ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ గెలుపు
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:18 AM
తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) గెలిచిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) గెలిచిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఈనెల 9న ఈ ఎన్నికలు నిర్వహించగా.. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను 14, 15వ తేదీల్లో నిర్వహించారు. మొత్తం 34,904 మంది ఓటర్లుండగా.. 34,421 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బస్సు గుర్తుతో బరిలోకి దిగిన ఈయూ 18,276 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు 13,113 ఓట్లు, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌కు 1,315 ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు సాధించిన ఈయూ కార్మికుల ప్రతినిధి యూనియన్‌గా అర్హత సాధించిందని.. ఈ గుర్తింపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.