Share News

బోగస్‌ ఓట్లకు చెక్‌!

ABN , Publish Date - May 17 , 2026 | 05:49 AM

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి నకిలీలను తొలగించి, తప్పులను సవరించడం ద్వారా జాబితాను ప్రక్షాళన చేసి అత్యంత పారదర్శకంగా .....

బోగస్‌ ఓట్లకు చెక్‌!

  • రాష్ట్రంలో జూన్‌ 25 నుంచి సర్‌ ప్రక్రియ

  • అక్టోబరు 1న తుది ఓటర్ల జాబితా

  • ఇంటింటికీ బీఎల్‌వోలు.. ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు

  • నిరూపణకు 12 రకాల గుర్తింపు పత్రాలు

  • సందేహాలకు 1950 టోల్‌ఫ్రీ నంబర్‌

  • 3.39 కోట్ల ఓటర్లు.. మహిళలే ఎక్కువ

  • రాష్ట్ర సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి నకిలీలను తొలగించి, తప్పులను సవరించడం ద్వారా జాబితాను ప్రక్షాళన చేసి అత్యంత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌- సర్‌) కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్‌ ప్రక్రియ కింద బోగస్‌ ఓట్లకు, ఒక వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు ఉండటం లాంటి వాటికి చెక్‌ పెడతామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ‘సర్‌’ లక్ష్యమని ఆయ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 25 నుంచి క్షేత్రస్థాయిలో ఈ మహాక్రతువు ప్రారంభం కానుందని వెల్లడించారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాల తర్వాత ఈ తరహా సమగ్ర ఇంటింటి సర్వే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్‌ ప్రక్రియ తాలూకు సమగ్ర మార్గదర్శకాలు, నిబంధనలను ఆయన వివరించారు. సర్‌ ప్రక్రియ కింద బూత్‌లెవల్‌ అధికారులు (బీఎల్‌వో) ప్రతి ఓటరు ఇంటికి స్వయంగా వెళ్లి పరిశీలన చేస్తారు. పాక్షికంగా పూరించి ఉన్న ఎన్యుమరేషన్‌ ఫారాలను ఓటర్లకు అందజేసి, వారి సమక్షంలోనే వివరాలను సరిచూసి, సంతకాలు తీసుకుంటారు. ఒకవేళ బీఎల్‌వో వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే.. సదరు ఓటరు లభ్యతను నిర్ధారించుకోవడానికి అధికారులు విధిగా కనీసం 3 సార్లు ఆ ఇంటిని సందర్శించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు ప్రక్రియను మరింత పక్కాగా చేయడానికి 2002 నాటి మునుపటి ‘ఎస్‌ఐఆర్‌ ఆల్‌ ఇండియా డేటాబేస్‌’ వివరాలను బీఎల్‌వోలు పరిశీలిస్తారు. కొత్త ఓటరుగా చేరాలనుకునే వారి నుంచి బీఎల్‌వోలు డిక్లరేషన్‌ ఫారంతో పాటు ఫారం-6 సేకరిస్తారు. ఓటర్లు తమ ఎన్యుమరేషన్‌ ఫారాన్ని స్వయంగా ఈసీఐ అధికారిక వెబ్‌సైట్‌ Http://voters.eci.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పూరించి సమర్పించవచ్చు. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950 అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్‌, ఈసీఐఎన్‌ఈటి యాప్‌ ద్వారా ‘బుక్‌ ఎ కాల్‌ విత్‌ బీఎల్‌వో‘ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రాథమిక ఎన్యుమరేషన్‌ ఫారం తప్ప మరే ఇతర అదనపు పత్రాన్ని ఓటర్ల నుంచి సేకరించరు.


