Share News

నేడు రైతు భరోసా నిధుల విడుదల

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:47 AM

వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతుల....

నేడు రైతు భరోసా నిధుల విడుదల

  • తొలుత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకే

  • 41.37లక్షల మంది ఖాతాల్లోకి 2482కోట్లు

  • నిధుల విడుదలను ప్రారంభించనున్న సీఎం

  • దశల వారీగా 73.32లక్షల మందికి ‘భరోసా’

  • 9 వేల కోట్లు సమకూర్చుకునే పనిలో సర్కారు

  • ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ రద్దు

  • హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల విడుదల

హైదరాబాద్‌/ఖమ్మం/చింతకాని, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతుల (పట్టాదారులు)కు దశలవారీగా నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలివిడతలో రెండెకరాల వరకు ఉన్న 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482 కోట్లు విడుదల చేయనుంది. తర్వాత వారం, పది రోజుల్లోపు మిగిలిన రైతులకూ భరోసా విడుదల చేసేందుకు నిధులు సమకూర్చనుంది. రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించి, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడ సభా ప్రాంగణమంతా చిత్తడిగా మారింది. సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీర్వాద సభ జరగాల్సిన ప్రాంతాన్ని పరిశీలించారు. సభాస్థలమంతా చిత్తడిగా మారడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, సభ వాయిదా పడినప్పటికీ రైతు భరోసా నిధుల పంపిణీ కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మంగళవారం సాయంత్రం రైతు భరోసా సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో 5000మంది రైతులు పాల్గొననున్నారు.

2.jpg


నిధుల సర్దుబాటు ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటిన్నర ఎకరాల సాగు భూమికి రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను సుమారు రూ.9వేల కోట్ల నిధులను ప్రభుత్వం సమకూరుస్తోంది. బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.7 వేల కోట్ల మేరు రుణం తీసుకుంటోంది. మంగళవారం నాటికి ఈ రుణం ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశాలున్నాయి. వీటికి మరో రూ.2 వేల కోట్లు జత చేసి.. మొత్తం రూ.9వేల కోట్లతో వానాకాలం రైతుభరోసా పథకాన్ని పూర్తిచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తొలి రోజు (జూన్‌ 30న) రెండు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు... ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ. 2,482 కోట్లు చెల్లించనున్నారు. వారం, పది రోజుల్లో మిగిలిన రైతులకు నగదు బదిలీ చేయనున్నారు. నిరుడు వానాకాలం సీజన్‌లో 9 రోజుల్లో 9 వేల కోట్ల నగదు బదిలీచేసి ప్రభుత్వం రికార్దు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే పద్ధతిలో నగదు బదిలీచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా, రైతులు, ప్రజాప్రతినిధుల, అధికారులు... రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తిచేశారు. కాగా, జూలై 6,7 తేదీల్లో వాతావరణం అనుకూలంగా ఉంటే జగన్నాథపురంలో రైతుభరోసా అందుకున్న లక్షలాది మందితో ఆశీర్వాద సభను నిర్వహిస్తామని భట్టి ప్రకటించారు.

Updated Date - Jun 30 , 2026 | 04:47 AM