గ్లోబల్’ వేదికపైనే వాతావరణ సదస్సు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:40 AM
డిసెంబరు 7, 8 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ వేదికపైనే అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు
నిపుణులు, హాలీవుడ్, బాలీవుడ్ నటులు,
పర్యావరణ వేత్తలకు ఆహ్వానాలు పంపాలి: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 7, 8 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ వేదికపైనే అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా నిర్వహించే వాతావరణ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన వాతావరణ నిపుణులు, పర్యావరణ వేత్తలు, హాలీవుడ్, బాలీవుడ్ నటులను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎల్‌నినో సన్నద్ధత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్ధ్యాన్ని పెంచడం, హరిత పెట్టుబడులు... ఈ సదస్సులో చర్చనీయాంశాలుగా ఉంటాయని తెలిపారు. సచివాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో ఆయన సమావేశయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి నుంచి మే వరకు తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉంచడం, కరువు ప్రభావానికి గురయ్యే వర్గాలను ఆదుకోవడం వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చిస్తామన్నారు. సదస్సుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు రాజేంద్ర సింగ్, సునీతా నారాయణన్, సద్గురు, నార్వే మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోల్హేమ్ లాంటి వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సినీనటి దియామీర్జాను ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.