కలిసిపోదాం.. కలియతిరుగుదాం
ABN , Publish Date - Aug 11 , 2026 | 06:27 AM
హోటల్, రిసార్టులో ఉండి ప్రకృతి అందాలను చూడటం కాకుండా మన ఇంట్లో ఉన్నట్లే ఉండి చూసే అవకాశాన్ని ఈ హోం స్టేలు కల్పిస్తాయి. అక్కడ ఉండడం ద్వారా.. స్థానికుల జీవన విధానం, చరిత్ర, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు ఇలా అన్ని విషయాల్ని సొంత ఊర్లో, సొంత ఇంట్లో, మన వాళ్ల మధ్యన ఉండి తెలుసుకున్నట్లే ఉంటుంది.
రాష్ట్రంలో త్వరలో అమల్లోకి రానున్న ‘హోమ్ స్టే’ విధానం
స్థానిక సంప్రదాయాలు, జీవనవిధానం, ఆహారపుటలవాట్లు,
సంస్కృతి గురించి పర్యాటకులు నేరుగా తెలుసుకునే వీలు
ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అందుబాటులోకి ఈ పద్ధతి
ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకుంటే నెలలో అనుమతులు
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): ఉదయం ఆదిలాబాద్ అడవుల్లో సఫారీ రైడ్ పూర్తి చేసుకుని పొద్దుపోయాక పొలం గట్టుపై ఉన్న మంచెపై సేద తీరితే ఆ మజానే వేరు. అంతేనా..! రాత్రికి సజ్జ, జొన్నరొట్టె... రోటిపచ్చడి... నాటు కోడి పులుసు తిని... చల్లగాలికి పెంకుటింట్లో మంచంపై పడుకుంటే..!!! ఆ ఊహే ఎంత అందంగా... ఆనందంగా ఉందో కదు. ఈ అనుభూతి పొందాలంటే ఆదిలాబాద్ మారుమూల గ్రామాల్లో మనకు అమ్మమ్మ, నానమ్మల ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇలాంటి అపురూపమైన ‘మన ఊరు, మన ఇల్లు’ అనే అనుభూతి కల్పించేందుకు ‘హోం స్టే’లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో ఉండేవారిలో చాలామంది.. వారాంతం వచ్చిందంటే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వికారాబాద్ అడవుల బాట పడుతుంటారు.
అలా వెళ్లేవారు హోటల్, రిసార్టులో ఉండి ప్రకృతి అందాలను చూడటం కాకుండా మన ఇంట్లో ఉన్నట్లే ఉండి చూసే అవకాశాన్ని ఈ హోం స్టేలు కల్పిస్తాయి. అక్కడ ఉండడం ద్వారా.. స్థానికుల జీవన విధానం, చరిత్ర, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు ఇలా అన్ని విషయాల్ని సొంత ఊర్లో, సొంత ఇంట్లో, మన వాళ్ల మధ్యన ఉండి తెలుసుకున్నట్లే ఉంటుంది. గోవా, కేరళ, ఏపీ, హిమాచల్‌ప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా ఉన్న ఈ విధానం త్వరలో తెలంగాణలోనూ అందుబాటులోకి రానుంది. ఇందుకు అవసరమైన కసరత్తును రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ పద్ధతిలో, తక్కువ ధరలో అన్ని వసతులూ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అనుకూల ప్రాంతాలివే..
తెలంగాణలో హోం స్టేలు ప్రారంభించేందుకు అనుకూలమైన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, మెడారం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో కుంటాల, బొగత జలపాతాలు, దట్టమైన అడవులు, గిరిజన సంస్కృతి, ఎకో టూరిజం.. నల్లగొండలో కృష్ణానది పరివాహక ప్రాంతాలు, బౌద్ధ క్షేత్రాలు.. పోచంపల్లి ఇక్కత్, ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట, ఆలేరు జైన ఆలయం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రకృతి, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు హోం స్టేల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. మాల్దీవులను తలపించేలా ఉన్న సోమశిల, వైజాగ్ బీచ్‌కు తీసిపోని నల్లగొండ వైజాగ్ కాలనీలో చేప పులుసు రుచి ఆస్వాదించేందుకు పర్యాటకులకు హోం స్టేలు వేదిక కానున్నాయి.
హోం స్టేలతో ప్రయోజనాలు...
హోం స్టేలతో పర్యాటకులకు తెలంగాణ సంప్రదాయ వంటకాలు, పిండి వంటలు, గ్రామీణ జీవన విధానం వంటివాటిని అనుభవంలోకి తెచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్థానిక ప్రజలకు ఆదాయమూ సమకూరుతుంది. నిరుపయోగంగా ఉన్న పాత ఇళ్లు, ఇళ్లల్లోని ఖాళీ గదులు, పొలాలు, తోటల్లో నిర్మించిన ఫామ్ హౌస్‌లను ఆదాయవనరుగా మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది. హోటళ్లు, రిసార్టుల మాదిరి పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా అందుబాటులో ఉన్న నిర్మాణాలు, సదుపాయాలతో అదనపు ఆదాయం పొందవచ్చు.
దరఖాస్తు చేసుకుంటే..
హోం స్టే సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న 30 పనిదినాల్లో అనుమతులు మంజూరు చేస్తారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పొందితే దాని కాలపరిమితి రెండేళ్ల పాటు ఉంటుంది. యజమానులు స్వచ్ఛందంగా పర్యాటక వసతి కోసం కేటాయించే నివాస గృహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సొంత ఇళ్లు, వారసత్వ, సంప్రదాయ గృహాలు, గిరిజన గృహాలు, ఫ్లాట్లు కలిగిన వారు హోం స్టే సదుపాయం కల్పించేందుకు దరఖాస్తు చేసుకోవాలి. పర్యాటక శాఖ నేతృత్వంలోని వర్గీకరణ కమిటీ హోం స్టేలను పరిశీలించి.. ఉండే సదుపాయాలను బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ కేటగిరీలుగా వర్గీకరించి, ధరల్ని నిర్ణయిస్తుంది. పర్యాటకులకు ఎలాంటి సేవలు అందించాలి, వారితో ఎలా వ్యవహరించాలి, భద్రతకు అనుసరించాల్సిన విధానాలు, ఆహారం, నాణ్యత తదితర అంశాలపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానికులకు, యువతకు ప్రత్యేకంగా శిక్షణ, అవగాహన కల్పించనున్నారు.
ఇవి కూడా చదవండి
కోట్లు కొల్లగొట్టిన ‘వెల్ఫేర్’