‘సర్’లో ఎవరిని తొలగిస్తారు?
ABN , Publish Date - May 17 , 2026 | 05:44 AM
దేశంలో పారదర్శకంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి.
కొత్త ఓటర్లను చేరుస్తారా?.. రెండు చోట్ల ఓటుంటే ఎలా?
జూన్‌లో రాష్ట్రంలో చేపట్టనున్న ‘సర్’పై సందేహాలు..!
వాటికి సమాధానాలతో ఆంధ్రజ్యోతి కథనం
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో పారదర్శకంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. ఎవరి ఓట్లు తొలగిస్తారు? కొత్త ఓటర్లను చేరుస్తారా? పేర్లు తొలగించే ముందు చెబుతారా? ఓటు తొలగిస్తే ఏం చేయాలి.. ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. సర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ప్రజల సందేహాలు, ప్రశ్నలపై ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించిన సమాధానాలతో ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
‘సర్’ ప్రక్రియ ఎలా చేస్తారు?
సర్ ప్రక్రియ సాధారణ ఓటరు జాబితా సవరణ కంటే విస్తృతమైన ప్రక్రియ. ఇందులో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)లు తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి రెండు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. వాటిని ఎలా పూరించాలో వివరిస్తారు. తర్వాత మరోసారి ఆ ఇళ్లకు వెళ్లి.. వివరాలు నింపిన ఫారాల్లో ఒకదాన్ని తీసుకుని, మరోదానిపై రశీదు ఇస్తారు. ఆ ఫారంను ఓటర్లు తమ వద్ద ఉంచుకోవాలి. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారమ్‌ను ఎన్నికల సంఘం వెబ్‌సైట్Http://voters.eci.gov.inలో ఆన్‌లైన్‌లోనూ పూరించి సమర్పించవచ్చు. ఎన్యూమరేషన్ ఫారం అందకుంటే ఇదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫారం పూరించిన అనంతరం సవరణకు అవకాశం ఉండదు.
ఎస్‌ఐఆర్ ఏ ప్రాతిపదికన?
దేశంలో 2002-2004 మధ్య ఎస్‌ఐఆర్ నిర్వహించారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత చేపట్టారు. నాటి వివరాలతో ప్రస్తుత ఓటర్ల వివరాలను సరిపోల్చనున్నారు. దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ను సిద్ధం చేశారు. 2002 నాటి జాబితాలో పేరు లేనివారు తమ తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో పేర్కొనాల్సి ఉంటుంది. ఓట ర్ జాబితాలో కుటుంబ పెద్దల వివరాలు తెలుసుకునేందుకు బీఎల్‌ఓలు సహకరిస్తారు. ఎన్యూమరేషన్ ఫారంలో ఆధార్ వివరాలివ్వాలా, వద్దా అన్నది ఓటర్ ఇష్టం. ఎన్యూమరేషన్ ఫారంలో ముద్రించిన ఫొటో తప్పుగా/పాతది ఉంటే దాని స్థానంలో తాజాగా తీసుకున్న ఫొటో అంటించాలి.
ఓటరు జాబితా నుంచి ఎవరిని తొలగిస్తారు?
ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారు. ఇతర ప్రాంతానికి శాశ్వతంగా మారితే, ఒకే వ్యక్తికి 2, 3 చోట్ల ఓటు ఉంటే తొలగిస్తారు. భారత పౌరసత్వం లేనివారు, భారత పౌరుడు కానివారి ఓటు తొలగిస్తారు. తప్పుడు డాక్యుమెంట్లతో, తప్పుడు వివరాలతో ఓటరుగా నమోదైనవారిని గుర్తించి తొలగిస్తారు. 18 ఏళ్లు నిండకపోయినా ఓటరుగా నమోదు చేసుకున్నవారు, తీవ్రమైన నేరాల్లో కోర్టు తీర్పులతో ఎన్నికల హ క్కులను కోల్పోయినవారు,చట్టపర అనర్హత కలిగినవారి ఓటు హక్కును తొలగిస్తారు.
పేర్లను తొలగించే ముందు సమాచారం ఇస్తారా..?
ఎవరినైనా అనర్హులుగా గుర్తిస్తే.. వారి పేర్లను జాబితానుంచి తొలగించే ముందు బీఎల్వోలు నోటీసు ఇస్తారు. వివరణకు, విచారణకు అవకాశం కల్పిస్తారు. సదరు వ్యక్తి తగిన ఆధారాలు చూపేందుకు వీలు కల్పిస్తారు. దీనికి ఎన్నికల సంఘం నెల రోజుల గడువు ఇస్తుంది. తెలంగాణకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారానికి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు గడువు ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన, విచారణ తర్వాత పేరు తొలగించడం, కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటారు. ఇక రెండు చోట్ల ఓటున్నవారు.. వారి అసలైన నివాస ధ్రువీకరణను సమర్పించిన చోట ఓటు ఉంచి, మరోచోట తొలగిస్తారు. రెండుచోట్లా నివాసానికి సంబంధించి రుజువు పత్రాలుంటే.. పౌరుల ఇష్టానికి అనుగుణంగా ఏదో ఒక చోట పేరు కొనసాగిస్తారు. కొత్త నివాసం ఉన్న ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకోవాలి. చిరునామా మార్పుకోసం ఫామ్-8ను పూర్తిచేసి బీఎల్‌ఓల కు సమర్పించాలి. కొత్త చిరునామాకు తగిన ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది.
అర్హత ఉన్నా పేరు తొలగిేస్త ఎలా..?
సాంకేతిక లోపం, మరేదైనా కారణాలతో పేరును జాబితా నుంచి తొలగిస్తే.. స్థానిక ఎన్నికల అధికారిని సంప్రదించి, అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఒకవేళ వారి నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే జిల్లా కలెక్టర్‌కు అప్పీలు చేసు కోవచ్చు. జాబితా నుంచి తొలగించినవారి (మరణించిన, శాశ్వతంగా వలసవెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు) వివరాలను ప్రత్యేకంగా ఈసీ వెబ్‌సైట్‌లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆ ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలను ఈఆర్‌ఓ స్థాయి అధికారులు పరిశీలిస్తారు. విచారణ అనంతరం తుది ఓటరు జాబితాను అక్టోబరు 1న వెల్లడిస్తారు.