Share News

గ్రామాల్లో 93శాతం.. పట్టణాల్లో 62శాతం!

ABN , Publish Date - Jul 30 , 2026 | 08:32 AM

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ చివరి దశకు చేరుకుంటున్న వేళ.. ఓటర్ల వివరాల డిజిటైజేషన్‌ ప్రక్రియలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య భారీ వ్యత్యాసం..

గ్రామాల్లో 93శాతం.. పట్టణాల్లో 62శాతం!

ఓటర్ల వివరాల డిజిటైజేషన్‌ పరిస్థితి ఇదీ

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ చివరి దశకు చేరుకుంటున్న వేళ.. ఓటర్ల వివరాల డిజిటైజేషన్‌ ప్రక్రియలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య భారీ వ్యత్యాసం కనబడుతోంది. ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లకు(వంద శాతం) ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు 2,58,03,302 (76.28 శాతం) ఓటర్ల వివరాల డిజిటైజేషన్‌ పూర్తి చేశారు. గ్రామీణ జిల్లాల్లో దాదాపుగా 93 శాతం వరకు డిజిటైజేషన్‌ కాగా, పట్టణాల్లో 62శాతం మాత్రమే చేయగలిగారు. హైదరాబాద్‌ జిల్లాలో 54.79శాతం, మేడ్చల్‌ జిల్లాలో 59.57శాతం, రంగారెడ్డి జిల్లాలో 62.38శాతం మేర డిజిటైజేషన్‌ జరిగింది. ఈ మూడు జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎన్యుమరేషన్‌ శాతం తక్కువగా ఉండటంతో.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు.


ఓటర్ల వివరాల నమోదులో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పల్లె ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరీ...ఎన్యుమరేషన్‌ ఫారాల్లో వివరాలు నమోదు చేసి సమర్పిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటైజేషన్‌ వేగంగా సాగుతోంది. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి వంటి పట్టణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఓటరు జాబితాలో ఉన్న చిరునామాల్లో చాలా మంది నివసించకపోవడం, వలసలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ప్రవేశ పరిమితులు వంటి కారణాలతో బీఎల్‌వోలకు ఓటర్లను కలవడం కష్టంగా మారుతోంది. మరోవైపు.. తమ ఇళ్లవైపు రాని బీఎల్‌వోలను వెతికి పట్టుకునేందుకు జనం అవస్థలు పడాల్సి వస్తోంది.

Updated Date - Jul 30 , 2026 | 08:43 AM