ఎన్యుమరేషన్‌ ఫారాలు అందిన ఓటర్ల పేర్లన్నింటినీ కలిపి డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాగా ప్రచురిస్తారు. ఫారాలు తిరిగివ్వని లేదా అందుబాటులో లేని ఓటర్ల జాబితాను బూత్‌ల వారీగా ప్రదర్శిస్తారు. డ్రాఫ్ట్‌ జాబితా ప్రచురణ అనంతరం గత సవరణ జాబితాతో లింక్‌ అవ్వని లేదా వివరాల్లో తప్పులు ఉన్న ఓటర్లకు ఈఆర్‌వో నోటీసులు జారీచేస్తారు. నోటీసులు జారీ చేసిన వ్యక్తుల జాబితాను కూడా బహిరంగపరుస్తామని సుదర్శన్‌రెడ్డి వివరించారు.

సమర్పించాల్సిన పత్రాలు విభాగాలవారీగా

నోటీసు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ లేదా పుట్టినస్థలాన్ని నిరూపించేందుకు, వారి వయసు, జన్మించిన సంవత్సరం ఆధారంగా మూడు విబాగాలుగా విభజించారని, ఆ మేరకు వారు 12 రకాల పత్రా ల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని సీఈవో తెలిపారు. 1.7.1987 కంటే ముందు దేశంలో పుట్టినవారు తన పుట్టిన తేదీ/లేదా పుట్టిన స్థలాన్ని ధ్రువీకరించే ఏదైనా ఒక పత్రాన్నిస్తే సరిపోతుంది. అదే 1.7.1987 నుంచి 2.12.2004 మధ్య జన్మించిన ఓటరు తన పుట్టిన తేదీ/పుట్టిన స్థలం ధ్రువీకరణ పత్రంతో పాటు.. తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/స్థల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. 2.12.2004 తర్వాత జన్మించినవారు తన పుట్టిన తేదీ/స్థల ధ్రువీకరణ పత్రం, తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/స్థల ధ్రువీకరణపత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలి. ఇక రాష్ట్రంలో ఈ సవరణ ప్రక్రియ షెడ్యూల్‌ ప్రకారం పారదర్శకంగా జరుగుతుందని సీఈవో ప్రకటించారు. 25/06/2026 నుంచి 24/07/2026 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్‌ చేస్తారు. 31/07/2026న డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా ప్రచురణ, 31/07/2026 నుంచి 30/08/2026 వరకు అభ్యంతరాలు క్లెయిమ్‌ల దాఖలు చేయడానికి గడువు ఉంటుంది. 31/07/2026 నుంచి 28/09/2026 వరకు నోటీసుల దశ, విచారణ, క్లెయిమ్‌ల పరిష్కారం, 01/10/2026న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.

రాష్ట్ర ఓటర్లు, ఎన్నికల యంత్రాంగం గణాంకాలు

సీఈవో కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు (వీటిలో జనరల్‌-88, ఎస్సీ-19, ఎస్టీ-12 స్థానాలు) ఉన్నాయి. పోలింగ్‌కేంద్రాల లొకేషన్లు 19,942 (పట్టణ ప్రాంతాల్లో 6,001, గ్రామీణ ప్రాంతాల్లో 13,941) ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 35,985 (పట్టణ-14,750, గ్రామీణ-21,157) పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇక జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవో) 33 మంది, ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్‌వో) 119, సహాయ ఓటర్ల నమోదు అధికారులు 867, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు 3,596, బూత్‌ లెవల్‌ అధికారులు 35,985 మంది, 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674 (వీరిలో పురుషులు 1,76,11,633, స్ర్తీలు 1,73,92,041మంది).


ప్రస్తుత రాష్ట్ర ఓటర్ల బ్రేకప్‌

రాష్ట్రంలో 3,39,24,664 మంది ఓటర్లు ఉండగా.. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. పురుష ఓటర్లు 1,68,18,902 మంది కాగా.. 1,71,02,883 మంది మహిళా ఓటర్లున్నారు. అయితే వీరిలో థర్డ్‌ జండర్‌లు 2,879 మంది, దివ్యాంగ ఓటర్లు 5,22,946, ఓవర్సీస్‌ (ఎన్నారై) ఓటర్లు 3,573, యువ ఓటర్లు (18-19 ఏళ్లు) 8,18,605 మంది, సీనియర్‌ సిటిజన్లు (85ఏళ్లపైబడినవాళ్లు) 2,09,086 మంది ఉండగా.. సర్వీస్‌ ఓటర్లు 15,900 మంది ఓటర్లున్నట్లు సీఈఓ సుదర్శన్‌రెడ్డి వివరించారు.

