Share News

లేని వైద్యులకు నెలనెలా జీతం

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:52 AM

ఆయనోక ఆర్థోపెడిక్‌. నిరుడు కాంట్రాక్టు పద్ధతిలో ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లోని ఓ ఏరియా ఆస్పత్రిలో చేరారు. తర్వాత నెలకే ఉద్యోగం మానేశారు.

లేని వైద్యులకు నెలనెలా జీతం

  • విధులకు గైర్హాజరయ్యే వైద్యులకు ‘సరెండర్‌’.. ఆపై పోస్టింగ్‌.. రికార్డుల్లోనే హాజరు

  • వచ్చే జీతాన్ని పంచుకుంటున్న అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా ఒక జోన్‌ నుంచి మరో జోన్‌కు రీ-డిప్లాయిమెంట్‌

  • లక్షల్లో చేతులు మారుతున్న డబ్బు.. అక్రమాలకు అడ్డాగా వైద్య విధాన పరిషత్‌

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఆయనోక ఆర్థోపెడిక్‌. నిరుడు కాంట్రాక్టు పద్ధతిలో ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లోని ఓ ఏరియా ఆస్పత్రిలో చేరారు. తర్వాత నెలకే ఉద్యోగం మానేశారు. ఆ జిల్లా ఉన్నతాధికారులు సదరు డాక్టర్‌ను ఏడు నెలల క్రితం వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. తిరిగి ఈ ఏడాది తొలినాళ్లల్లో ఎప్పుడో ఉద్యోగం మానేసిన సదరు వైద్యుడికి అదే జిల్లాలోని ఒక సీహెచ్‌సీ వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు. పైగా అదే డాక్టర్‌ పేరుతో జీతం డ్రా చేస్తున్నారు. ఆ సొమ్మును జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు తలా కొంత పంచుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఓ ఆస్పత్రిలోని వైద్యుడు నిరుడు నాలుగు నెలల పాటు విధులకు గైర్హాజరయ్యారు. నిబంధనల ప్రకారం అటువంటి అబ్‌స్కాండెడ్‌ డాక్టర్లను కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తారు. అలాంటి వైద్యులకు వైద్యవిధాన పరిషత్‌ కమిషనరే పోస్టింగ్‌ ఇస్తారు. అయితే డ్యూటీకి డుమ్మా కొట్టిన సదరు వైద్యుడిని విధులకు హాజరవుతున్నట్లు చూపించి.. నాలుగు నెలల వేతనం డ్రా చేశారు. ఆ వేతనంలో జిల్లా అఽధికారుల నుంచి వీవీపీ కార్యాలయపు సిబ్బంది వరకు అందరికీ వాటాలందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్టీ జోన్‌ రెండులోని ఓ వైద్య కళాశాలో పనిజేస్తున్న ఒక డైటిషియన్‌ను ఏకంగా నాలుగు రోజుల క్రితం మల్టీజోన్‌ వన్‌ పరిధిలో ఒక ప్రాంతీయ ఆస్పత్రికి బదిలీ చేశారు. రీడిప్లాయిమెంట్‌ పేరుతో టీవీవీపీ కమిషనర్‌ కార్యాలయం ఆర్డర్‌ జారీ చేసింది. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. ఈ వ్యవహరంలో కూడా లక్షలు చేతులు మారినట్లు వైద్యవర్గాలు ఆరోపిస్తున్నాయి. గత రెండేళ్లుగా తెలంగాణ వైద్యఽ విధాన పరిషత్‌ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల్లో జరిగే అవినీతి బాగోతాలకు హైదరాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయం అఽధికారులు అండగా నిలుస్తున్నార్న అభిప్రాయం వ్యక్తంమవుతోంది. దందాల ద్వారా వచ్చే అవినీతి సొమ్మును అంతా పంచుకుంటున్నారంటూ వీవీపీ సిబ్బంది చెబుతున్నారు. కార్యాలయంలోని ఒకరిద్దరు అధికారులు అంతా తామై వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


