19 నుంచి భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:51 AM
రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది
నాలుగు జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ
నేడు, రేపూ రాష్ట్రవ్యాప్తంగా జల్లులు
భీమదేవరపల్లిలో అత్యధికంగా
9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
సెప్టెంబరులో 28శాతం లోటు వర్షపాతం
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే 20, 21న కూడా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా బుధ, గురువారాల్లో తెలంగాణ అంతటా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 9.2, జనగాం జిల్లా నర్మెట్టలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఈనెల 1 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఈ పదిహేను రోజుల్లో సాధారణ సగటు వర్షపాతం 86మిల్లీమీటర్లు. అయితే ఈ నెలలో ఇప్పటికే 28శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. గతేడాది సెప్టెంబరు మొదటి పదిహేను రోజుల్లో ఏకంగా 117 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సగటు సాధారణ వర్షపాతం 659 మిల్లీమీటర్లకు గాను 535మిల్లీమీటర్లే కురిసింది. ఈ సీజన్‌లో 19శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.