సంక్షేమ పండగ!
ABN , Publish Date - Aug 09 , 2026 | 04:15 AM
పంద్రాగస్టున రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండగను సంక్షేమ పండగగా మార్చేలా చర్యలు తీసుకోనుంది.
పంద్రాగస్టు నుంచి మరింత మందికి పథకాలు
మరో 2.25 లక్షల మందికి పింఛన్లు
కొత్తగా 4 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్
ఐదు లక్షల మందికి సిలిండర్ సబ్సిడీలు
అదేరోజు సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం
గిగ్ వర్కర్ల చట్టం అమలుకు శ్రీకారం
గాంధీ సరోవర్, ఫ్యూచర్ సిటీ పైనా దృష్టి
ఇందిరమ్మ టవర్లకు వచ్చే నెల్లో శంకుస్థాపన
జెండా పండగ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దూకుడు పెంచనుంది. పలు పథకాల కింద కొత్తగా లబ్ధిదారులకు అవకాశం కల్పించనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్ల తరువాత తొలిసారి పెద్ద ఎత్తున కొత్త లబ్ధిదారులను పలు పథకాల పరిధిలోకి తేనుంది.
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టున రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండగను సంక్షేమ పండగగా మార్చేలా చర్యలు తీసుకోనుంది. రెండున్నర లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనుంది. 3-4 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించనుంది. ఇంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద కొత్తగా ఐదు లక్షల మందికి గ్యాస్ సిలిండర్ మీద రూ.500 చొప్పున సబ్సిడీ అందించనుంది. ఇంతేకాకుండా రాష్ట్రంలోని కోటీ ఐదు లక్షల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు ఆగస్టు 15 నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 17 నుంచి 30 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగొచ్చాక సెప్టెంబరు మొదటి వారంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు గిగ్ వర్కర్ల చట్టాన్ని ఆగస్టు 15 నుంచే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి కూడా కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. సనత్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (టిమ్స్)ను కూడా ఆగస్టు 15నే ప్రారంభిస్తారు. రెండో విడత సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న చర్చ జోరుగా జరుగుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, హెచ్‌ఐవీ-ఏఆర్‌టీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్, బీడీ ఠేకేదార్లు కలిపి 41 లక్షల మందికి ప్రభుత్వం ప్రతినెలా పెన్షన్ అందిస్తోంది.ఇందుకోసం నెలకు రూ.922 కోట్లు చొప్పున ఏడాదికి రూ.11 వేల కోట్లు ఖర్చవుతోంది. వీరితో పాటు తాజాగా తలసీమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు కూడా పింఛన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు సహా మరో 9 రకాల కేటగిరీల్లోని వారికి ప్రాధాన్యత క్రమంలో పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నుంచి సర్క్యులర్ జారీ కావాల్సి ఉంది. జారీ అయిన వెంటనే దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. 11 కేటగిరీలు కలుపుకుని కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం. ఏడాదికి రూ.500 కోట్ల భారం అదనంగా పడుతుందని అంచనా. మహాలక్ష్మిలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 42.90 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. కొత్తగా జారీ అయ్యే స్మార్ట్ రేషన్‌కార్డులతో మరో ఐదు లక్షల కుటుంబాలకు సిలిండర్ పథకం అందుబాటులోకి వస్తుంది. కొత్తగా అర్హులను ఖరారు చేసే క్రమంలో ఆర్ధిక పరమైన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, సంబంధిత ఫైలు ఆర్ధిక శాఖకు చేరిందని సమాచారం. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సాయం 50 లక్షల కుటుంబాలకు అందుతోంది.
కొత్తగా రేషన్ కార్డులు అందుకుంటున్న వారిలో 3-4 లక్షల కుటుంబాలు ఉచిత విద్యుత్ లబ్ధిదారులుగా మారే అవకాశం ఉంది. గత రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 16.32 లక్షల కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేసింది. దాంతో 61.09 లక్షల మంది ఆహార భధ్రత పథకం పరిధిలోకి వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. దాంతో 3.42 కోట్ల మందికి ఆహార భద్రత లభిస్తుంది. ప్రభుత్వం సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ ల్యామినేటెడ్ స్మార్ కార్డులను అందించనుంది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా నుంచి సీఎం రేవంత్ ఈ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కార్డులు లబ్ధిదారులకు అందజేస్తారు. గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయడానికి అవసరం అయిన మార్గదర్శకాలకు ఆగస్టు 15 లోగా ప్రకటించి, అమల్లోకి తెస్తారు. మరోవైపు కొన్ని అభివృద్ధి పథకాలను కూడా ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. సనత్‌నగర్ టిమ్స్ అందులో ప్రధానమైనది. ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్ కొత్త భవనాల పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి రుణ సేకరణ వ్యవహారాలు పూర్తవ్వడంతో ప్రభుత్వం ఆ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో కీలకమైన గాంధీ సరోవర్ నిర్మాణం పైనా ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తోంది.