ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం!
ABN , Publish Date - May 23 , 2026 | 04:52 AM
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నూతన విద్యాసంవత్సరం నుంచే..
ఇకపై స్కూళ్లలో అల్పాహారం కూడా..
విద్యార్థులకు మూడు నెలలకోసారి ట్యూషన్ ఫీజు చెల్లింపు
ప్రైవేటులో ఫీజుల నియంత్రణకు చట్టం
ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
నేడు క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి, ఆమోదం తెలుపనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా అందిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ దీనిని అమలు చేయాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అంశంపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. దీనిపై ఒక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం గతంలోనే తీర్మానించింది. ఈ మేరకు ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సంక్షేమ శాఖల పరిధిలో చదువుకునే విద్యార్థులతోపాటు, ఇతర విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే ట్యూషన్ ఫీజును ఇకపై ప్రతీ మూడు నెలలకొకసారి వారి ఖాతాల్లో జమ చేసే అంశంపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం. ఐఐఐటీ-బాసర (ఆర్‌జీయూకేటీ)కు యూనివర్సిటీ హోదా కల్పించే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇతర అంశాలు.. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, భూముల విలువల పెంపు, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న నిర్వహించాల్సిన కార్యక్రమాలు, విద్యుత్ శాఖ పరిధిలోని మూడు డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న గ్యాస్ ధరల నేపథ్యంలో ప్రజలను సౌరశక్తి వినియోగంవైపు ప్రోత్సహించటం, రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని అధికారికవర్గాలు తెలిపాయి.