Share News

రామకృష్ణారావుకు కీలక పదవి!

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:19 AM

జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ...

రామకృష్ణారావుకు కీలక పదవి!

  • తెలంగాణ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ ఎండీగా నియమించే యోచనలో ప్రభుత్వం

  • ఈడీ సహా ఐదుగురు డైరెక్టర్ల నియామకం?

  • ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టే

  • విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం

  • 30న పదవీ విరమణ చేయనున్న సీఎస్‌

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ (ఇన్వెస్ట్‌ తెలంగాణ)ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ ఏజెన్సీకి ముఖ్య అధికారిగా ప్రస్తుత సీఎస్‌ రామకృష్ణారావును నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 30న రామకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన్ను ఇన్వెస్ట్‌ తెలంగాణ విభాగానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఎండీతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ), ఐటీ, లాజిస్టిక్స్‌, ఫార్మా, ఎలకా్ట్రనిక్స్‌ తదితర విభాగాల వారీగా మరో ఐదుగురు సెక్టోరియల్‌ డైరెక్టర్లను నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఇన్వెస్ట్‌ సెల్‌’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, పెట్టుబడిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ‘ఎస్కార్ట్‌ ఆఫీసర్‌’ విధానం తీసుకురావాలని గత నెల 20న నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే కొత్త ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌కు చర్యలు తీసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆయా శాఖలు, విభాగాలు మాత్రమే పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయి. ఇక నుంచి ఆ బాధ్యతలన్నింటినీ ఈ ఏజెన్సీనే పర్యవేక్షించనుంది. పెట్టుబడిదారులకు ఒకే చోట అన్ని అనుమతులు ఇప్పించడం, మార్గదర్శకత్వం, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం వంటి అంశాలపై ఏజెన్సీ దృష్టి సారించనుంది. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేందుకు తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇటీవల టెస్లా కంపెనీ ఏర్పాటు విషయంలోనూ మహరాష్ట్ర, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటీపడ్డాయి. ఇలాంటి వాతావరణంలో కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావాలంటే ప్రత్యేక ఏజెన్సీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆయా కంపెనీలు త్వరగా పెట్టుబడులు పెట్టే ఆస్కారం ఉంటుందని అంచనా వేస్తోంది. భారత్‌ ఫ్యూచర్‌సిటీలో డేటా సెంటర్లు, గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్ల ఏర్పాటుకు ఇటీవల కొన్ని కంపెనీలు శంకుస్థాపనలు చేసిన నేపథ్యంలో ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్‌, ఎలకా్ట్రనిక్స్‌తోపాటు ఇతర విభాగాలకు చెందిన కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చేలా ‘ఇన్వెస్ట్‌ సెల్‌’ పని చేయనుంది. కాగా, ఆర్థిక వ్యవహారాల్లో నిష్ణాతుడిగా పేరున్న రామకృష్ణారావుకు ఆర్థిక సలహాదారుగా ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Updated Date - Jun 25 , 2026 | 04:19 AM