ప్రీ- సర్‌ ఓటరు మ్యాపింగ్‌ వివరాలు

రాష్ట్రంలోని మొత్తం 3,39,24,664 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 2,18,39,741 మంది ఓటర్ల మ్యాపింగ్‌ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతానికి ఓటరు మ్యాపింగ్‌ శాతం 64.38 శాతం నమోదైంది. మిగిలిన 35.62 శాతం మ్యాపింగ్‌ను ఈ సర్‌ ద్వారా వందశాతం పూర్తి చేయనున్నట్లు సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.

ఆ 12 గుర్తింపు పత్రాలు ఇవే

  • రెగ్యులర్‌ ఉద్యోగి/పెన్షనర్‌కు సెంట్రల్‌/స్టేట్‌ గవర్నమెంట్‌ లేదా పీఎస్‌యూ జారీ చేసిన గుర్తింపు కార్డు/పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌(పీపీవో).

  • 1.7.1987 కంటే ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్టాపీసు/ఎల్‌ఐసీ/పీఎస్‌యూ ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా సర్టిఫికెట్‌.

  • మునిసిల్‌ కార్పొరేషన్‌ లేదా సమర్థ అధికార యంత్రాంగం జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌. ఫ భారత ప్రభుత్వ పాస్‌పోర్ట్‌. ఫ ఫారెస్ట్‌ రైట్‌ సర్టిఫికెట్‌.

  • గుర్తింపు పొందిన బోర్డులు/యూనివర్సిటీలు జారీ చేసి మెట్రిక్యులేషన్‌/ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్‌.

  • రాష్ట్ర అధికార యంత్రాంగం జారీ చేసిన పర్మినెంట్‌ రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ లేదా స్థానికత ధ్రువీకరణ పత్రం.

  • సమర్థ అధికారి జారీ చేసిన ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఏదైనా అధికారిక కుల ధ్రువీకరణ పత్రం.

  • నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ వివరాలు (అందుబాటులో ఉన్నచోట).

  • రాష్ట్ర/స్థానిక సంస్థలు అధికారికంగా రూపొందించిన ఫ్యామిలీ రిజిస్టర్‌.

  • ప్రభుత్వం ఇచ్చిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం.

  • ఆధార్‌కార్డ్‌- దీనికి సంబంధించి కమిషన్‌ జారీ చేసిన లేటెస్ట్‌ గైడ్‌లైన్స్‌ నిబంధనలు వర్తిస్తాయి. ఓటర్లు.. సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబరు 1950కి ఫోన్‌ చేయొచ్చు.

ఇంట్లో అందరి తరఫున ఒకరు పూరించవచ్చు

బీఎల్‌వో వచ్చినప్పుడు ఇంట్లో కొందరు ఓటర్లు లేకపోతే వారి తరఫున కుటుంబసభ్యులు ఎవరైనా ఎన్యుమరేషన్‌ ఫారాన్ని పూరించవచ్చునని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్టణ్‌ పేర్కొన్నారు. ఎన్యుమరేషన్‌ ఫారంలో పూరించిన ఓటర్ల పేర్లే జాబితాలో వస్తాయని స్పష్టం చేశారు. జూన్‌ 25న సర్‌ ప్రక్రియ మొదలవుతుందని, అక్టోబరు 1న తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవర్గాల ఆర్‌వోలతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రీ ఎస్‌ఐఆర్‌ (సర్‌) సర్వే మొదలైంది. కాగా ఎన్యుమరేషన్‌ ఫారంలో ఆధార్‌ నంబరు ఇవ్వాలా? వద్దా? అనేది ఓటరు ఐచ్ఛికం అని ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌లో మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Updated Date - May 17 , 2026 | 05:49 AM