ఆలయాల్లో ఇకపై సొంత ప్రసాదం
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:30 AM
తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు అందజేసే లడ్డు, ఇతర ప్రసాదాల తయారీలో దేవాదాయ శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై ఏ దేవాలయంలోనూ ప్రసాదాల తయారీ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు గానీ, కేటరింగ్ ఏజెన్సీలకు గానీ అప్పగించకూడదని ఉత్తర్వులు జారీచేసింది.
ప్రైవేట్ వ్యక్తులు, కేటరింగ్ ద్వారా తయారీకి స్వస్తి
అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయాల్లోనే తయారీ
విజయ నెయ్యినే వాడాలని దేవాదాయ శాఖ ఆదేశాలు
బాసర, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు అందజేసే లడ్డు, ఇతర ప్రసాదాల తయారీలో దేవాదాయ శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై ఏ దేవాలయంలోనూ ప్రసాదాల తయారీ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు గానీ, కేటరింగ్ ఏజెన్సీలకు గానీ అప్పగించకూడదని ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలోనే ప్రసాదాలను తయారు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది. ప్రస్తుతం పలు ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, ఇతర సరుకులన్నీ ఆయా దేవస్థానాలే కొనుగోలు చేసి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అందిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ప్రసాదాలను తయారుచేసి ఆలయాలకు అందిస్తున్నారు. ఇందు కోసం దేవస్థానాలు ఆ కాంట్రాక్టర్లకు కొంత మొత్తం చెల్లిస్తున్నాయి. అయితే, ఈ విధానం వల్ల లడ్డూ ప్రసాదాల తయారీలో నాణ్యత, పవిత్రత కొరవడుతున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ విధానాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల్లో వంట సిబ్బంది కొరత ఉంటే ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకోవాలని దేవాదాయ శాఖ సూచించింది. లడ్డూల తయారీలో అత్యంత కీలకమైన నెయ్యి కొనుగోలు విషయంలో కూడా కఠిన నిబంధనలు విధించింది. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవల్‌పమెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ విక్రయించే విజయ నెయ్యిని మాత్రమే ప్రసాదాల కోసం వాడాలని ఆదేశించింది. ప్రసాదాల నాణ్యతలో ఏ మాత్రం తేడా వచ్చినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.