Share News

ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టుకు12 లేన్ల కొత్త హైవే ఇవ్వండి

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:27 AM

తెలంగాణలోని భారత్‌ ఫ్యూచర్‌సిటీ నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకూ ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య లేఖల పరంపర నడుస్తోంది.

ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టుకు12 లేన్ల కొత్త హైవే ఇవ్వండి

  • ఎన్‌హెచ్‌-65 విస్తరణతో లింకు పెట్టొద్దు

  • తెలంగాణ లేఖ.. పరిశీలిస్తామన్న కేంద్రం

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని భారత్‌ ఫ్యూచర్‌సిటీ నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకూ ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య లేఖల పరంపర నడుస్తోంది. ఈ రోడ్డు అవసరం లేదన్న భావన స్ఫురించేలా ఇటీవల కేంద్రం.. రాష్ట్రానికి లేఖ రాయగా, ఆ రోడ్డు ఆవశ్యకతను తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆరు లేన్ల రహదారిగా విస్తరిస్తున్నామని, తద్వారా ఏపీ పునర్య్వవస్థీకరణ చట్టం-2014లో ఇచ్చిన హామీని నెరవేర్చినట్టేనని రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. ఆ లేఖలో పేర్కొన్న ప్రతి విషయానికీ రాష్ట్రం సమాధానం ఇచ్చింది. ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను మంజూరు చేయాలని మరోసారి కోరింది. హైదరాబాద్‌-మచిలీపట్నం పోర్టు వరకు చేయబోయే 6 లేన్ల విస్తరణ పనులకు.. ఫ్యూచర్‌సిటీ-బందరు పోర్టు కొత్త రోడ్డుకు లింకు పెట్టొద్దని విజ్ఞప్తి చేసింది. ఇది రెండు రాజధానులు, ఆ మధ్యలోని కొత్త ప్రాంతాలను కలిపే మార్గమని స్పష్టం చేసింది.


లేఖలో ఏముందంటే..

‘‘పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం పెండింగ్‌ సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన 03.02.2025న జరిగిన సమావేశంలోనూ హైస్పీడ్‌ అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం డీపీఆర్‌ సిద్ధం చేయాలని కేంద్ర్వాన్ని ఏపీ కోరింది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి 09.09.2025న భేటీ అయ్యారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి వరకూ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే కోసం డీపీఆర్‌ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే, హైదరాబాద్‌లోని ముచ్చర్ల సమీపంలో ఉన్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వద్ద ప్రారంభమై, అమరావతి మీదుగా బందరు పోర్ట్‌ సమీపంలో 297.82 కిలోమీటర్‌ వద్ద ముగిసేలా తాత్కాలిక అలైన్‌మెంట్‌ను సమర్పించాం. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పొడవు తెలంగాణలో 118 కిలోమీటర్లు, ఏపీలో 179 కి.మీ. ఉంటుంది. దీనికోసం డీపీఆర్‌ కన్సల్టెంట్‌ను నియమించాలని, ఫ్యూచర్‌ సిటీ బందర్‌ పోర్ట్‌ వరకు 12 లేన్ల (120 మీటర్ల వెడల్పు - ఆర్వోడబ్ల్యూ) గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాం. హైదరాబాద్‌ సమీపంలో ప్రతిపాదించిన మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ (డ్రై పోర్ట్‌)ను బందర్‌ పోర్ట్‌తో అనుసంధానించే ఎక్స్‌ప్రెస్‌ వే అవసరం ఎంతైనా ఉంది. ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047’ డాక్యుమెంట్‌లోనూ ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్ట్‌ ఒక భాగమే.


కేంద్రం ఎన్‌హెచ్‌-65లోని ప్రస్తుత 4 లేన్ల హైదరాబాద్‌-విజయవాడ -మచిలీపట్నం సెక్షన్‌ను మరేదైనా ప్రోగ్రామ్‌ లేదా నిధుల కింద 6 లేన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ కారిడార్‌గా అప్‌గ్రేడ్‌ చేయవచ్చు. అయితే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 నిబంధనల కింద మాత్రం కాదు. అందుకే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద ఇప్పటికే సమర్పించిన అలైన్‌మెంట్‌ ప్రతిపాదనల ప్రకారం, హైదరాబాద్‌ (భారత్‌ ఫ్యూచర్‌ సిటీ) నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్ట్‌ వరకు 12 లేన్ల (120 మీటర్ల రైట్‌ ఆఫ్‌ వే) గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను మంజూరు చేయవలసిందిగా మరోసారి కోరుతున్నాం.’’ అని కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలోని విజ్ఞప్తులను.. పరిశీలిస్తామని కేంద్రం మౌఖికంగా చెప్పినట్టు సమాచారం.

Updated Date - Mar 23 , 2026 | 04:28 AM