉంటే ‘ఈడూ జోడూ బాగుంది’ అనేవారు! అందునా.. అబ్బాయి చక్కగా స్థిరపడి ఉంటే పదేళ్ల తేడాను కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడా లెక్క మారింది. ఐదేళ్లు అంతకు మించి వయసు తేడా ఉన్న సంబంధాలు చేసుకోవడానికి అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు.. ఎవరూ ఇష్టపడట్లేదు! ఆ తేడా గరిష్ఠంగా 1 నుంచి 3 ఏళ్ల దాకా మాత్రమే ఉండాలని భావిస్తున్నారు. అంతేకాదు.. వయసులో అమ్మాయి కన్నా అబ్బాయి పెద్దవాడై ఉండాలనే భావన కూడా క్రమంగా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల తాజా గణాంకాలు చెబుతున్న వాస్తవాలివి. ఆ గణాంకాల ప్రకారం.. పెళ్లిళ్ల నిర్ణయంలో వయసు అంతరం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. మ్యాట్రిమోనీ ప్రొఫైల్ తెరవగానే... కనిపించే మొదటి ప్రశ్న.. ‘ఏజ్ గ్యాప్ ఎంత?’ ఐదేళ్ల తేడా ఉంటే తిరస్కరణే. దీంతో ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్లు, యాప్‌లలో వయసుకు ప్రత్యేక ఫిల్లర్లు పెడుతున్నారు. మ్యాట్రిమోనీ డేటా ప్రకారం... తెలుగు రాష్ట్రాల యువతలో 78 శాతం మంది 1 నుంచి 3 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న ప్రొఫైళ్లను మాత్రమే పరిశీలిస్తున్నారు. 25 ఏళ్ల అమ్మాయికి 31 ఏళ్ల అబ్బాయి సంబంధం వస్తే... ఉద్యోగం, హోదా, ఆస్తి అన్నీ బాగున్నా 65 శాతం మంది వధువులు పాథమిక దశలోనే తిరస్కరిస్తున్నారు. 27ఏళ్ల అమ్మాయికి 28 నుంచి 30 ఏళ్లలోపు అబ్బాయిల సంబంధాలు వస్తేనే ముందడుగు వేస్తున్నారు. అంతేనా.. అమ్మాయి కంటే అబ్బాయి 6 నెలలు లేదా ఒక ఏడాది చిన్నవాడైనా ఓకే అనే వారి సంఖ్య 4 శాతం దాకా ఉండడం విశేషం.
శతాబ్ద కాలపు మార్పు..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్), రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం... 1956-1960 కాలంలో భారతీయ దంపతుల మధ్య సగటు వయసు తేడా 7 సంవత్సరాలు ఉండేది. 2001-2005 నాటికి ఈ అంతరం 5.2 ఏళ్లకు, 2010 నాటికి 4.5 ఏళ్లకు తగ్గింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు, తిరుపతి వంటి అర్బన్ ప్రాంతాలు, చదువుకున్న వర్గాల్లో సగటు వయసు తేడా 1 నుంచి 3 ఏళ్లకు పరిమితమైంది.
క్లాస్‌రూమ్ మైత్రి... ‘సేమ్ ఏజ్ ప్రేమ పెళ్లిళ్లు’...
సమాజంలో పెరుగుతున్న ప్రేమవివాహాలు కూడా ఈ వయసు వ్యత్యాసం తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రేమవివాహాల్లో దాదాపు 85శాతం మంది జంటల మధ్య వయసు తేడా కేవలం కొద్ది నేలలు లేదా ఒక్క ఏడాదే ఉంటోంది. ఎందుకంటే.. కాలేజీల్లో చదువుకునే సమయంలో అయిన పరిచయాలు ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కుతున్న జంటల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకే క్లాస్ లేదా ఒకే బ్యాచ్‌కు చెందినవారు కావడంతో వారి మధ్య వయసు తేడా ఇంచుమించుగా కొన్ని నెలలే ఉంటోంది. కొన్ని సందర్భాల్లో అబ్బాయి కన్నా అమ్మాయిలే కొన్ని నెలలు పెద్దగా ఉంటున్నారు. ఇలా ‘ఒకే తరం.. ఒకే తరహా ఆలోచనలు... ఒకే తరహాడిజిటల్ లైఫ్ స్టైల్’.. ఉన్న వారిని ఎంచుకోవడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం, భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడం సులువవుతోందని నేటి తరం భావిస్తోంది. ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్న మార్పు కాదు.. మారుతున్న సామాజిక చైతన్యానికి అద్దం పడుతున్న స్పష్టమైన పరిణామం.
సమానత్వానికే పెద్దపీట...
నేటి తరం యువత ఆలోచనా సరళి మారింది. సమానత్వానికి పెద్దపీట వేస్తున్నారు. పెళ్లి బంధం లో ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనే భావన కంటే ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే వయసులో పెద్దగా తేడా లేని బంధాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. బంధం నిలబడటానికి వయసొక్కటే ప్రామాణికం కాదు.. పరస్పర గౌరవం, అర్థం చేసుకునే గుణమే ముఖ్యం.
డాక్టర్ జవహర్‌లాల్ నెహ్రూ,
మానసిక వైద్య నిపుణుడు, హైదరాబాద్
ఇవి కూడా చదవండి..
తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..
సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..