Share News

బడి పిల్లల ఎదుగుదలకు ట్రాక్‌ రికార్డు

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:56 AM

ప్రాంతాల వారీగా స్థానిక అలవాట్లకు అనుగుణంగా విద్యార్ధులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హరే కృష్ణా ఫౌండేషన్‌ ప్రతినిధులకు సూచించారు

బడి పిల్లల ఎదుగుదలకు ట్రాక్‌ రికార్డు
RevanthReddy

  • శారీరక పెరుగుదల, చదువులో పురోగతి నమోదు..

  • ప్రాంతాల అలవాట్ల ప్రకారం అల్పాహారం అందించండి

  • ఆహారంలో క్యాలరీలను

లెక్కించేందుకు యాప్‌

  • కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు

కిచెన్ల అనుసంధానం

  • హరేకృష్ణ ఫౌండేషన్‌కు సీఎం సూచన

  • నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌లలో

2 కిచెన్ల ఏర్పాటు

  • 9 కోట్ల విరాళం ఇచ్చిన 2 కంపెనీలు

హైదరాబాద్‌, ఆక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రాంతాల వారీగా స్థానిక అలవాట్లకు అనుగుణంగా విద్యార్ధులకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హరే కృష్ణా ఫౌండేషన్‌ ప్రతినిధులకు సూచించారు. ఆహారంలో విద్యార్ధులకు అందించే పదార్ధాల్లో క్యాలరీలు లెక్కించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను అభివృద్ధి చేయాలన్నారు. హరే కృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. సీఎం సమక్షంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అల్పాహార పథకం కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, చైన్‌ ల్యాబ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఎదుగుదలకు సంబంధించి ట్రాక్‌ రికార్డును నిర్వహించాలని సూచించారు. శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలన్నారు. ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించాలన్నారు. అల్పాహారం బడిలోనే అందించడం వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని చెప్పారు. ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కిచెన్లను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తామని చెప్పారు. శాశ్వతంగా కొనసాగే కార్యక్రమం కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. నవంబర్‌ 30 లోగా సెంట్రల్‌ కిచెన్లు పూర్తి అయ్యేలా చూడాలని హరే కృష్ణా ఫౌండేషన్‌ ప్రతినిధులకు సూచించారు. డిసెంబర్‌ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్‌ కిచెన్ల ప్రారంభించాలని చెప్పారు. సెంట్రల్‌ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు రెండు సంస్థలు సహకారం అందిస్తున్నాయి. నాగర్‌ కర్నూల్‌ కిచెన్‌ కోసం రూ.5.17 కోట్ల చెక్కును జున్నా సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఎండీ శేఖర్‌ రెడ్డి అందించారు. వికారాబాద్‌ కిచెన్‌ కోసం రూ.4 కోట్ల చెక్కును చైన్‌ ల్యాబ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి సమంత డే, వైస్‌ ప్రెసిడెంట్‌ బుగత సంతోష్‌ కుమార్‌ అందించారు. ఇరు సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌, హరేకృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్రదాస్‌ స్వామీజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 04:58 AM