Share News

ఓఆర్‌ఆర్‌ లోపల కనిష్ఠంగా ఎకరం 15 లక్షలు

ABN , Publish Date - May 17 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, క్రయవిక్రయాల ఆధారంగా భూముల విలువను సవరించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు....

ఓఆర్‌ఆర్‌ లోపల కనిష్ఠంగా ఎకరం 15 లక్షలు

  • అభివృద్ధి ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువ సవరణ.. నియోపోలీస్‌ వద్ద మార్కెట్‌ విలువ 160 కోట్లు

  • రిజిస్ట్రేషన్‌ విలువ మాత్రం ఎకరం రూ.2.10 కోట్లే

  • ఇలాంటి చోట్ల వంద శాతం విలువ పెంపు ఉంటుంది

  • కొన్ని చోట్ల భూముల విలువ తగ్గొచ్చు

  • రెండోవిడత ఇందిరమ్మఇళ్లకు నిబంధనలు సడలిస్తాం

  • విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, క్రయవిక్రయాల ఆధారంగా భూముల విలువను సవరించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల ఎకరానికి రిజిస్ట్రేషన్‌ కార్డు విలువ కనిష్టంగా రూ.15 లక్షలు ఉంటుందని చెప్పారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. నియోపోలీస్‌ ప్రాంతంలో బహిరంగ వేలంలో ఎకరం రూ.160 కోట్ల వరకు పలుకుతుండగా.. రిజిస్ర్టేషన్‌ కార్డు విలువ రూ.2.10 కోట్లు మాత్రమే ఉందని చెప్పారు. ఇలాంటి చోట్ల శాస్ర్తీయంగా భూముల విలువ వందశాతం పెంపు ఉంటుందని తెలిపారు. కొన్ని చోట్ల పెంపు.. కొన్ని చోట్ల తగ్గింపు ఉంటుందని వెల్లడించారు. సర్కిళ్లు, జోన్ల అభివృద్ధి ఆధారంగా శాస్ర్తీయంగా భూముల విలువ నిర్ణయిస్తామని తెలిపారు. వంద శాతం సీలింగ్‌ నిర్ణయించినందు.. ఆయా ప్రాంతాల్లో గరిష్ఠంగా ఎకరానికి రూ.4.20 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. 2022లో మూడునాలుగు నెలల వ్యవధిలోనే రెండుసార్లు భూముల విలువ పెంచారని.. అప్పుడు పర్సంటేజీ ఆధారంగా పెంచడం వల్ల కొన్నిప్రాంతాల్లో హెచ్చుతగ్గులు అశాస్ర్తీయంగా ఉన్నాయని అన్నారు. వాటిని ఇప్పుడు సరిదిద్దుతామని తెలిపారు. కనిష్ఠంగా 5 శాతం నుంచి గరిష్ఠంగా ఆయా ప్రాంతాల లావాదేవీల ఆధారంగా విలువ పెంపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణియన్‌ సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని భూముల విలువను నిర్ణయిస్తామని తెలిపారు. నగరాల్లో ఉండే పాత భవనాల రిజిస్ర్టేషన్ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనే అంశంపై ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. భూముల విలువ పెంపుపై తుది నిర్ణయం తీసుకున్న తరువాత ప్రాంతాలవారీగా ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది.. పెంచడానికి, తగ్గించడానికి గల కారణాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.


అటవీ, రెవెన్యూ హద్దులను తేలుస్తాం

ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు అనేక జిల్లాలో అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలున్నాయని.. రైతులు సాగు చేసుకునే సమయంలో అటవీ అధికారులు వెళ్లి ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నందున.. సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూముల సర్వే కోసం ఇప్పటికే 400 రోవర్లు కొనుగోలు చేశామని, జూన్‌లో మరో 420 రోవర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. డీఎఫ్‌వో, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ల నేతృత్వంలో అటవీ భూముల హద్దులపై సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు, రెవెన్యూ శాఖ మధ్య ఉన్న కేసులపైనా దృష్టిసారించినట్లు వెల్లడించారు. పాల్వంచలో సుమారు 1,000 ఎకరాల్లో ఇదే సమస్య ఉందని తెలిపారు. ఆ భూముల్లో 60 శాతం ఇళ్లు ఉన్నాయని చెప్పారు. సాదాబైనామాపై వచ్చిన ప్రతి దరఖాస్తుకు నోటీసులు ఇచ్చారని.. దీనిపై సీసీఎల్‌ఏ త్వరలో మార్గదర్శకాలు ఇస్తారని వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిబంధనల సడలింపు

ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను జూన్‌ 2న ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. రెండో విడత కింద ఇళ్ల మంజూరు నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్టు తెలిపారు. గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొంది ఉన్నా, ఇప్పటికే ఇళ్లను నిర్మించుకునేందుకు పునాదులు తీసి ఉన్నా, గోడలు, స్లాబ్‌, ఇల్లు పూర్తయ్యే దశలో ఉన్నవారితో పాటు పెంకులు, నాపరాళ్లు, రేకుల ఇళ్లు ఉన్నవారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై)కు అనుసంధానించినా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు రూ.72 వేల సాయం ఇంకా అందలేదని తెలిపారు. కేంద్రం నిధులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే.. ఆ సాయాన్ని కూడా భరిస్తుందని స్పష్టంచేశారు. కేంద్ర నిధుల కోసమే ఇళ్ల నిర్మాణం పూర్తయినవారికి ఇచ్చే రాష్ట్ర వాటాను నిలిపివేసినట్లు తెలిపారు.

Updated Date - May 17 , 2026 | 05:23 AM