ప్రాజెక్టులకు జలకళ..
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:22 AM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగానైనా రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలవడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఎల్లంపల్లికి 75 వేల క్యూసెక్కులు
శ్రీరాంసాగర్‌కు 3,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మేడిగడ్డ బ్యారేజీకీ వరద ఉధృతి
మిడ్ మానేరుకు ఎత్తిపోతలు
జూరాలకు భారీగా వరద
లక్ష క్యూసెక్కులకు పెరిగే చాన్స్
అప్రమత్తం చేసిన సీడబ్ల్యూసీ
శ్రీశైలానికి 18 వేల క్యూసెక్కులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగానైనా రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలవడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలు, స్థానిక పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. గోదావరి బేసిన్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 75వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 11 టీఎంసీలకు చేరుకోగానే నంది పంప్ హౌస్‌లోని నాలుగు మోటార్లను ఆన్ చేసి, మిడ్ మానేరుకు 12,600 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. మిడ్‌మానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 27.55 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రం 7.576 టీఎంసీల నీరు ఉంది. క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి 4,556 క్యూసెక్కుల వరద వస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద క్రమంగా పెరుగుతోంది.
బుధవారం సాయంత్రం 74,390 క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో నమోదైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3,500, కడెం ప్రాజెక్టుకు 9,225 క్యూసెక్కుల వరద వచ్చిచేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 84 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇక కృష్ణాపై ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి బుధవారం 80 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 89,520 క్యూసెక్కులను జూరాలకు విడుదల చేస్తున్నారు. బుధవారం జూరాలకు 53 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇది లక్షకు చేరే అవకాశం ఉందని జాతీయ డ్యామ్ సేఫ్టీ, కేంద్ర జల సంఘం బుధవారం రాత్రి హెచ్చరించింది. జూరాల స్పిల్‌వే గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేయాలని అధికారులకు సూచించింది. గేట్లు తెరిస్తే కృష్ణమ్మ ఉరకలేస్తుందని, నదీ తీర గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లవద్దని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. దివి గ్రామం గుర్రంగడ్డ ప్రజలు పుట్టి ప్రయాణం చేయవద్దని సూచించారు. కాగా, జూరాలలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,312 క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 18,349 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 823.70కు చేరింది.