సరెండర్‌ను అడ్డం పెట్టుకొని..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2024 ఫిబ్రవరిలో ఒక ఉత్తర్వు తీసుకొచ్చింది. వైద్య ఆరోగ్యశాఖలో అయా విభాగాధిపతులు తమ పరిధిలోని వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి డిప్యుటేషన్లు, వర్క్‌ ఆర్డర్లు ఇవ్వకూడదని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది.. దీంతో డిప్యుటేషన్లు వర్క్‌ ఆర్డర్లకు పుల్‌స్టాప్‌ పడింది. అయితే హెచ్‌వోడీ కార్యాలయపు అధికారులే సరెండర్‌ పేరిట కొత్త దందాకు తెర తీశారు. ఎవరైనా ఒక డాక్టర్‌, పారామెడికల్‌, పాలనా సిబ్బంది అనధికారికంగా ఆరు నెలలకు మించి విధులకు గైర్హాజరయితే వారిని కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేయాలి. టీవీవీపీ కమిషనర్‌ వారికి పనిష్మెంట్‌ కింద మరోచోట పోస్టింగ్‌ ఇస్తారు. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని గత రెండేళ్లుగా వీవీపీ పరిఽధిలో పెద్ద సంఖ్యలో సరెండర్లను ప్రొత్సహించి, పోస్టింగ్‌ ఇచ్చారు. ఒక్కో సరెండర్‌ పోస్టింగ్‌కు రూ. 4-5 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నిరుడు డిసెంబరులో వికారాబాద్‌లో ఉన్న ఒక డాక్టర్‌ను సరెండర్‌ చేసి మేడ్చల్‌ జిల్లాకు పోస్టింగ్‌ ఇచ్చారు. సదరు డాక్టర్‌ దగ్గర లక్షల్లో వసూలు చేసినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో పనిజేసే ఓ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ సరెండర్‌ అయ్యారు. సదరు అధికారికి హుజుర్‌నగర్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉంది. ఒక ఉద్యోగి ఒకచోట నుంచి మరో చోటుకు బదిలీ కావడం సాధ్యంకాని పని. కానీ రెండు రకాల పద్ధతుల్లో మరో చోటుకు వెళ్లొచ్చు. ఒకటి డిప్యూటేషన్‌. రెండోది సరెండర్‌. వీవీపీ పరిఽధిలో డిప్యుటేషన్లను ప్రభుత్వమే ఇస్తోంది. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటోంది. ఇష్టారాజ్య డిప్యుటేషన్లు సాధ్యం కావడం లేదు. దీంతో రెండో పద్ధతిలో వైద్యులు, పారామెడికల్‌, ఇతర పాలనా సిబ్బంది సరెండర్లను ఎంచుకుంటున్నారు. సరెండర్‌ అయిన వారికి తిరిగి పోస్టింగ్‌ ఇచ్చే అధికారం కమిషనర్‌కే ఉంటుంది. దీన్నే ఆయుధంగా మలుచుకొని దందాకు తెరతీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


తనిఖీలు.. నోటీసులు.. వసూళ్లు

గత నెలలో టీవీవీపీ కమిషనర్‌ ఒక జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. డ్యూటీ టైమ్‌లో చాలా మంది వైద్యులు ఆస్పత్రిలో లేరు. దాంతో వారందరికీ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని సంబంధిత జిల్లా డీసీహెచ్‌ఎ్‌సను ఆదేశించారు. సదరు డీసీహెచ్‌ఎ్‌స వారందరికీ ఏకంగా చార్జీమెమోలు జారీ చేశారు. ఏకంగా 20 మందికి పైగా చార్జీమెమోలిచ్చారు. పని చేయని, డ్యూటీ టైమ్‌లో విధుల్లో ఉండని డాక్టర్లపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దానికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ అలా చార్జీ మెమోలు ఇచ్చిన వైద్యులతో జిల్లా, కమిషనర్‌ కార్యాలయపు అధికారులు బేరసారాలు మొదలుపెట్టారు. చార్జీ మెమోలు డ్రాప్‌ కావాలంటే అంతా కలిపి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌చేసినట్లు బాధిత డాక్టర్లు ఆరోపిస్తున్నారు. పదోన్నతులు, పోస్టింగ్‌లు.. ఇలా ప్రతి దాంట్లోనూ కమిషనర్‌ కార్యాలయపు సిబ్బంది, ఉన్నతాఽధికారులు లంచాల కోసం పీడిస్తున్నారని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు. గత రెండేళ్లలో వీవీవీ పరిఽధిలో అయిన మొత్తం సరెండర్లను ఇచ్చిన పోస్టింగులపై విచారణ జరిపించాలని వైద్య వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కమిషనర్‌ కార్యాలయంలో అవినీతిపై సీఎంవో, వైద్య మంత్రి, ఏసీబీకి ఫిర్యాదులందినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న పెద్దతలకాయలు ఉన్నాయని టీవీవీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

Updated Date - Mar 18 , 2026 | 05:52 AM