భూ అక్రమాలపై విచారణకు ప్రత్యేక కమిటీ
ABN , Publish Date - Sep 25 , 2026 | 02:17 AM
భూ అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. అసైన్డ్, భూదాన్, సీలింగ్, ఇనాం భూములను సొంతం చేసుకున్నట్లు అనుమానిస్తున్న వారిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు గురువారం జీవో 134 జారీ చేశారు
ఐఏఎస్ లు శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా,
హనుమంతు కన్వీనర్‌గా ఏర్పాటు..
జీవో ఇచ్చిన సీఎస్
అసైన్డ్, భూదాన్ భూముల కొనుగోలు, ధరణి
దుర్వినియోగం తదితర 16 అంశాలపై సమగ్ర విచారణ
కేసీఆర్ కుటుంబం ఆధీనంలోని భూములపైనా విచారణ
వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలన్న సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భూ అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. అసైన్డ్, భూదాన్, సీలింగ్, ఇనాం భూములను సొంతం చేసుకున్నట్లు అనుమానిస్తున్న వారిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు గురువారం జీవో 134 జారీ చేశారు. విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు కన్వీనర్‌గా, జనగాం జిల్లా కలెక్టర్ సందీ్‌పకుమార్ ఝా, సంబంధిత జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైతే మధ్యంతర నివేదికలను కూడా సమర్పించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 16న అసెంబ్లీలో 22ఏ భూములపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల దుర్వినియోగంపై పలు అంశాలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో విచారణ చేయాల్సిన అవసరం ఉన్నందున కమిటీ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ, సీలింగ్ మిగులు, అసైన్డ్, జాగీర్, భూదాన్, ఇనాం, అటవీ భూములు, భూసేకరణ, పునరావాసం, నీటి వనరులు, క్యాచ్‌మెంట్ ప్రాంతాలు, ధరణి మాడ్యుల్ సంబంధించి అక్రమాలు, భూ రికార్డుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి, తగిన చర్యలు సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు.
ఐదు జిల్లాలు, 16 అంశాలు..
విచారణ చేయాల్సిన 16 అంశాలు, జిల్లాల వివరాలను ప్రభుత్వం జీవోలో పేర్కొంది. రంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూముల వివరాలను ప్రస్తావించారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, మర్కూక్, శివారు వెంకటాపూర్ గ్రామాల్లో మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూములపై విచారణ చేయనున్నారు. రంగనాయక్ సాగర్ పరిధిలో, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో జలాశయానికి ఆనుకుని ఉన్న భూములు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నాయివీటిపైనా విచారణ నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా జన్వాడ పరిధిలో శతభిష ఆగ్రో, ఇతర కంపెనీలు, వ్యక్తుల నుంచి మాజీ మంత్రి కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బినామీలు కొన్న భూములపైనా విచారణకు ఆదేశించారు. షాబాద్ మండలం మద్దూర్‌లో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో సొంతం చేసుకున్న భూముల్లో ఇనాం భూములు ఉన్నాయని సీఎం అసెంబ్లీలో ప్రస్తావించారు. వాటిపైనా విచారణ చేయనున్నారు. ఇదే జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లో హరీశ్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల చేతుల్లో ఉన్న భూములపై కమిటీ విచారణ చేయనుంది. అదే ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే పీ రోహిత్ రెడ్డి అసైన్డ్ భూమి కొని ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలపైనా విచారణకు ఆదేశించారు. శంషాబాద్ మండలం బహుదూర్‌గూడలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఇతరులు ప్రభుత్వ భూములు కొన్నారనే ఆరోపణలు ఉన్నందున ఆ భూములపైనా విచారణ చేపట్టనున్నారు. గండిపేట మండలం వట్టినాగులపల్లిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరికొందరు కలిసి భూదాన్ భూములు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిపైనా విచారణకు ఆదేశించారు. అదే వట్టినాగులపల్లిలోని శంకరాహిల్స్ భూముల్లో మాజీ గంగుల కమలాకర్ తదితరులు జరిపిన భూముల కొనుగోళ్లపైనా విచారణ చేయనున్నారు. మిడ్‌మానేరు జలాశయానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం, పునరావాస ప్యాకేజీల్లో అనుచిత లబ్ధి పొందారనే ఆరోపణలపై కమిటీ విచారణ చేయనుంది. ఈ విషయంలో జోగినపల్లి రవీందర్‌రావు, జే సౌమ్య పేర్లను జీవోలో ప్రస్తావించారు.
ఈ వార్తలు కూడా చదవండి