బస్సుల తనిఖీలు.. నడిరోడ్డుపై పిల్లలు
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:20 AM
ప్రైవేటు విద్యా సంస్థల నిర్లక్ష్యం, రవాణా శాఖ అధికారుల అత్యుత్సాహం.. పాఠశాలల విద్యార్థులకు శాపంగా మారుతోంది. బస్సుల్లో వెళ్తున్న పిల్లలను నడిరోడ్డుపై దించేసి..
అధికారుల నిర్వాకంతో విద్యార్థులకు ఇబ్బందులు
బడుల ప్రారంభానికి ముందే తనిఖీ చేయరేం?
పిల్లలను స్కూల్‌లో దించాక.. చేస్తే నష్టమేంటి?
మేమెందుకు వేదన పడాలి?: తల్లిదండ్రులు
ఏటా ఇదే తంతు.. నాలుగైదు రోజులు హడావుడి
తాజాగా 60 బస్సుల సీజ్.. 245 కేసులు
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని బస్సులు 2783
నిబంధనలు పాటించని బస్సుల్లో పిల్లలను పంపొద్దన్న అధికారులు
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు విద్యా సంస్థల నిర్లక్ష్యం, రవాణా శాఖ అధికారుల అత్యుత్సాహం.. పాఠశాలల విద్యార్థులకు శాపంగా మారుతోంది. బస్సుల్లో వెళ్తున్న పిల్లలను నడిరోడ్డుపై దించేసి.. తనిఖీలు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోని బస్సులను అప్పటికప్పుడు సీజ్ చేసే క్రమంలో పిల్లలు బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. చేయని తప్పునకు అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు మానసిక వేదన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏటా విద్యా సంస్థల పునః ప్రారంభ సమయంలో రవాణా, ట్రాఫిక్ పోలీస్ శాఖలు రోడ్లపై విస్తృతంగా బస్సుల తనిఖీలు చేపడుతుంటాయి. సరైన పత్రాలు లేని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేని బస్సులు/వ్యాన్లపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైతే సీజ్ చేస్తుంటాయి. అయితే, విద్యా శాఖ, ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఏటా తరగతులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉదయం పాఠశాలకు వెళ్లే వాహనాలను అధికారులు తనిఖీల పేరుతో రోడ్లపై నిలిపేస్తుండడంతో మరో వాహనం వచ్చి తీసుకెళ్లే వరకూ పిల్లలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే, వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యేనాటికే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు ఎందుకు పూర్తి చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జూన్ 15 కన్నా ముందే వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకునేలా పాఠశాలల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు ఎందుకు ఒత్తిడి తేవడం లేదని నిలదీస్తున్నారు. అలాగే, రోడ్లపై కాకుండా తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఆయా విద్యా సంస్థలకు నేరుగా వెళ్లి తనిఖీలు నిర్వహిస్తే... పిల్లలు అనవసర ఇబ్బందులకు గురికాకుండా ఉంటారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఫిట్‌నెస్ లేని వాహనాల్లో విద్యార్థులను తరలించే పాఠశాలల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా గుర్తింపు రద్దునకు చర్యలు తీసుకుంటే పరిస్థితిలో మార్పు వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలి
రవాణా శాఖ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను తరలించే వాహనాలు 25,987 ఉన్నాయి. ఆయా వాహనాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవడానికి జూన్ 15 వరకు గడువు ఇచ్చారు. ఈ గడువులోగా 23,204 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాయి. మరో 2,783 బస్సులు ఇప్పటి వరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందలేదు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తనిఖీలు చేపట్టిన రవాణా శాఖ అధికారులు.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోని 60 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించకపోవడంతో 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఫిట్‌నెస్ లేకున్నా, ఓవర్‌లోడ్ ఉన్నా.. ఆ వాహనాలను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. మోటార్ వాహన చట్టం ప్రకారం వాహన యజమానులు, డ్రైవర్లు, సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపైనా కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు. విద్యార్థులను తరలించే వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు బాధ్యత సంబంధిత పాఠశాల/కళాశాల యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటించని వాహనాల్లో పిల్లలను పంపించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. వాహనాల సీజ్ వంటి సందర్భాల్లో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ విషయంలో పాఠశాలల యాజమాన్యాలతోపాటు తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలని ఒక ప్రకటనలో కోరారు.